పొదుపు విధానాలతో బాగా పడిపోయిన బ్రిటన్ల ఆదాయాలు


బడా బహుళజాతి కంపెనీలను సంక్షోభం నుండి బైటపడేయానికి ఇచ్చిన బెయిలౌట్ల కోసం అప్పులు తెచ్చిన పశ్చిమ దేశాల ప్రభుత్వాలు సదరు అప్పులు తీర్చడానికి ప్రజలపైనే భారం మోపుతూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల వల్ల బ్రిటన్ లో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయని ప్రభుత్వ సంస్ధ ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ (ఒ.ఎన్.ఎస్) చేసిన సర్వేలో తేలింది. అదే సమయంలో సీనియర్ మేనేజర్ల వేతనాలు మాత్రం అనేక రెట్లు పెరిగిందని కూడా సర్వే తెలిపింది.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సమయంలో అమెరికా, యూరప్ ల బడా కంపెనీలు పెట్టుబడుల విలువ పడిపోయి, అప్పులు దొరక్క దారుణ పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయంలో అక్కడి ప్రభుత్వాలు గుట్టల కొద్దీ పెట్టుబడులు అప్పులు తెచ్చి ప్రవేటు కంపెనీలలో కుమ్మరించాయి. ఆ పెట్టుబడులు మేసిన కంపెనీలు సంక్షోభం నుండి బైటపడి లాభాల బాట పట్టాయి. కాని వాటికోసం చేసిన అప్పు పెరిగి కొండత అయ్యింది. బడ్జెట్ ఖర్చులు తగ్గించుకుని డబ్బులు మిగిల్చుకుని అప్పులు తీర్చాలని ప్రభుత్వాలు పధకం వేశాయి. అయితే ఖర్చులు తగ్గించుకునే పధకంలో ప్రభుత్వాలకు కార్మికులు, ఉద్యోగులు ఇతర చిన్న వ్యాపారులు మాత్రమే కనిపించారు తప్ప అప్పులు మేసిన బడా కంపెనీలు కనపడలేదు. బడ్జెట్ ఖర్చులు తగ్గించడానికి కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాల అమలు ప్రారంభించాయి.

ఆ విధానాలలో భాగంగా కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో కోత పెట్టారు. వారికి ఇస్తున్న సదుపాయాలను రద్దు చేయడం లేదా కోత పెట్టడం చేశారు. సంక్షేమ పధకాలను రద్దు చేశారు. పెన్షన్ లలో కోత పెట్టారు. నిరుద్యోగ భృతి లాంటి సౌకర్యాలలో తీవ్రంగా కోత పెట్టారు. ప్రజల ఆరోగ్య భీమా కోసం, వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చును బాగ తగ్గించేశారు. ఇన్ని చేసిన బ్రిటన్ ప్రభుత్వం బడా కంపెనీలు, బ్యాంకుల సి.ఇ.ఓ తదిత ఉన్నత ఆదాయ జీతగాళ్ల కు వేతనాలను గతంలో కంటే పెంచేసింది. వారికి ఇచ్చే బోనస్ లను కొనసాగించింది. వారి సదుపాయాలను పెంచింది. కంపెనీలకు ఇచ్చే పన్నుల రాయితీలను కొనసాగించడమో, మరింత పెంచడమో చేసింది. బడా కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలలు కొనసాగించింది. ఈ విధానాలతో కార్మికుల వేతనాలు బాగా పడిపోయాయి. ఆదాయ అంతరాలు పెరిగిపోయాయి.

ఈ విధానాల ఫలితాన్ని ఓ.ఎన్.ఎస్ చక్కగా ప్రతిబించింది. ఇది వాస్తవానికి ప్రభుత్వ సంస్ధ. ప్రభుత్వ సంస్ధ చేసిన సర్వే కనుక సాధ్యమైనంతగా వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేయడం సహజం. అలా మసిపూసిన వాస్తవాలే ఇంత చేదుగా ఉన్నాయి. సర్వే ప్రకారం బ్రిటన్ ఉద్యోగుల వేతనాలు ద్రవ్యోల్బణంతో పాటుగా పెరగకపోవడంవల్ల 3.5 శాతం పడిపోయాయి. ఇందులో వేతనాల కోత వలన సంభవించిన తరుగుదలను ప్రస్తావించకపోవడం గమనార్హం.

పూర్తి కాలపు కార్మికుడి సగటు వేతనం 2011 లో 1.4 శాతం పెరిగి 26,244 పౌండ్లకు చేరుకుందని సర్వే తెలిపింది. కాని ప్రధాన ద్రవ్యోల్బణం ఇదే కాలంలో 5 శాతం పెరగడంతో నిజ వేతనాలు పెరగకపోగా 3.6 శాతం నికరంగా తగ్గిపోయాయి. మొత్తం మీద చూస్తే వేతనాల పెరుగుదల ఇంకా తక్కువని సర్వే తెలిపింది. 2010 తో పోలిస్తే వేతనాల పెరుగుదల మొత్తం మీద 0.5 శాతం మాత్రమేనని తేలింది. దాని ప్రకారం మొత్తం మీద నిజ వేతనాలు 4.5 శాతం పడిపోయాయన్నమాట! పూర్తికాలపు ఉద్యోగులకు పార్ట్ టైం ఉద్యోగులను కూడా కలిపి మొత్తం మీద సగటు ఆదాయం పెరుగుదలను లెక్క వేయడం జరుగుతుంది.

