మావోయిస్టులతో చర్చలు అంటూనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి నాయకుడు కిషన్ జీ ని ఎన్‌కౌంటర్ లో చంపేసింది. బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ప్రభుత్వ బలగాల నుండి తృటిలో తప్పించుకున్నాడన్న వార్తలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఎన్‌కౌంటర్ లో చనిపోయాడన్న వార్త వెలువడింది.
మావోయిస్టు పార్టీలో నెం.2 గా పత్రికలు అభివర్ణిస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ గతంలో అనేకసార్లు ఎన్‌కౌంటర్ నుండి తృటిలో తప్పించుకుపోయాడని పత్రికలు రాశాయి. ఒక రోజు క్రితం తప్పించుకుపోయాడన్న జంగల్ మహల్ ప్రాంతంలోనే ఆయన ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడని తిరుగుబాటు వ్యతిరేక బలగాల అధికారి చెప్పినట్లు ‘ది హిందూ’, ‘ఫస్ట్ పోస్ట్’ పత్రికలు తెలిపాయి.
58 సంవత్సరాల మల్లోజుల కోటేశ్వర్రావు మిలట్రీ ఎత్తుగడల్లో దిట్ట అని పత్రికలు పలుమార్లు కధనాలు ప్రచురించాయి. లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో టాటా కంపెనీ నెలకొల్పదలచిన నానో ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో త్రిణమూల్ కాంగ్రెస్, మావోయిస్టు పార్టీలు రెండూ కలిసి పని చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పటినుండీ బెంగాల్ లో మావొయిస్టు ఉద్యమానికి కిషన్ జీ నాయకత్వం వహించాడని పోలీసులు అనేకసార్లు చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లో నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన సింగూరు ఉద్యమం, సలీం కంపెనీ నెలకొల్పదలిచిన సెజ్ వ్యతిరేక నందిగ్రాం ఉద్యమం, అనంతరం బెంగాల్ పోలీసు అత్యాచారాలకు వ్యతిరేకంగా చెలరేగిన లాల్ ఘడ్ ఉద్యమాలలో మావోయిస్టులు పాల్గొన్నారనీ ఆ ఉద్యమాలలో కిషన్ జి యే నాయకత్వం వహించాడనీ పత్రికా కధనాలు, వార్తలు వెలువడ్డాయి.
పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని బురిసోల్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. నిన్న కిషన్ జీ తప్పించుకుపోయినప్పటి నుండీ ఉమ్మడి బలగాలు కూంబింగ్ కొనసాగించాయి. ఎన్‌కౌంటర్ ను భద్రతా బలగాల అధికారి “జంగల్ మహల్ ఎన్‌కౌంటర్” గా అభివర్ణించాడు. కిషన్ జీ తన సహచరులలో కొందరు, తన భార్య సుచిత్ర మహతో తో సహా కుష్బోని అడవుల్లో ఉన్నారని నిర్ధిష్ట సమాచారం అందడంతో ఉమ్మడి బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయని తెలుస్తోంది. కిషన్ జీ చుట్టు ఉన్న నాలుగుంచెల భద్రతా వలయాన్ని బలగాలు ఛేదించి ఆయన్ని చంపేశాయని తెలుస్తోంది.
కుష్బోని అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కిషన్ జీ మూడు సంవత్సరాలనుండీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. జంబోని పోలీసి స్టేషన్ ఏరియాలోని బురిసోల్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఉదయం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం జార్ఖండ రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో ఉంది.
కిషణ్ జీ విగత శరీరాన్ని పక్కనే పడి ఉన్న ఎకె-47 తుపాకి ద్వారా గుర్తించినట్లుగా భద్రతా దళాల అధికారి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. కిషన్ జీ భార్య సుచిత్ర మెహతో దాడినుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒక ల్యాప్ టాప్ సంచి, కిషన్ జీ సుచిత్ర లు రాసిన కొన్ని ఉత్తరాలు, మరికొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సమీపంలోని గోసాయ్ బంద్ గ్రామం నుండి స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాల అధికారి తెలిపాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులతో చర్చలు జరుపుతానని అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్నట్లుగానే చర్చలు జరిపాడు. అయితే చర్చలు బూటకమేనని ఆ తర్వాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. చర్చలు జరుగుతుండగానే వివిధ భద్రతా సంస్ధలు మావోయిస్టు పార్టీలోకి చొచ్చుకెళ్ళే పనిని విజయవంతంగా పూర్తి చేశాయని వివిధ పత్రికా కధనాలు వెల్లడించాయి. ఆ తర్వాత మావోయిస్టు పార్టీపై సాగిన నిర్బంధం. అందులో ఎ.పి లో మావోయిస్టు పార్టీ దాదాపుగా కనుమరుగు కావడం ఆ కధనాలు రుజువు చేశాయి.
ఇదే ఎత్తుగడను బెంగాల్ లో కూడా మమతా బెనర్జీ కాస్త అటు ఇటుగా అమలు చేసినట్లు కనిపిస్తోంది. అధికారానికి వచ్చి మూడు నెలలు గడవక ముందే మావోయిస్టులకు ఆయుధాలు వదలాలని షరతు విధించింది మమత. లేకుంటె నిర్బంధం తప్పదని హెచ్చరించిన కొద్ది రోజులకే కిషన్ జీ ఉరఫ్ మల్ళోజుల కోటేశ్వర్రావు హత్య జరిగింది.