అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్


అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం ఇప్పటికే ప్రారంభమయ్యిందని కూడా చెబుతున్నారు.ఈ రెండు ఉపసంహరణలూ మధ్య ప్రాచ్యం నుండి అమెరికా ఉనికిని బలహీనపరిచేవే.

“ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి వెళ్ళిపోతున్నంత మాత్రాన అమెరికా ఆసియానుండి పూర్తిగా వెళ్లిపోతున్నట్లు కాదు” అని ఒబామా కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రకటించాడు. అందులో భాగంగానే ఉత్తర ఆస్ట్రేలియాలో కొత్తగా సైనిక స్ధావరం ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా సూచనలిచ్చాడు. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో ఎదుర్కొన్న ఓటమికి ఉత్తర ఆస్ట్రేలియాలో సైనిక స్ధావరం నెలకొల్పడం ద్వారా పూడుస్తున్నామని ఒబామా పరోక్షంగా సూచించాడు. అంతేకాదు. ఒబామా అసలు ఉద్దేశ్యం చైనాను హెచ్చరించడమే. అమెరికా ఆసియానుండి వెళ్ళిపోతున్నదని ఇక తమదే ఇష్టారాజ్యమనీ చైనా భావించరాదని ఒబామా చెప్పదలుచుకున్నాడు. అది గ్రహించింది కనుకనే ‘దక్షిణ చైనా సముద్రం జోలికి రావద్దు’ అని చైనా అమెరికాను హెచ్చరించడమే కాక ‘ఆసియా ఖండం ఆసియన్లదే అని చాటి చెపుదాం’ అని ఇండియాను కలుపుకుని పోయే ప్రయత్నాన్ని చైనా ప్రధాని చేశాడు.

నిజానికి అమెరికా, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లను దురాక్రమించింది వెళ్ళిపోవడానికి కాదు. తన ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగానే అది దురాక్రమణలకు తెగబడింది. కాని అంతులేని ఆయుధ బలగంతో విర్రవీగుతున్న అమెరికాను అనూహ్యంగా కేవలం టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా చేత ప్రశంసలు అందుకున్న ప్రభుత్వేతర సాయుధ బలగాలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాయి. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ ఇరాక్ లను దురాక్రమించడానికి ముందు అక్కడి ప్రభుత్వాలు ముందుగానే అమెరికాని హెచ్చరించాయి. వస్తే తగిన గుణపాఠం నేర్పుతామని. వారు అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆరేడు నెలల్లో ముగుస్తాయనుకున్న యుద్ధాలు కనీసం ఆరు సంవత్సరాలు కాదు కదా, పది సంవత్సరాలయినా ముగుస్తున్న జాడల్లేవు. యుద్ధాలు ఆర్ధిక వ్యవస్ధకు పెనుభారంగా మారడంతో ‘చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా’ “మా పనయ్యింది, కనుక మేం వెళ్ళిపోతున్నాం” అంటూ మేకపోతు గాంభీర్యంతో బారక్ ఒబామా ప్రకటించుకోక తప్పలేదు. ఆ లోటును ఆస్ట్రేలియా సైనిక స్ధావరంతో పూడుస్తున్నాం అని ఒబామా ప్రపంచానికి తెలిపాడు.

మధ్య ఆసియాలో ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ ల తలుపులు మూసుకుంటెనేం, ‘చైనా భయం’ సాకుతో ఉత్తర ఆస్ట్రేలియాలో సైనిక స్ధావరం తలుపులు అమెరికా కోసం తెరుచుకున్నాయి.

వ్యాఖ్యానించండి