‘ఇష్రత్ జహాన్’ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకం, నరేంద్ర మోడికి మరో లెంపకాయ


నరేంద్ర మోడి హయాంలో గుజరాత్ పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్ ల గుట్టుమట్లు ఒక్కొక్కటీ వెల్లడవుతున్నాయి. నిప్పులాంటి నిజాలు తమను ఆవహించిన నివురుని చీల్చుకుని బైటికి వస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) పందొమ్మిదేళ్ళ విద్యార్ధినితో పాటు మరొక ముగ్గురు యువకులను ఉత్తి పుణ్యానికి కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా కధ అల్లిన ఘటనపైన విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇష్రత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్ ప్రాణేష్ పిళ్ళై, అంజాద్ అలీ రాణా, జీషన్ జోహార్ లు ఎన్‌కౌంటర్ గా చెప్పబడుతున్న సంఘటనకు ముందే చనిపోయారని తేల్చి చెప్పింది.

ఇష్రత్ జహాన్, మరో ముగ్గురు గుజారాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్రపన్ని పధకాన్ని అమలు చేయడానికి పూనుకున్న పరిస్ధితిలో వారు ఎన్‌కౌంటర్ లో చనిపోయారని గుజరాత్ పోలీసులు కధ అల్లి వినిపించారు. ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా చెప్పబడుతున్న జూన్ 15, 2004 కంటే ముందే హతులు హత్య చేయబడ్డారని సిట్ నిర్ధారించింది. దానితో కోర్టు నేరంపై తాజాగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ జయంత్ పటేల్, జస్టిస్ అభిలాష్ కుమారిలతో కూడిన డివిజన్ బెంచి ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 18, 2011 తేదీన సిట్ తన పరిశోధన పూర్తి చేసి తుది నివేదికను సమర్పించింది.

రెండవ ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశాక కేసును కేసును సి.బి.ఐ కి అప్పగించాలా లేక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కి అప్పగించాలా అన్నదానిపైన కోర్టు పరిశీలను జరుపుతోంది. ఆ మేరకు పిటిషనర్లనుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండీ కోర్టు సూచనలను ఆహ్వానించింది. “పరిశోధనా ఏజన్సీ, ఎన్‌కౌంటర్ లో ఎవరు కీలక పాత్ర పోషించినదీ, అందుకు ఏ అంశం వారిని పురికొల్పినదీ, నలుగురూ చనిపోయిన వాస్తవ సమయం ఏమిటీ అన్న అంశాలను పరిశోధించవలసి ఉంటుంది” అని కోర్టు తెలిపింది. సిట్ బృందానికి ఆర్.ఆర్.వర్మ నాయకత్వం వహించాడు. ఐ.పి.ఎస్ అధికారులు మోహన్ ఝా, సతీష్ వర్మలు సిట్ లో ఇతర సభ్యులు గా ఉన్నారు.

చనిపోయిన నలుగురు లష్కర్-ఎ-తొయిబా సభ్యులుగా గుజరాత్ క్రైం బ్రాంచి ఆరోపించింది. వారు నరేంద్రమోడిని చంపే కార్యక్రమంలో ఉన్నారని తెలిపింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్.పి.తమంగ్ నిర్వహించిన జ్యుడిషిల్ విచారణ సెప్టెంబరు 7, 2009 తేదీన నివేదిక సమర్పించింది. అది కూడా ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చింది. పోలీసు అధికారులు తాము లబ్ది పొందడానికి నలుగురిని హత్య చేశారని తేల్చి చెప్పింది. కేసు విచారణను, గుజరాత్ హైకోర్టు నేరుగా పర్యవేక్షించింది. గత సంవత్సరం సిట్ ను నియమించింది.

బూటకపు ఎన్‌కౌంటర్ నిందితులైన పోలీసు అధికారులు డి.ఐ.జి డి.జి.వంజారా, ఎ.సి.పి ఎన్.కె.అమీన్ లు సోరాబుద్ధీన్ షే బూటకపు ఎన్‌కౌంటర్ లో కూడా నిందుతులుగా ఉండడం గమనార్హం. వీరిరివురూ ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. కోర్టులు రాజకీయ నాయకులు, బ్యూరాక్రట్ అధికారులు లాంటి పెద్దలపైన విచారణ జరిపుతున్నపుడల్లా దానిని సాధారణ విచారణలా చూడకుండా కోర్టుల చురుకుదనం అంటూ పేరు పెట్టి అదేదో జరగాని కార్యక్రమంగా చెప్పడానికి కార్పొరేట్ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు అతీతంగా కూడా కోర్టులు పని చేయవలసిన అవసరం ఉంది.

2 thoughts on “‘ఇష్రత్ జహాన్’ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకం, నరేంద్ర మోడికి మరో లెంపకాయ

  1. ఇలాంటి లెంపకాయలు ఎన్ని పడ్డా, మోడీకి, అతని భజనపరులకి సిగ్గు రాదులెండి. శిశుపాలుడి లా ఇతని పాపం పండి, జైలు ఊచలు లెక్కబెట్టే రోజు తొందర్లోనే రాకపోదు.చనిపోయేదీ, నష్టపోయేదీ అమాయక ముస్లింలే కదా, మనక్కావాల్సిన ఆర్థికాభివృద్ది(?) మాకు ఇస్తున్నాడు కాబట్టి, మా మోడీ గొప్పోడు అని, అతని భజనపరులు అతన్ని ఎంతగా భుజాలకెత్తుకున్నా.. అమాయకుల్ని బలిగొన్న ఉసురు అంత ఈజీగా అతన్ని వదలదు..

  2. మోడీ చేసినది అభివృద్ధి కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గ్లోబలైజేషన్ పేరుతో ఎలాంటి విధానాలు అనుసరించాడో, గుజరాత్‌లో మోడీ అలాంటి విధానాలే అనుసరించాడు. కానీ ఇక్కడ చంద్రబాబు ఎన్నికలలో ఓడిపోయాడు కాబట్టి అతన్ని పొగడడం లేదు, మోడీ ఎన్నికలలో గెలిచాడు కాబట్టి పొగుడుతున్నారు, అంతే. బేసికల్‌గా ఆర్థిక విధానాలలో చంద్రబాబుకీ, మోడీకీ మధ్య తేడా లేదు.

వ్యాఖ్యానించండి