చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను అనుమతించింది. అది కూడా 51 శాతం వరకు మాత్రమే విదేశీ పెట్టుబడులను అనుమతించింది. అంటే ఏ సరుకైనా ఒకే ఒక్క బ్రాండుకి సంబంధించిన సరుకుని రిటైల్ ధరలకు అమ్ముకోవచ్చు గాని ఒకే సరుకులో వివిధ రకాలా బ్రాండులను గానీ లేదా అనేక సరుకులను తయారు చేసి అనేక రకాల కంపెనీల బ్రాండులను గానే రిటైల్‌గా అమ్మకూడదు. సింపుల్ గా చెప్పాలంటే సూపర్ మార్కెట్లను విదేశీ కంపెనీలు నడపకూడదు. కేవలం దేశీయ కంపెనీలు మాత్రమే ప్రవేటుగా సూపర్ మార్కెట్లను నడపవచ్చు.
ఇప్పుడా పరిస్ధితిని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అనేక సంవత్సరాలనుండి వాల్ మార్ట్, టెస్కో లాంటి విదేశీ బహుళజాతి రిటైల్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపించడానికి కసరత్తు చేస్తొంది. గుర్తొచ్చినప్పుడల్లా పెట్రోల్, డీజెల్, గ్యాస్ ధరలు పెంచి ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసేది ప్రభుత్వాలే. మళ్ళీ ద్రవ్యోల్బణం తగ్గించే పేరుతొ వడ్డీ రేట్లను ఆర్.బి.ఐ పెంచుతుంది. తద్వారా అరకొరగా అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాలను మరింత ప్రియంగా మార్చివేశారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గించే పేరుతోనే విదేశీ రిటైల్ కంపెనీలను దేశంలోకి అనుమతించి రిటైల్ దుకాణదారులను నిరుద్యోగ సైన్యంలోకి ప్రభుత్వం చేర్చుతోంది.
‘అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా, ప్రజలకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత నుండి ప్రభుత్వాలు ఎలాగూ తప్పుకుంటున్నాయి. స్వయం ఉపాధి చూసుకుంటున్న వారి ఉపాధిని చెడగొట్టడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ దగుల్బాజీ ప్రభుత్వాలు ఎక్కడ ఏ కొంచెం ఆదాయం వచ్చేవీలున్నా దానిని తీసుకెళ్ళి ప్రవేటు కంపెనీలకు, అది కూడా విదేశీ ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడానికే నిర్ణయించుకుంటున్నాయి. విదేశీ ప్రవేటు కంపెనీలు తప్ప ఇంకెవ్వరూ ఆదాయ మార్గాలలో ఉండకూడదు. చివరికి చిల్లర దుకాణలను సైతం విదేశీ కంపెనీలకి అప్పజెపుతున్న ఈ ప్రభుత్వాల దుర్మార్గాన్ని ఏ పేరున పిలవాలి?
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించాలని ఇప్పటివరకూ నిబంధన ఉండగా దానిని 100 శాతానికి పెంచాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విదేశీ కంపెనీలు వస్తే అవి తమతో పాటు టెక్నాలజీని తెస్తాయనీ, మంచి గోడౌన్లు తెస్తాయనీ, రవానా వాహనాలను మంచివి తెస్తాయనీ ప్రభుత్వం చెబుతోంది. తద్వారా సరుకుల రవాణా వేగంగా జరిగుతుందనీ, రవాణా నష్టాలు తగ్గుతాయనీ, రవాణా ఖర్చులు తగ్గుతాయనీ, చెబుతోంది. దానివలన సరుకుల ధరలు తగ్గుతాయనీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రభుత్వపరంగా ఏ చర్యలూ తీసుకోకుండా విదేశాలు తెచ్చే టెక్నాలజీ, గోడౌన్ల పైన ఆధారపడతామనడానికి ఈ ప్రభుత్వాలకి సిగ్గైనా ఎందుకు వెయ్యదు?
ద్రవ్యోల్బణం అన్నది భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ కు సంబంధించిన ఒక లక్షణం. దానికి పరిష్కారం మన ఆర్ధిక వ్యవస్ధలోనే చూడాలి. అలా చూస్తేనే అది నిజమైన పరిష్కారం అవుతుంది. దానికి బదులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులకు మేలు చేయడం కోసమే సమస్యలను పెద్దవిగా అయ్యేంతవరకూ ఎదురు చూసి పెద్దవిగా మారాకా తమ వల్ల పరిష్కారం కాదని చేతులెత్తేసి అంతా తీసుకెళ్ళి విదేశీ కంపేనీల చేతుల్లో పెడుతున్నాయి. ఈ పద్ధతిని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక వ్యూహంగా అమలు చేసి భారత ప్రజల ఆదాయ మార్గాలను ప్రవేటుకంపెనీల పరం చేస్తున్నది.
ఇండియాలో రిటైల్ మార్కెట్ 450 బిలియన్ డాలర్ల విలువ కలిగినదిగా రాయిటర్స్ సంస్ధ లెక్క కట్టింది. అంటే అది 22.5 లక్షల కోట్ల రూపాయలకు సమానం. ప్రస్తుతం ఈ మార్కెట్ లో అత్యధిక భాగం అంటే 90 శాతం చిన్న దుకాణదారుల చేతుల్లో ఉంది. అంటే కొన్ని పదుల లక్షల కుటుంబాలు చిల్లర దుకాణాలపై ఆధారపడి బతుకుతున్నారు. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతులు లాంటి వర్గాల వారు ఈ దుకాణాల వద్ద ఖాతాలు పెట్టుకుని తమ ఆదాయాల పరిమితిలో జీవనాలు వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇప్పుడు చిల్లర దుకాణాలతో పాటు వారి వద్ద ఖాతాలు పెట్టుకునే ఉద్యోగుల తదితర మద్య, ఎగువ మధ్య తరగతుల కుటుంబాలకు కూడా కష్టకాలం దాపురించింది.
