లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా, యూరప్ లతో సహకరించిన అరబ్ లీగ్, ఇప్పుడు సిగ్గు విడిచి సిరియాను కూడా పశ్చిమ దేశాల విష పరిష్వంగంలోకి నెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. లిబియా గగనతలాన్ని ‘నిషిద్ధ గగనతలం’ గా ప్రకటించి అమలు చేయడంలోనూ, ఆదేశంపై పశ్చిమ దేశాలు ఏడు నెలలపాటు బాంబు దాడులు చేసి సర్వనాశనం చేయడంలోనూ అరబ్ లీగ్ కూటమి అమెరికా, యూరప్ లకు పూర్తిగా సహకరించింది. పశ్చిమ దేశాల ఎంగిలి మెతుకులకు రుచిమరిగిన అరబ్ లీగ్, ఇప్పుడు సిరియాను నాశనం చేసే దిశలో పశ్చిమ దేశలతో కలిసి అడుగులు వేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిరియాను అరబ్ లీగ్ నుండి తొలగిస్తూ తీర్మానం చేసింది. సిరియాలోని నామ మాత్రపు ప్రతిపక్షం ‘సిరియా నేషనల్ కౌన్సిల్’ ‘అంతర్జాతీయ మానవతా జోక్యం’ కావాలంటూ చేస్తున్న ప్రకటనలకు పరోక్ష మద్దతు ఇస్తోంది.
ఈజిప్టు, ట్యునీషియాలలో జరగని మానవతా జోక్యం లిబియా, సిరియాలకే ఎందుకు అవసరమయ్యిందో అరబ్ లీగ్ వివరించగల పరిస్ధితిలో లేదు. లిబియా, సిరియాలలో లేని తిరుగుబాటును సృష్టించి ఆ దేశాల ప్రభుత్వాలపై నిరంతరం దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రపంచవ్యాపితంగా వ్యతిరేకతను సృష్టించి దాని మాటున పశ్చిమ దేశాలు వినాశనానికి తెగపడుతున్నాయి. ఈ విషయం తెలిసి కూడా అరబ్ లీగ్ పశ్చిమ దేశాల కుట్రలలో భాగస్వామ్య పాత్ర పోషిస్తోంది.