నిరుద్యోగం పెద్ద ఎత్తున వ్యాపించడం, ఆర్ధిక వృద్ధి బాగా తక్కువగా ఉండడం వల్ల పూర్తికాలపు ఉద్యోగాల కోసం వెతకడం మానేసి పార్ట్ టైం ఉద్యోగాలతో సరిపెట్టుకోవడం వల్ల ఈ పరిస్ధితి దాపురించిందని సర్వే వివరించింది. ఉదాహరణకి 2011లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 380,000 పూర్తి కాలపు ఉద్యోగాలు రద్దయ్యాయనీ, 72.000 పార్ట్ టైమ్ ఉద్యోగాలు పెరిగాయని సర్వే తెలిపింది. ఆదాయాల చెల్లింపుల్లో లింగ వివక్షను అంతం చేసే దిశగా కృషి ఈ కాలంలో బలహీనపడిందని సర్వే కనుగొంది. పూర్తికాలపు ఉద్యోగాల్లో పురుషుడి కంటే స్త్రీ సగటున 5,409 పౌండ్లు తక్కువ సంపాదిస్తోంది. ఈ తేడా 2009 లో 558 పౌండ్లు తగ్గిపోగా 2010లో  కేవలం179 పౌండ్లు మాత్రమే తగ్గింది. ఇదే లెక్కన స్త్రీ, పురుషుల ఆదాయలలో అంతరాల తగ్గుదల కొనసాగితే, పురుషులతో పాటు స్త్రీలు సమాన వేతనాలను పొందడం 2041 వరకూ సాధ్యం కాదు. ఎంతో అభివృద్ధి సాధించామని చెబుతున్న బ్రిటన్ లో స్త్రీల ఆదాయాలు ఇంకా పురుషుల కంటె తక్కువగా ఉండడం సిగ్గుపడాల్సిన విషయం కాగా ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల్లో సైతం స్త్రీలు ఎక్కువగా బలికావలసిన పరిస్ధితి ఉండడం అత్యంత శోచనీయం.

ప్రధాన స్రవంతి గణాంకాలు నిజానికి అత్యంత తక్కువ వేతనాలు పొందేవారు ఎదుర్కొంటున్న నష్టాలనూ, అత్యధిక వేతనాలు పొందేవారు అనుభవించే లాభాలనూ తక్కువ చేసి చూపుతోందని కూడా సర్వే తెలిపింది. ప్రాధమిక వృత్తులలో (కూలీలు, వ్యవసాయ కూలీలు, పోస్టల్ కార్మికులు తదితర పనులు) ఉన్న వారి ఆదాయాలు 2010తో పోలిస్తే పెరగడానికి బదులు 0.9 శాతం తగ్గిపోయాయి. అదే ప్రొఫెషనల్స్ ఆదాయాలు 1 శాతం పెరగ్గా, మేనేజర్ల వేతనాలు 0.5 శాతం పెరిగాయని సర్వే తెలిపింది. కాని కంపెనీల డైరెక్టర్లు, సి.ఇ.ఓ ల వేతనాలు మాత్రం పెద్ద ఎత్తున పెరిగాయని సర్వే తెలిపింది. వారి వేతనాలు సరాసరి 15 శాతం పెరిగి 112,157 పౌండ్లకు చేరుకుంది. సి.ఇ.ఓ లు, డైరెక్టర్లకు ఇచ్చే బోనస్ లపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో కంపెనీలు తెలివిగా బోనస్ లలో అధిక భాగాన్ని వేతనాలలో కలిపేసి బోనస్ లు తగ్గించినట్లుగా నాటకమాడాయి. దీని ఫలితంగా వారి వేతనాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి.

సీనియర్ కార్పొరేట్ మేనేజర్ల వేతనాలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. వారి వేతనాలు గత సంవత్సరంతో పోలిస్తె సగటున 7.1 శాతం పెరిగి 77,679 పౌండ్లకు చేరుకున్నాయి. ఈ అంకెలతో పోలిస్తే ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగాలుగా ఉండే హోటల్ వెయిటర్, వెయిట్రెస్ ల వేతనాలు సగటున 11.2 శాతం పడిపోయి 5,660 పౌండ్లకు చేరుకుంది. అత్యంత దారుణంగా పడిపోయిన వేతనాలు ఇవే. క్లీనింగ్ సిబ్బంది వేతనాలు 3.4 శాతం మేరకు పడిపోయాయి.

బ్రిటన్ ఎదుర్కొంటున్న బలహీన ఆర్ధిక వృద్ధికి ప్రధాన కారణం వేతనాలు పడిపోవడమేనని ఈ గణాంకాలు నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. వేతనాలను సమృద్ధిగా ఉన్నప్పుడే మార్కెట్లలో ఉన్న సరుకులు అమ్ముడు కావడానికి ఆస్కారం ఉంటుంది. కంపెనీలు ఏ మార్కెట్ కోసమైతే సరుకులు తయారు చేస్తాయో ఆ మార్కెట్ లోని వినియోగదారుల వేతనాలనే పెద్ద ఎత్తున కోత కోస్తే సరుకులు అమ్ముడు పోక అధికోత్పత్తి సంక్షోభం తలెత్తడం అనివార్యం. ఆ పరిస్ధితిని నివారించడానికి కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలను పెంచడమే కాకుండా ఆరోగ్య ఖర్చులు లాంటి భారాలు వారిపై పడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అయితే ప్రభుత్వాలను నియంత్రించే బడా కార్పొరేట్ కంపెనీలు ఎన్నటికీ ఆ చర్యలను ప్రభుత్వాలు తీసుకోవడానికి అనుమతించవు. పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఉండే ప్రాధమిక వైరుధ్యమే ఇది.

వ్యాఖ్యానించండి