పాకిస్ధాన్ కు కొత్త రాయబారి, పంత నెగ్గించుకున్న పాక్ మిలట్రీ


అమెరికాలో పాకిస్ధాన్ రాయబారిగా కొత్త వ్యక్తి నియమితులయ్యారు. పాకిస్ధాన్ మిలట్రీని కట్టడి చేయాలంటూ అమెరికా మిలట్రీ ఛీఫ్ కు మెమో రాశాడంటూ పాత రాయబారి హుస్సేన్ హక్కానీ పైన ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసిన సంగతి విదితమే. పాకిస్ధాన్, అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి హుస్సేన్ హక్కానీ చాలా కృషి చేశాడనీ కావున ఆయన రాజీనామా ఆమోదం పొందక పోవచ్చనీ చేసిన ఊహాగానాలను పటా పంచలు చేస్తూ హక్కానీ రాజీనామాను పాకిస్ధాన్ ప్రభుత్వం ఆమోదించింది. పాకిస్ధాన్ పరిపాలనలో అక్కడి మిలట్రీకి ఉన్న పై చేయి ఈ సందర్భంగా మరోసారి రుజువయ్యింది.

అమెరికాకు పాకిస్ధాన్ నుండి కొత్త రాయబారిగా షెర్రీ రెహ్మాన్ నియమితురాలయ్యింది. దివంగత్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోకు సన్నిహితురాలుగా షెర్రీ పేరు సంపాదించుకుంది. ఒక మ్యాగజైన్ ఎడిటర్ గానూ మాజీ సమాచార శాఖ మంత్రి గానూ ఆమె పని చేసింది. పాకిస్ధాన్ పాలక పార్టీలో ఆమె ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందని చెబుతారు. లిబరల్ భావాలు కలిగిన వ్యక్తి. షెర్రీ పాకిస్ధాన్ లోని ‘దైవ దూషణ చట్టం’ ను వ్యతిరేకిస్తూ అనేకసార్లు మాట్లాడింది. అందుకు గాను ఆమె మిలిటెంట్ల హిట్ లిస్ట్ లో స్ధానం సంపాదించుకుంది. ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరినందుకు ఒక మంత్రి ఆయన అంగరక్షకుని చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఇటీవలనే అతనికి మరణ శిక్ష విధించబడింది. అయితే మరణ శిక్ష విధించిన జడ్జి సైతం ప్రాణ భయంతో దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది.

అమెరికా ప్రత్యేకబలగాలు, పాకిస్ధాన్ కు తెలియకుండా పాక్ గగనతలం లోకి చొరబడి బిన్ లాడెన్ ను హత్య చేసిన అనంతరం పాక్ మిలట్రీ మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పధకం వేస్తున్నదంటూ ఒక మెమో అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు అందింది. పాక్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ తరపున ఆ లేఖను హుస్సేన్ హక్కానీయే మైక్ ముల్లెన్ కు ఆ మెమోను అందజేశాడని ఆరోపణలు వచ్చాయి. పాక్ లో అక్కడి మిలట్రీ అధికారాన్ని చేజిక్కించుకోకుండా అమెరికా కట్టడి చేయాలనీ, అందుకు ప్రతిఫలంగా పాకిస్ధాన్ కి కొత్త భద్రతా బృందాన్ని నియమించి అందులో ఎవరు ఉండాలన్న విషయాన్ని అమెరికా ఇష్టానికి వదిలేస్తామని అసిఫ్ జర్దారీ హామీ ఇచ్చినట్లుగా మెమోలో పేర్కొనబడింది. పాకిస్ధాన్ లో మిలిటెంట్లపై యధేచ్ఛగా దాడులు చెయ్యడానికి పూర్తి అనుమతి అమెరికాకి ఇస్తామని కూడ ఆ మెమోలో హామీ ఇచ్చారు.

మెమోను తాను రాయలేదని హుస్సేన్ హక్కానీ చెబుతున్నాడు. ఆయనే రాశాడని పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారి ఇజాజ్ తెలిపాడు. తన ద్వారానే సదరు మెమోను మైక్ ముల్లెన్ కు పంపారని ఇజాజ్ ఆరోపించాడు. పాకిస్ధాన్ పైన మైక్ ముల్లెన్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని చెప్పడానికే ఆ విషయాలను బైటపెట్టవలసి వచ్చిందని కూడా ఇజాజ్ ఓ పత్రికకు రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నాడు. ఈ నేపధ్యంలో హుస్సేన్ హక్కానీని వెంటనే పాక్ రావలసిందిగా పాక్ ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్ధాన్ కి వచ్చిన అనంతరం హుస్సేన్ తన పదవికి రాజీనామా సమర్పించాడు.

హుస్సేన్ వాస్తవానికి పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ కి సన్నిహితుడిగా పేరు పొందాడు. పాకిస్ధాన్  అమెరికాల సంబంధలౌ క్షీణిస్తున్న దశలో హుస్సేన్ సమర్ధవంతంగా వ్యవహరించి పరిస్ధితి మరీ క్షీణించకుండా చేయడంలో కృషి చేశాడని పేరు సంపాదించాడు. అందువలన ఆయన రాజీనామా పై పునరాలోచన జరుతుందని విశ్లేషకులు భావించినప్పటికీ పాక్ మిలట్రీకి ఆయన కోపం తెప్పించినందున రాజీనామాయే అంతిమంగా ఆమోదం పొందింది. అసలు పాకిస్ధాన్ రాయబారిగా హుస్సేన్ హక్కానీని తొలగించడానికి పాక్ మిలట్రీయే సదరు ‘మెమో’ ను సృష్టించిందని కూడా కొంతమంది సూచిస్తున్నారు. హుస్సేన్ హక్కానీని కాపాడడానికి పాక్ అధ్యక్షుడు జర్దారీ కృషి చేస్తాడని భావించినప్పటికీ పాక్ మిలట్రీదే అంతిమ నిర్ణయంగా వెలువడింది.

అమెరికాలో పాక్ రాయబారి పదవి ఇరు దేశాలకూ కీలకమైనది. ఇరు దేశాల మధ్య తరచుగా సంబంధాలు దెబ్బ తింటున్న నేపధ్యంలో పాక్ రాయబారి పదవి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదని భావిస్తారు. రాయబారి పదవిలో షెర్రీ నియామకం అసిఫ్ ఆలీ జర్దారీ కి అనుకూలంగానే జరిగిందని భావించవచ్చు. పాకిస్ధాన్ లో పౌర ప్రభుత్వం ఏర్పడి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ పరిపాలనపైన మిలట్రీ పట్టు సడలలేదనడానికి హుస్సేన్ హక్కానీ ఉదంతం ఒక దృష్టాంతం.

2 thoughts on “పాకిస్ధాన్ కు కొత్త రాయబారి, పంత నెగ్గించుకున్న పాక్ మిలట్రీ

  1. విశేఖర్ గారు “పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు -2 వ భాగం” ఇంకా పోస్ట్ చేయలేదు…మీరు మరచిపోయినట్టు ఉన్నారు

వ్యాఖ్యానించండి