పాకిస్ధాన్ ప్రభుత్వంతో పాక్ తాలిబాన్ చర్చలు


పాకిస్ధాన్ కి చెందిన తాలిబాన్, పాక్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతున్ననట్లుగా ఒక సీనియర్ తాలిబాన్ కమాండర్ ప్రకటించాడు. దక్షిణ వజీరిస్ధాన్ ప్రాంతంపైన చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకటించింది. వజీరిస్ధాన్ చర్చలు సఫలం ఐతే చర్చలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తాలిబాన్ కమాండర్ తెలిపాడు. చర్చలు ఫలప్రదం కావడానికి తాలిబన్ అనేక డిమాండ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఖైదీల విడుదల కూడా ఒకటని కమాండర్ తెలిపాడు. తెహరీక్-ఎ-తాలిబాన్ పాకిస్ధాన్ (టిటిపి) గా పిలిచే పాక్ తాలిబాన్ ను అమెరికా, టెర్రరిస్టు సంస్ధగా ప్రకటించింది. చర్చలలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పష్తూన్ గిరిజన తెగల నాయకుడు చర్చలను “చాలా కష్టమైనవి” గా అభివర్ణించినట్లుగా రాయిటర్స్ తెలిపింది.

పాక్ తాలిబాన్ తో చర్చలను అమెరికా అనుకూలంగా లేకపోవచ్చని రాయిటర్స్ చెబుతోంది. కాని ఆఫ్ఘన్ తాలిబాన్ తోనే చర్చలు జరపడానికి అమెరికా సిద్ధపడినప్పుడు పాక్ తాలిబాన్ తో చర్చించడానికి అమెరికాకి అభ్యంతరం ఎందుకు ఉంటుందో వివరించలేదు. గతంలోనూ టిటిపి తో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. ఆ చర్చల ద్వారా తాలిబాన్ తమ బలగాలను మళ్ళి కూడగట్టుకుని బలం సంపాదించి రెట్టించిన శక్తితో దాడులకు తెగబడడానికే దారితీసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. “అవును, మేము చర్చలు జరుపుతున్నము. కాని అవి ప్రారంభ దశలోనే ఉన్నాయి. చర్చలు సఫలం అయ్యేదీ లేనిదీ చూడాలి. ఇప్పటికైతే దక్షీణ వజీరిస్ధాన్ స్ధాయి వరకే చర్చలు. అవి సఫలం ఐతే ఇతర అన్ని ట్రైబల్ ప్రాంతాలపైన ఒక అంగీకారానికి రావడానికి వీలవుతుంది” అని తాలిబాన్ కమాండర్ తెలిపాడు. కమాండర్ తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదని రాయిటర్స్ తెలిపింది.

పాక్ తాలిబాన్, ఆఫ్ఘనిస్ధాన్ తాలిబాన్ తో కలిసి ఆఫ్ఘనిస్ధాన్ నుండి విదేశీ సైన్యాన్ని పారద్రోలడానికి పోరాడుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెప్పకుండా పాక్ గగలనతలం లోకి చొరబడి బిన్ లాడేన్ ను చంపడం పాక్ మిలట్రీకి ఆగ్రహం తెప్పించిందని భావిస్తున్నారు. పాకిస్ధాన్ సౌర్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన ఆ దాడితో అమెరికాకు పాక్ మిలట్రీ సహకరించడం బాగా తగ్గించింది. పట్టుబట్టి పాకిస్ధాన్ లో పని చేస్తున్న సి.ఐ.ఎ గూఢచారులను అనేకమందిని పాక్ వదిలి వెళ్ళవలసిందిగా ఆదేశించింది. సి.ఐ.ఎ అధిపతి వచ్చి మంత్రాంగం నెరిపినప్పటికీ పాక్ ఆర్మీ వినలేదు.

