ఎయిర్ టెల్, వొడాఫోన్ లపై సి.బి.ఐ దాడులు, ఇక బి.జె.పి వంతు?


ఇక సి.బి.ఐ కన్ను బి.జె.పి పాలనలోని స్పెక్ట్రమ్ అవకతవకలపై పడింది. శనివారం వొడాఫోన్ భారతీయ యూనిట్ కార్యాలయం పైనా, ఎయిర్ టెల్ కార్యాలయం పైనా దాడులు చేసింది. 2001-02 లో ప్రభుత్వం చేసిన స్పెక్ట్రం కేటాయింపులపైన వివరాలు సేకరించే లక్ష్యంతో ఈ దాడులు నిర్వహించింది. బి.జె.పి ప్రభుత్వ కాలంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులలో అవకతవకలు జరిగాయో లేదో నిర్ధారించుకునే క్రమంలో తగిన సమాచార సేకరణకు ఈ దాడులు నిర్వహించినట్లుగా సి.బి.ఐ ప్రతినిధి ధరణి మిశ్రా తెలిపింది.

“ప్రభుత్వ చట్టాలకు, నియంత్రణలకు అనుకూలంగానే మా డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. అధికారులతో వొడాఫోన్ ఇండియా పూర్తిగా సహకరిస్తోంది. వారి తనిఖీలలో భాగంగా అవసరమైన అన్ని వివరాలనూ అందజేస్తాము” అని వొడాఫోన్ సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది. వొడాఫోన్ కి సంబంధించి ముంబై, న్యూఢిల్లీ ఆఫీసుల్లోనూ, ఎయిర్ టెల్ కి సంబంధించి గుర్గావ్, న్యూఢిల్లీ ఆఫీసుల్లోనూ సి.బి.ఐ తనిఖీలు నిర్వహించింది.

“మాకు స్పెక్ట్రం కేటాయించిన ప్రతిసారీ ప్రభుత్వ విధానాల ప్రకారమే అంతా జరిగింది. అన్ని వివరాలనూ, ఉత్తర ప్రత్యుత్తరాలనూ అధికారులకి ఇస్తున్నాము. అవసరానికి అనుగుణంగా పూర్తి మద్దతును ఇస్తాము” అని ఎయిర్ టెల్ ప్రతినిధి చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన 2 జి స్పెక్ట్రం కేటాయింపులలో జరిగిన అవతవకల వల్ల ప్రభుత్వానికి రు.1,76,000 కోట్ల నష్టం సంభవించి ఉండవచ్చని సి.ఎ.జి నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టు సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం బి.జె.పి కాలంలో జరిగిన కేటాయింపులు, విధానాల నిర్ణయామలను కూడ సి.బి.ఐ విచారణ పరిధిలోకి చేర్చింది.

స్పెక్ట్రం కేటాయింపుల విషయంలో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిక బి.జె.పి పై ఆరోపణలు చేయడానికి తగిన మందుగుండు సామాగ్రి దొరిందని సంతోషపడే అవకాశం లభించింది. శీతాకాలం సమావేశాల్లో బి.జె.పి పార్టీ నుండి ఎదురుకానున్న దాడులనుండి రక్షణ పొందడానికి వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బి.జె.పిని ఇరుకన పెట్టే విధంగా సి.బి.ఐ దాడులు చేయించిందని ఆ పార్టీ ప్రత్యారోపణలు చేసే అవకాశాలు లేకపోలేదు. కాని సి.బి.ఐ దాడులు జరిగింది వాస్తవమే కనుక బి.జె.పికి పాలక పార్టీకి ప్రతిఘటన ఎదురవడం ఖాయం.

సి.బి.ఐ కాంగ్రెస్ పార్టీ నియంత్రణలో ఉన్నదని అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా అనీ బి.జె.పి ఆరోపణలను తిరిగి లేవనెత్తవచ్చు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆరోపణలనుండి దృష్టిని మళ్ళించడానికే తాజా దాడులు జరిగాయని అప్పుడే బి.జె.పి ప్రతినిధి ఆరోపించాడు కూడా. ప్రకాశ్ జావేద్కర్ ఈ మేరకు ప్రకటన చేస్తూ “ఇప్పుడు వాళ్లు దృష్టి మరల్చే పనిలో పడ్డారు” అని వ్యాఖ్యానించాడు. లోక్ పాల్ బిల్లుపై జరిగే చర్చ సందర్భంలో సైతం తాజా దాడులు కాంగ్రెస్ కు ఉపయోగపడవచ్చు.

ఒకరి గుట్టు మరొకరు విప్పుకునే పని రానున్న పార్లమెంటు సమావేశాల్లో చోటు చేసుకోనుంది. ఇద్దరూ కలిసి మంది సొమ్ముని ఎంత మెక్కిందీ, ఇంకెంత పంచి పెట్టిందీ అన్నది ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన విషయం.

వ్యాఖ్యానించండి