చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం


ప్రపంచ వ్యాపితంగా వ్యాపారాలు చేస్తున్న అతి పెద్ద చిల్లర సరుకుల అమ్మకం దారులు (రిటైల్ అమ్మకాలు సాగించే సూపర్ మార్కెట్లు) వాల్ మార్డ్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీలను భారత దేశంలోకి అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కోసం అనేక సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు భారత దేశంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. భారత దేశ దళారీ పాలకులు, దళారి కంపెనీల తృప్తికి సరిపడా బేరాలు కుదరలేదేమో, ఇన్నాళ్ళూ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు విదేశీ కంపెనీలను సంతృప్తిపరుస్తూ భారత ప్రభుత్వం ఈ అంశంలో నిర్ణయాత్మకంగా ముందుకు కదిలింది. సింగిల్ బ్రాండ్ రంగంలో 100 శాతం, మల్టి బ్రాండ్ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.

అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు గొడవ ప్రారంభించాయి. దేశవ్యాపితంగా అనేక కోట్లమంది చిల్లర దుకాణాల (వీటినే పచారీ కొట్టు అనీ, కిరాణా షాపు అనీ, ఖాతా కొట్టు అనీ పిలుస్తుంటాము) పై ఆధారపడి ఉన్నందున, ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులు అనుమతిస్తే వారంతా రోడ్డున పడతారనీ విపక్షాలు వాదిస్తున్నాయి. శుక్రవారం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేయడానికి విపక్షాలు పూనుకున్నాయి. ఈ కార్యక్రమాలకు యు.పి.ఎ భాగస్వామ్య పక్షం అయిన త్రిణమూల్ కాంగ్రెస్ నాయకత్వ పాత్ర వహించడం గమనార్హం. విపక్షాల ఆందోళనతో లోక్ సభ అనేకసార్లు వాయిదా పడింది.

మమతా బెనర్జీ పార్టీ సభ్యులు రాజ్యసభలో పోడియం వద్దకు దూసుకు వచ్చి కార్యక్రమాలకు అంతరాయం కల్గించారు. లోక్ సభలో ప్లే కార్డులు ప్రదర్శించారు. బి.జె.పి, శివసేన సభ్యులు లోక్ సభలో ప్లె కార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించేది లేదని బి.జె.పి చాలా కాలం నుండి చెబుతోంది. వామ పక్ష పార్టీలు కూడా ఆందోళనలో భాగం పంచుకున్నాయి. బహుళ పక్షాల ఆందోళనలతో సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. నేటి వాయిదాతో ఇంతవరకు జరిగిన శీతాకాల సమావేశాలన్నీ ఏ చర్చా చేయకుండానే గడిచిపోయినట్టయ్యింది. 2 జి స్పెక్ట్రం కెసులో చిదంబరం పేరు చేర్చాలనీ, తెలంగాణ డిమాండ్ పైనా, ఈ రోజు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల పైనా వరుసగా సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి.

ఈ లోపు కేబినెట్ నిర్ణయానికి మద్దతుగా ఇతర ప్రభుత్వ సంస్ధలు ముందుకొచ్చాయి. కేబినెట్ నిర్ణయం ఏకంగా ఇండియా ఆర్ధిక వృద్ధికే తోడ్పడుతుందని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సెలవిచ్చాడు. ప్రజల చెంతకు రాని ఆర్ధిక వృద్ధి పెరిగినా, తరిగినా సామాన్య ప్రజానికానికి ఒరిగేదేమీ లేదు, అంతర్జాతీయ వేదికలపైన మన్మోహన్ సింగ్ చెప్పుకుని పొంగిపోవడానికి తప్ప. ఆర్ధిక వృద్ధితో పాటు ద్రవ్యోల్బణం తగ్గడానికి కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించే నిర్ణయం దోహదం చేస్తుందని ఆర్.బి.ఐ గవర్నర్ బల్లగుద్దుతున్నాడు. వాల్ మార్ట్, కేరేఫర్, టెస్కో లాంటి బహుళజాతి బడా రిటైల్ కంపెనీలు వస్తూ వస్తూ మంచి రవాణా సౌకర్యాలను తెస్తాయనీ, మంచి వాహనాలు తెస్తాయనీ తద్వారా రవాణా ఖర్చులు తగ్గి సరుకుల ధరలు తగ్గుతాయని అంతిమంగా ద్రవ్యోల్బణం తగ్గడానికి అది దారి తీస్తుందనీ సుబ్బారావు చెబ్తున్నాడు.