ఆఫ్ఘనిస్ధాన్ పైన అమెరికా నేతృత్వంలోని నాటో సేనలు దురాక్రమణ చేసిన తర్వాత పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ లు తీవ్రమైన అస్ధిరత్వాని ఎదుర్కొంటున్నాయి. ఈ అస్ధిరత్వానికి కారణం అమెరికా దురాక్రమణ కాగా రాయిటర్స్, బిబిసి, ది గార్డియన్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో స్దిరత్వం నెలకొల్పడానికి అమెరికా తదితర నాటో బలగాలు ప్రయత్నిస్తున్నట్లుగా దొంగ రాతలు రాస్తున్నాయి. సహాయం పేరుతో పైసలు విదిల్చి ఆఫ్-పాక్ లనుండి కట్టలు దోచుకు వెళ్లే అమెరికా దోపిడీని ప్రస్తావించకుండా అమెరికా సహాయం లేకపొతే ఆఫ్-పాక్ ప్రభుత్వాలు బతకలేవన్నట్లుగా వార్తలు రాస్తాయవి.

ఆఫ్-పాక్ లపై ఏ వార్తలు రాసిన ప్రతి వార్తలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా సహాయం పైనే ఆఫ్-పాక్ లు ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని ప్రస్తావించడం ఈ కార్పొరెట్ పత్రికలకు ఒక దినసరి కర్తవ్యం. నాటో దురాక్రమణ తర్వాత యుగోస్లోవియా ఎన్ని ముక్కలు చెక్కలయ్యిందీ, అక్కడ మాఫియాలు ఎలా ప్రభుత్వాలు నడుపుతున్నదీ ఈ పత్రికా సంస్ధలు చెప్పవు. మధ్య ఆసియాలోని పాత సోవియట్ రాజ్యాలలో కూడా నాటో బలగాలు, వారి ఎన్జీఓ సంస్ధలు కుయుక్తులు పన్ని వివిధ జాతులు తెగల మధ్య వైష్యమ్యాలను పెంచి పోషించాయి.

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి అమెరికా సైనికులను ఉపసంహరించుకుంటామని ఒబమా ప్రకటించిన నేపధ్యంలో వెళ్లబోయే ముందు ఆ దేశాల్లో సుస్ధిరతను స్ధాపించడానికి అమెరికా తెగ కష్టపడుతున్నట్లుగా పశ్చిమ దేశాల విష పత్రికలు రాస్తున్నాయి. అందులో భాగంగానే మంచి తాలిబాన్ తో అమెరికా చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పైకి చెబుతున్నాయి. కాని వాస్తవం మరోలా ఉంది. దురాక్రమణ యుద్ధాలను కొనసాగించే పరిస్ధితిలో ఇప్పుడు అమెరికా లేదు. రెండు దురాక్రమణ యుద్ధాలు ఆక్రమణకి గురైన దేశాలతో పాటు ఆక్రమించిన దేశాలను కూడా పీకలలోతు సంక్షోభం లోకి నెట్టి వేశాయి. యుద్ధాల కోసం తెచ్చిన అప్పు ఆర్ధిక సంక్షోభానికి దారి తీయగా, సంక్షోభంలో ప్రవేటు కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు రుణ భారాన్ని మరింత పెంచాయి. దానితో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీనపడింది. నిరుద్యోగం పెచ్చరిల్లింది. ఈ సమస్యల నుంది బైటపడడానికి మంచి ఆఫ్ఘనిస్ధాన్ తో చర్చలంటూ నాటకం మొదలు పెట్టి ఏదో ఒకరంగా గౌరవంగా ఆఫ్ఘనిస్ధాన్ నుండి బైటపడాలని అమెరికా చూస్తోంది.

ఈ సంవత్సరాంతానికల్లా విదేశీ సైన్యాలు ఇరాక్ ను వదిలి వెళ్లకపొతే వచ్చే సంవత్సరం నుండి వారు గతంలో పాల్పడిన మానవ హక్కుల ఉల్లంఘన కేసులను తిరగదోడి ఇరాక్ కోర్టుల్లోనే విచారిస్తామని ఇరాక్ అధ్యక్షుడు ప్రకటించాడు. దానితో ఏడెనిమిది సంవత్సరాలు ఇరాక్ లో దుర్మార్గాలను సాగించిన అమెరికా సైన్యం అక్కడినుండి కూడా బిఛాణా ఎత్తేయబోతున్నట్లుగా ఒబామా ప్రకటించాడు. నిజానికి తక్షణమే సైన్యాలను ఉపసంహరించుకోవడం ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లతో పాటు అమెరికా ఆరోగ్యానికి కూడా ఉపయోగమే.

వ్యాఖ్యానించండి