
తమిళనాడు ప్రభుత్వం ‘డ్యాం 999′ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించింది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలనుండి సినిమా ప్రదర్శన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాడు. ముల్లైపెరియార్ డ్యాం ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మించారని డి.ఎం.కె పార్టీ అధిపతి కరుణానిధి ఆరోపించాడు. లోక్ సభలో బుధవారం డి.ఎం.కె ప్రతినిధులు సినిమాను నిషేధించాలని కోరారు. వైకో నాయకత్వంలోని ఎం.డి.ఎం.కె పార్టీ కూడా సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని కోరింది.
సినిమా ప్రదర్శన వల్ల కేరళ, తమిళనాడులలో శాంతియుతంగా సహజీవనం చేస్తున్న మళయాళీలు, తమిళుల మధ్య విబేధాలు తలెత్తి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని రాజకీయ పార్టీలు అభ్యంతరం చెప్పాయి. అయితే సినిమా ప్రదర్శనపైన నిషేధం విధించడం ‘దురదృష్టకరం’ అని సినిమా దర్శకుడు సోహాన్ రాయ్ అభివర్ణించాడు. నిషేధం పై సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆయన ప్రకటించాడు. సెన్సార్ బోర్డు సినిమా ప్రదర్శనకు అనుమతిచ్చినందున సినిమాపై నిషేధం తగదని ఆయన పేర్కొన్నాడు.
“మరే ఇతర సినిమాకూ ఇటువంటిది జరగకూడదు. భారత దేశంలో సృజనాత్మక కృషి పైన ఇటువంటివి జరగడానికి వీల్లేదు. అటువంటి చర్యలు సృజనాత్మక బుర్రలను చంపేస్తాయి” అని సోహాన్ పేర్కొన్నాడు. యు.ఎ.ఇ లో సినిమా విడుదల కోసం దుబాయ్ లో ఉన్న సోహాన్ ఫోన్ ద్వారా తన సినిమా విషయమై స్పందించాడని ‘ది హిందూ’ తెలిపింది. డ్యాం 999 సినిమా ఒక ‘సామాజిక కారణం’ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చిత్రమని ఆయన తెలిపాడు. డ్యాం ల వల్ల కలిగే ప్రమాదాలపైన ప్రజలలో అవగాహన పెంచే చిత్రమని తెలిపాడు. డ్యాం లు కూలిపోతే సంభవించగల అనూహ్య పరిణామాలను సినిమాలో వివరించామని తెలిపాడు. సినిమా ప్రదర్శన పట్ల నిషేధం విధిస్తేనే సమాజానికి ‘తప్పుడు సంకేతాలు’ అందుతాయని ఆయన పేర్కొన్నాడు. సినిమాలో ముల్లైపెరియార్ డ్యాం గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆయన తెలిపాడు.
మద్రాసు రాష్ట్రానికి కొంత భూభాగాన్ని 999 సంవత్సరాల లీజుకి ఇచ్చారనీ ఆ భూభాగంలో తమిళనాడు ప్రభుత్వం డ్యాం నిర్మించ తలపెట్టిందనీ ఆ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా సినిమా రూపొందిందని అంతా భావిస్తున్నారు. డ్యాం కూలిపోయినట్లయితే పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తాయంటూ సినిమాలో ఆధారం లేని భయాలను రేకెత్తించారని వారు ఆరోపిస్తున్నారు. సినిమా వల్ల మళయాళీలు, తమిళుల మధ్య శతృభావం తలెత్తవచ్చని వారు భయాలు వ్యక్తం చేశారు.

ముల్లై పెరియార్ డ్యాం పైన సుప్రీం కోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉండగా డ్యాం కూలిపోవడాన్ని ఊహిస్తూ సినిమా తీశారని కరుణానిధి ఆరోపించాడు. రాష్ట్ర ప్రభుత్వం సినిమాను నిషేధించాలని కరుణానిధి కోరిన మరుసటి రోజునే సినిమా ప్రదర్శనను తమిళనాడులో నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నో చెత్త సినిమాలకు కధలు, మాటలు రాసిన కరుణానిధి, ఇలా వాచించడం తగదు.. సినిమా అన్నాక ఈన్నో కల్పితాలు గట్రలు ఉంటాయి…తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ పని అంతా!!!
చక్రాల కుర్చీ పరిస్ధితి దాపురించినా, అటువంటి రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ లేకపోవడం భారత ప్రజల దౌర్భాగ్యం.