కేబినెట్ నిర్ణయం వల్ల దేశంలో కోటి ఉద్యోగాలు వస్తాయని వాణిజ్యమంత్రి ఆనంద శర్మ ఊదరగొట్టాడు. వీళ్ళ దృష్టిలో వాల్ మార్ట్ కంపెనీ బైట రెండో, మూడో వేలకు కాపలా కాసే ముసలి భారతీయుడి కి కూడా ఉద్యోగం దొరిగినట్లే లెక్క.

రిటైల్ కంపెనీలే కాదు, గతంలో అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించేటప్పుడు కూడా ఇలాంటి కబుర్లే పాలకులు చెప్పారు. విదేశీ పెట్టుబడులు ప్రవేశించిన ఏ రంగంలోనూ ధరలు తగ్గిందేమీ లేదు. చిన్న కంపెనీలను మింగెయ్యడం ద్వారా పోటీ లేకుండా చేసుకుని ధరల్ని పెంచారే తప్ప తగ్గించింది లేదు. అయినా ఇంకా అవే వాదనలను ఆర్.బి.ఐ గవర్నర్ తో సహా వల్లించడం ప్రజలను నిండా మోసగించడమే. తమ రిటైల్ దుకాణాలకు సరుకులను భారత దేశం నుండే తీసుకోవాలని షరతు పెట్టినట్లుగా చెబుతున్నారు. షరతైతే పెట్టామని చెబుతున్నారు గానీ దాన్ని అమలు చేయడానికి చట్టపరమైన ఏర్పాట్లు ప్రకటించలేదు. షరతు పాటించకపోతే ఏం చేయనున్నారో చెప్పలేదు.

అసలు దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించడానికి విదేశీ కంపెనీలపై ఆధారపడడమే మన ఆర్ధిక మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్.బి.ఐ గవర్నర్ లు సిగ్గుపడాల్సిన విషయం. దేశీయంగ ఉన్న అడ్డంకుల్ని అధిగమించి ద్రవ్యోల్బణం తగ్గించడం చేతగాక దేశీయంగా కోట్లమందికి స్వయం ఉపాధిని కల్పిస్తున్న రంగాన్ని విదేశీ కంపెనీలకి అప్పగించి వాటిపైన ద్రవ్యోల్బణం తగ్గించే బాధ్యత పెట్టడం తమ చాతకానితనంగా ఈ పెద్ద మనుషులు భావించకపోవడమే పెద్ద వింత. సిగ్గుమాలిన చర్యలతో భారత ప్రజల వనరులను విదేశాల అప్పగించడానికి అలవాటు పడ్డ వీరు బహుశా సిగ్గుపడడం ఎన్నడో మరిచిపోయి ఉండవచ్చు. విదేశీ కంపెనీలు వచ్చి ద్రవ్యోల్బణం తగ్గించేపనైతే వీరికి పదవులెందుకు దండగ! ప్రభుత్వాన్ని కూడా విదేశాలకు అప్పగిస్తే సరి. నిజానికి జరుగుతున్నది అదేనేమో?

4 thoughts on “చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం

  1. గతంలో అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించేటప్పుడు కూడా ఇలాంటి కబుర్లే పాలకులు చెప్పారు. విదేశీ పెట్టుబడులు ప్రవేశించిన ఏ రంగంలోనూ ధరలు తగ్గిందేమీ లేదు.

    Can you briefly explain dis words.

  2. గతంలో కొన్ని పోస్టుల్లో వివరించాను. అయినా మీకోసం మరో పోస్టు రాస్తాను కొద్ది రోజుల్లో.

