
వాడ్ని గిరజాల జుట్టోడని వాళ్ళు తెగ ఆడిపోసుకున్నారు,
అది తమ బర్బర ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ సంపద అన్నాడు.
సర్వ సేనానిగా ఉండి ఆఫ్ట్రాల్ కల్నల్ బిరుదేమిటన్నారు,
జనరల్ కంటే కల్నలే సిపాయిల్లో మమేకతకి సాధనమన్నాడు.
రాజై రాజ దుస్తులొదిలి సైనిక దుస్తుల ధారణేమిటని వెక్కిరించారు,
అది ‘ప్రపంచ పోలీసు’ పై సాయుధ ప్రతిఘటనా సంకేతమన్నాడు.
విదేశీ సభలకీ ఒంటె, టెంటు, మందీ, మార్బలాలు ఆటవికమన్నారు,
ఎడారి మూలవాసుల బిడారి వృత్తిపట్ల ఆత్మగౌరవ చిహ్నమన్నాడు.
బాడిగార్డులుగా ఆడ గార్డుల నియామకం అశ్లీల చర్యగా ఆరోపించారు,
విదేశీ దాడికి గురయ్యే ప్రధాన స్ధానాల రక్షణకి స్త్రీలే తగు యోగ్యులన్నాడు.
అరబ్బేతర ఆఫ్రికన్ బంటూ గణాలకి బందూకులెందుకని దెబ్బారు,
సోదర నీగ్రో ప్రజల విమోచనా లక్ష్యానికది సాధనమన్నాడు.
ఓడల హైజాకింగ్ పైరేట్లకి వత్తాసు ఇవ్వడం ఉగ్రవాదమన్నారు,
అస్తిత్వాన్ని కోల్పోయిన భూమి పుత్రుల జల గెరిల్లాల రూపం అన్నాడు.
కన్నబిడ్డలకు దేశ సంపదలన్నీ కట్టబెట్టాడని కారు కూతలు కూశారు,
దేశం కోసం బాంబుదాడుల్లో నేలకొరిగిన ఒక్కొక్క కొడుకే జవాబన్నాడు.
విభిన్న తెగల మధ్య విద్వేషాల చిచ్చు రగిల్చి రాజకీయం చేశాడన్నారు,
రాజవంశపు ‘మీగడ ముఠా’ మీద సకల తెగల ఏకీకరణపై అక్కసన్నాడు.
‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ లో కొడుక్కి పట్టాపై నిందలేస్తిరి,
గొర్రెల కాపరి తెగస్తుడికి ప్రతిష్టాకర డిగ్రీ పట్ల అది అక్కసన్నాడు.
ఎడారి సేద్యంకై వాడి బృహత్తర పధకాన్ని ‘పిచ్చోడి స్వప్నం’ అన్నారు,
చేసి చూపించి ఎవరు పిచ్చోడని ప్రశ్నించి నోళ్ళు మూయించాడు.
నిరుపేద రాజ్యాన్ని బర్బరుడు ఎలా ఏలగలడని హేళన చేశారు,
సంపన్న రాజ్యాలకి లొంగని స్వతంత్ర రాజ్యంగా నలభైయ్యేళ్ళు ఏలాడు.
చచ్చిందాకా వాడ్ని దుమ్మెత్తి పోసినోళ్ళు, ‘బతికినా చచ్చినోళ్ళే’
దుమ్మూ ధూళితో మట్టిలో కలిసినోడు మాత్రం ‘చచ్చినా సదా బతికెటోడే’
—రచన: పి. ప్రసాదు (‘ప్రజా పంధా’ పక్ష పత్రిక నుండి)
అమెరికా అగ్ర వాదం మీద ఉగ్ర రూపం దాల్చి విజేతగా నిలచినంత మేరకు గడాఫీ మొనగాడే!అధికార౦ ఎత్తుల మీదికి చేరుకున్న తరువాత జారిపోకుండా మరింత అప్రమత్తంగా వుండవలసిన అవసరం లేదా! ఏమరిస్తే ఏమవుతుందో గడాఫీ చరిత్రే మనకు ఉదాహరణ.
మనం సరే …ఆ పాలకుని పాలితుల ప్రతిస్పందనకు సమాధానం ఏమి చెప్పుకుందాము?