సూపర్ మార్కెట్లలో మధ్యతరగతికి ఖాతాలు పెట్టే సౌకర్యాలు ఉండవు. సూపర్ మార్కెట్ల దెబ్బకు చిల్లర దుకాణాలు మూతపడడంతో వారి దగ్గర ఖాతాలు పెట్టే సమస్యే ఉండదు. ఇక చచ్చినట్లు అధిక ధరలకు లేదా సూపర్ మార్కెట్ వాడు నిర్ణయించిన ధరకు కార్మికుడి దగ్గర్నుండి ధనికుల వరకూ అవే అధిక ధరలకు సరుకులు కొనుగొలు చేయవలసి ఉంటుంది. చిన్న జీతాల వాళ్ళకు పూర్తి సరుకులు దొరక్క అర్ధాకలితో బతకవలసిన జీవితాల సంఖ్య ఇకనుండి మరిన్ని పెరగడం తధ్యం.
విశేఖర్, రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులు, భారత దేశంపై వాటి ప్రభావం పై ఆర్టికల్ బాగుంది. ఇటీవల అవసరం అని ఆర్టికల్స్ రాస్తున్నారు. ఉత్పత్తిదారునికి వినియోగదారునికి మధ్య దళారీ వ్యవస్ధ తగ్గి వినియోగదారునికి తక్కువ ధరకి లభిస్తుంది అని వాదిస్తున్నారు. వ్యవసాయంలో కూడా విదేశీ పెట్టుబడులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాయింట్ కూడా ఆర్టికల్ కవర్ చేస్తే బాగుండేది. -చిట్టిపాటి
అవన్నీ పాత వాదనలే. నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడం ప్రారంభించిన రోజుల్లో ఇవే వాదనలు చేసారు. అవన్నీ తప్పని రుజువయ్యాయి.
దేశీయ పేస్టులన్నింటినీ కోల్గేట్ మింగేసింది. కాని పేస్టు ధర తగ్గకపోగా పెరిగింది.
పెప్సీ, కోక్ లు వచ్చి దేశీయ శీతల పానీయాల్ని మింగేశాయి. ఎనిమిది రూపాయలు ఉన్న ధర ఇరవై రూపాయలకి చేరింది.
రిటైల్ కంపెనీలు వస్తే స్వదేశీ దళారీల స్ధానంలో విదేశీ దళారీలు వస్తారు తప్ప దళారీ వ్యవస్ధ రద్దు కాదు. దళారీ వ్యవస్ధ రద్దవుతుందన్నది మోసపూరిత వాదన.
విదేశీ సంస్ధలు ప్రపంచ వ్యాపిత సంస్ధలు కావున వాటి వద్ద అప్పటికే మిగులు పెట్టుబడి అందుబాటులో ఉంటుంది. దానిని అడ్డుపెట్టుకుని ప్రారంభంలో ధరలు తగ్గిస్తారు.
మార్కెట్ ని ఆక్రమించే కొద్దీ ధరలు కూడా పెరుగుతూ పోతాయి. అప్పటికిక స్వదేశీ ప్రత్యామ్నాయాలేవి మిగిలి ఉండవు కనుక విదేశీ కంపెనీలు ఎంత చెపితే అంత ధరా పెట్టి కొనాల్సిందే.
ముఖ్యంగా మధ్య తరగతి వారికి ఇక ఖాతా సౌకర్యాలు రద్దవుతాయి. ఖాతా సౌకర్యాలు మధ్య తరగతి వారికి బాగా సౌకర్యవంతంగా ఉంటుంది. అది రద్దయితే మధ్య తరగతి క్రమంగా లేకుండా పోయినా ఆశ్చర్యం లేదు.
పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలతో పోటీ పడడానికి బదులు వాటిని మింగేసి పోటీ లేకుండా చేసుకుంటున్నాయి. అటువంటప్పుడు పోటీవల్ల ధరలు తగ్గే ప్రసక్తే ఉండదు.
విదేశీ పెట్టుబడుల పండితులు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను మింగేసే క్రమాన్ని చూడడానికి నిరాకరిస్తారు. చూసినా చూడనట్లు నటిస్తారు. వారి వైఖరే మోసపూరితం.
పెద్ద కంపెనీల అద్దె మేధావుల చద్ది రచనలు ఓడిపోయిన వాదనలనే మళ్లీ మళ్ళీ తెరపైకి తెస్తున్నాయి. ప్రజల జ్ఞాపకశక్తి పైన వారికి అంతంటి నమ్మకం మరి.
సూపర్ మార్కెట్ నిర్వాహణ అంత చవక కాదు. సెక్యూరిటీ గార్డ్‌లకీ, సిసి కెమెరాలకీ ఖర్చులు అవుతాయి. అంత ఖర్చైన తరువాత తక్కువ ధరలకి ఎలా అమ్ముతారు? ఐదు కంప్యూటర్లతో ఒక ఇంటర్నెట్ కేఫ్ నడిపిన నేనే హార్డ్ డిస్క్‌లు పోకుండా ఉండేందుకు సిసి కెమెరా పెట్టుకోవడం జరిగింది. పదులు లేదా వందల సంఖ్యలో కస్టమర్లు వచ్చే సూపర్ మార్కెట్‌లో ఆ మాత్రం సెక్యూరిటీ లేకుండా నడిపేస్తారా?