    మచ్చుకి చెప్పాలంటే, కూల్ డ్రింక్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం, కంపెనీలు చెప్పాయి. ధరలూ తగ్గుతాయని చెప్పారు. తీరా చూస్తే పెప్సీ, కోక్ లు వచ్చి దేశీయ పానీయాలు ధమ్స్ అప్, లిమ్కా, మాజా లాంటివి తయారు చేసే కంపెనీల్ని కొనేసాయి. ఆ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్ని క్రమంగా ఇంటికి పంపారు. ఆ పానీయాలు కూడా పెద్దగా దొరకడంలేదు. కాని వాటి ఖరీదు మాత్రం అప్పటినుండి పెరగడమే తప్ప తగ్గింది లేదు. పోనీ తగ్గకపోతే తగ్గకపోయాయి లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఎక్కడిచ్చారు చూపమంటే కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల్ని, సీసాలు సరఫరా చేశే వాహనాల డ్రైవర్లు, క్లీనర్లను చూపించారు. కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల్లో (బడ్డీ కొట్లు) కూల్ డ్రింక్సే కాకుండా ఇంకా చాలా సరుకులు అమ్ముతారు. ఆ సరుకులు తయారు చేసే కంపెనీల లెక్కల్లో కూడా ఈ ఉద్యోగులు ఉంటారు. ఆ విధంగా ఒక బడ్డీ కొట్టు వ్యాపారి అనేక కంపెనీల జాబితాల్లో తాము ఉద్యోగం కల్పించిన వ్యక్తిగా స్ధానం పొందుతాడన్నమాట! ఇదే అడిగితే ఆ కంపెనీల నుండి సమాధానం రాలేదు. ఇది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం సంగతి. ఈ సమాచారం ఇచ్చిన ఆంగ్ల వ్యాసాన్ని నేనే తెలుగులోకి అనువదించి ఒక పక్ష పత్రికకి కూడా పంపాను.

    జనరల్, లైఫ్ ఇన్సూరెన్సు రంగాల్లో ఎఫ్.డి.ఐ లు అనుమతించేటప్పుడు వినియోగదారులకి అత్యంత తక్కువ ధరలకి పాలసీలు అమ్మి రిస్క్ కవర్ చేస్తారని చెప్పారు. కాని ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నే తక్కువ ధరలకి పాలసీలు రూపొందించి ఇవ్వగలుగుతోంది. ప్రవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు సిటీలు, పెద్ద పట్నాలు తప్ప గ్రామాలను పూర్తిగా వదిలేశాయి. వారి దృష్టిలో గ్రామీణులకు రిస్క్ కవరేజ్ అవసరం లేదన్నమాట. గ్రామీణులకి తక్కువ ధరలో, కొద్ది మొత్తంలో భీమా మొత్తానికి పాలసీలు ఇవ్వవలసి ఉంటుంది. అది ప్రవేటు కంపెనీలకి లాభసాటి కాదు కనక గ్రామాలపైన అవి చూపు సారించవు. ఉద్యోగాల విషయానికి వస్తే ప్రారంభంలో కొద్ది మంది ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్ధలనుండి ఆశగా ప్రవేటు కంపెనీలకి వెళ్లారు. వారిప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారు. రాత్రింబవళ్ళు పని చేసినా రిజల్టు చూపకపోతే ఉద్యోగం గోవిందా. ప్రధాన ఉద్యోగులు తప్ప క్లరికల్ ఉద్యోగులంతా టెంబరరీ బాపతే. ఎప్పుడైనా ఇంటికి పొమ్మనవచ్చు. ఇంతా చేసి ప్రవేటు కంపెనీలు సేకరించిన సొమ్ము ఇండియాలో ఉండదు. వారు తమ సోదర కంపెనీల్లో పెట్టుబడులకు తరలిస్తారు తప్ప ప్రభుత్వానికి అందుబాటులో ఉండదు. కాని ఎల్లైసి, ఇతర జి.ఐ.సి కంపెనీలు సేకరించే సొమ్ము ప్రభుత్వానికి పూర్తిగా అందుబాటులో ఉంటూంది. ప్రభుత్వ కార్యక్రమాలకి ఎప్పటికీ తీర్చనవసరం లేని అప్పులు కూడా అవి ఇస్తాయి.

    ఈ రెండు ఉదాహరణలు మీకు వివరించగలవా?

  3. నా అభిప్రాయం కూడా అదే.రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడి పూర్తిగా అనవసరం.చిన్న వ్యాపారస్తులు దెబ్బ తింటారు.కావాలంటే advanced technologiesలో పెట్టుబడిపెట్టమనండి.

  4. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ లో ఛస్తే పెట్టుబడులు పెట్టరు. ఒకటీ అరా పెట్టినా ఆ పరిజ్ఞానం రహస్యంగా ఉంచుకుంటారు తప్ప ప్రభుత్వాలు చెప్పినట్లు మనకి ఇవ్వనే ఇవ్వరు. ఆ విషయం కూడా అనేక మార్లు రుజువయ్యింది.

వ్యాఖ్యానించండి