‘దక్షిణ చైనా సముద్రం’ విషయంలో గల వివాదాల్లో బైటి శక్తులు జొక్యం చేసుకోవడానికి వీల్లేదని చైనా శుక్రవారం హెచ్చరించింది. చైనా హెచ్చరిక అమెరికా ని ఉద్దేశించినదేనన్నది బహిరంగ రహస్యం. ఆసియా ప్రాంతాన్ని వదిలి పెట్టి వెళ్ళేది లేదని ఆష్ట్రేలియా పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా చైనాకు పరోక్షంగా సూచించిన అనంతరం చైనానుండి ఈ హెచ్చరిక రావడం గమనార్హం. ఆసియా శిఖరాగ్ర సభ జరాగనున్న సందర్భంగా అమెరికా, చైనా ల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది.
“బయటి శక్తులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి సాకూ చూపడానికి వీల్లేదు” అని చైనా ప్రధాని వెన్ జియాబావో హెచ్చరించాడు. అగ్నేయాసియా దేశాల సంఘం (అసోసియేషన్ ఆఫ్ సౌతీస్ట్ ఏసియన్ నేషన్స్ – ఎ.ఎస్.ఇ.ఎ.ఎన్ – ఏసియాన్) తో చైనా సమావేశం అయిన సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో వెన్ జియాబావో ఈ హెచ్చరిక చేశాడు. ఇండోనేషియాలో ఏసియాన్ దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏసియాన్ భాగస్వామ్య దేశాలతో కూడా ఏసియాన్ దేశాలు సమావేశాలను ఏర్పాటు చేశాయి. ఏసియాన్ భాగస్వామ్య దేశాలలో చైనా, ఇండియా, అమెరికాలు కూడా ఉన్నాయి.
“అనేక సంవత్సరాలుగా సౌత్ చైనా సముద్రం లో వివాదాలు చెలరేగుతున్నాయి. సంబంధిత సార్వభౌమ దేశాలు మాత్రమే ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. స్నేహ పూర్వక చర్చల ద్వారా, సంప్రతింపుల ద్వారా నేరుగా సదరు సమస్యలను పరిష్కరించుకోవాలి” అని వెన్ జియాబావో తన ఉపన్యాసంలో పేర్కొన్నాట్లుగా చైనా ప్రభుత్వ వార్తా సంస్ధ జిన్‌హువా తెలిపింది.
అనేక ఆసియా దేశాలు సౌత్ చైనా సముద్రంలో తమ భాగం కోసం పోట్లాడుతున్నాయి. ఈ సముద్రంలో పెద్ద ఎత్తున చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ సముద్రం లో దాదాపు మొత్తాన్ని చైనా తనదిగా పేర్కొంటున్నది. పేరులో చైనా ఉన్నంత మాత్రాన సముద్రం మొత్తం చైనాది కాజాలదని సమీప దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వియత్నాం, జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పెయిన్స్ తదితర దేశాలన్నీ ఎప్పుడో ఒకసారి చైనానుండి ప్రతిఘటన, ఘర్షణలను ఎదుర్కొన్నాయి. చమురు, నిల్వలతో పాటుగా, సముద్రం ద్వారా జరిగే వాణిజ్యంలో మూడో వంతు సౌత్ చైనా సముద్రం ద్వారానే జరుగుతోంది. దానితో ఈ సముద్రానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. చుట్టుపక్కల దేశాలన్నీ ఈ సముద్రంలో ఎంతో కొంత భాగాన్ని తమదిగా చెబుతుండగా చైనా వాటన్నింటినీ నిరాకరిస్తోంది.
ఫిలిప్పెయిన్స్, వియత్నాం లు చైనా సౌత్ చైనా సముద్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నాయి. చైనా ప్రధాని వెన్ మాత్రం తమది శాంతియుత ప్రయత్నం మాత్రమేనని చెబుతున్నాడు. “చైనా ఎన్నడూ ఆధిపత్యాన్ని కోరుకోదు. ఏ దేశం కూడా ఆధిపత్యం వహించడాన్ని అంగీకరించదు” అని వెన్ పేర్కొన్నాడు. “చైనా ఏసియాన్ కు మంచి పొరుగువానిగా, మంచి మిత్రుడుగా, మంచి భాగస్వామిగా మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది” అని వెన్ తెలిపాడు.
అమెరికాకి సంబంధించిన వాణిజ్యం కూడా సౌత్ చైనా సముద్రం ద్వారా జరుగుతోంది. ఏసియాన్ తో జరిగే సమావేశాల్లో సౌత్ చైనా సముద్రం పైగల వివాదాలని లేవనెత్తుతానని అమెరికా కొన్ని రోజులు గా చెబుతోంది. చైనా ఆ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏసియాన్ సరైన వేదిక కాదని చైనా పేర్కొంటున్నది. సౌత్ చైనా సముద్రానికి సంబంధించి 2002 డిక్లరేషన్ అమలు చేయడానికి చైనా కట్టుబడి ఉందనీ, ఆ విషయంలో ఏసియాన్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందనీ చైనా ప్రధాని తెలిపాడు.
ఎవరు ఎన్ని చెప్పుకున్నప్పటికీ, దక్షిణ చైనా సముద్రం చైనా, అమెరికాల మధ్య ప్రధాన వివాద ప్రాంతంగా కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల కోసం ఇరు పక్షాలు హెచ్చరికలతో సరిపెట్టుకున్నప్పటికీ తగువులు ముదిరినప్పుడు దక్షిణ చైనా సముద్రం హాట్ బెడ్ గా మారడం ఖాయం. ఏసియాన్ సమావేశాల సందర్భంగా ‘ఆసియా ఖండం, ఆసియా దేశాలకు మాత్రమే చెందాలి. ఆ విషయాన్ని చైనా, ఇండియాలు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది’ అని వెన్ జియాబావొ ఇండియా ప్రధాని మన్మోహన్ తొ చెప్పడాన్ని గమనిస్తే ఇండియాను మంచి చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నదని చెప్పవచ్చు.