వ్యాపార పోటీని అడ్డదారిలో అడ్డు తప్పించుకోవడం అమెరికా కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. చైనాతో గల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి వ్యాపార, వాణిజ్యాల్లో పోటిపడడం చేతగాని అమెరికా, చైనా తన కరెన్సీని అసహజంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని ఆరోపిస్తూ యువాన్ విలువను పెంచేలా ఒత్తిడి తెచ్చి, చైనా నుండి వస్తున్న దిగుమతులను తగ్గించుకుని, తన వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తున్నది. ఇప్పుడు బోయింగ్ విమానాలను ఇండియా కొనుగోలు చేయడానికి వీలుగా ఇండియా కంపెనీలకు, అమెరికాకి చెందిన ఎక్సిమ్ బ్యాంకు రుణం మంజూరు చేయకుండా ఉండడానికి యు.ఎస్.ఎయిర్ లైన్స్ సంస్ధ ఒత్తిడి తెస్తోంది. తద్వారా బోయింగ్ జెట్ విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయకుండా చూడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఎ.టి.ఎ) అన్నది అమెరికాలో ఒక వాణిజ్య గ్రూపు. అమెరికాలో పెద్ద విమానయాన సంస్ధలు దీనిలో సభ్యులు. ఈ సంస్ధ అమెరికాలోని ఎక్సిమ్ బ్యాంకు ఎయిర్ ఇండియాకు రుణం మంజూరు చేయకుండా చూడాలని కోరుతూ డిస్ట్రిక్ట్ కొలంబియా జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసింది. అమెరికా ఎక్సిమ్ బ్యాంకు ఇండియా కంపెనీకి ఫైనాన్స్ ఇవ్వకుండా ఇంజక్షన్ ఇవ్వాలని కోర్టును యు.ఎస్.ఎయిర్ లైన్స్ తరపున ఎ.టి.ఎ కోరింది. అమెరికా ఎక్సిమ్ బ్యాంకు స్వతంత్ర సంస్ధ. అమెరికా సరుకులను కొనుగోలు చేసే అంతర్జాతీయ కొనుగొలుదారులకు ఇది ఫైనాన్స్ సమకూర్చి పెడుతుంది. ఆ విధంగానే బోయింగ్ విమానాలు కొంటున్న ఎయిర్ ఇండియా కంపెనీకి ఫైనాన్స్ సమకూర్చాలని నిర్ణయించింది. అది అన్యాయమని యు.ఎస్.ఎయిర్ లైన్స్ వాదిస్తోంది.
తక్కువ వడ్డీ రేటుతో విదేశీ కంపెనీలకు ఫైనాన్స్ సమకూర్చడం అమెరికా ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని ఎయిర్ లైన్స్ వాదిస్తోంది. అటువంటి ఫైనాన్సింగ్ వలన అమెరికా కంపెనీలు పోటీలో ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తుందని నిస్సుగ్గుగా వాదిస్తోంది. పబ్లిక్ రంగ పరిశ్రమలను ప్రవేటీకరించాలని బోధించే అమెరికా పోటీ ప్రపంచంలో పబ్లిక్ రంగ కంపెనీలు సైతం మార్కేట్లలో పోటీ పడితే సరుకులు, సేవల నాణ్యత పెరుగుతుందని కూడా ప్రభోదిస్తుంది. అలాంటిది తన ప్రవేటు కంపెనీలకు పోటీ ఎదురైతే మాత్రం అమెరికా గానీ, అమెరికా కంపెనీలు గాని తట్టుకొలేవన్నమాట! ఆ పోటీని తప్పించుకోవడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయన్నమాట! స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల ప్రతిపాదకులు చెప్పే నీతుల్లో డొల్లతనం ఇలాగే ఉంటుంది. నీతులు లోకానికే తప్ప తన ఇంటివారికి కాదు.
ఎయిర్ ఇండియా నష్టాలు, యాజమాన్య ఇబ్బందుల వల్ల అది రుణం పొందడానికి అనర్హురాలని యు.ఎస్.ఎయిర్ లైన్స్ వాదిస్తున్నది. విదేశీ విమానయాన కంపెనీలు ఈ సౌకర్యం వల్ల సామర్ధ్యాన్ని పెంచుకుని అంతర్జాతీయ రూట్లలో మార్కెట్ షేర్ పెంచుకున్నాయని అది వాపోయింది. 2005 సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల విలువ గల 50 దీర్ఘ ప్రయాణాల బోయింగ్ జెట్ విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. “ఎక్సిమ్ బ్యాంకు తన పద్ధతులను మార్చుకోవలసిన సమయం వచ్చిందని భావిస్తున్నాం. అమెరికా ఎయిర్ లైన్స్ పరిశ్రమ పైనా, అందలి ఉద్యోగుల పైనా పడే ప్రతికూల ప్రభావాలను అది పరిగణనలోకి తీసుకోవాలి” అని యు.ఎస్. ఎయిర్ లైన్స్ వాదిస్తున్నది.
సరిగ్గా ఇవే వాదనలను భారత దేశంలోని ప్రవేటీకరణ, గ్లోబలీకరణ, సరళీకరణల వ్యతిరేక ఉద్యమకారులు చేస్తూ వస్తున్నారు. స్వేఛ్ఛగా విదేశీ సరుకుల రాకకు అనుమతించడం, నియంత్రణలో ఎత్తివేయడం, పన్నులను రద్దు చేయడం లేదా కోతపెట్టడం లాంటి చర్యలవలన దేశీయ కంపెనీలు దెబ్బతింటాయనీ, ఆయా దేశీయ పరిశ్రమల్లోని కార్మికులు వీధిన పడతారనీ వాదించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు గల విదేశీ కంపెనీలతో భారత కంపెనీలు పోటీ పడడం అంటే అసమానుల మధ్య పోటీయే ననీ, అసమానుల మధ్య పోటీ ఎప్పుడూ బలవంతుడి పక్షానే ముగుస్తుంది కనుక దేశీయ పరిశ్రమలను నాశనం చేసే ఈ విధానాలను చేపట్టరాదనీ వారు గట్టిగా వాదించారు. కాని పశ్చిమ దేశాల పత్రికలు పోటీకి ఎవరైనా సిద్దంగా ఉండాలనీ, పోటీ వల్ల నాణ్యత పెరిగి ధరలు తగ్గుతాయని అదే పనిగా ఊదరగొట్టాయి. స్వేచ్ఛా మార్కేట్ ఎకానమీ ద్వారా పశ్చిమ దేశాల కంపెనీలకు చేకూరగల లాభాలకు ఆటంకం కలగకుండా ఉండడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాయి. ఫలితంగా పెద్ద ఎత్తున పబ్లిక్ రంగ కంపెనీలను ప్రభుత్వాలు మూసివేసి కార్మికులను వీధుల్లోకి నెట్టారు. భారత దేశ నిరుద్యోగాన్ని మరింతగా పెంచారు.
ఇన్నాళ్ళు అయ్యాక అమెరికా కంపెనీలు తమకు ఎదురవుతున్న నామ మాత్రపు పోటీని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఎక్సిమ్ బ్యాంక్ లాంటి స్వతంత్ర సంస్ధల నిర్ణయాలని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా కోర్టులో కేసు కూడా వేసి ఇండియా కంపెనీల నుండి పోటీ రాకుండా చూడండని నిస్సిగ్గుగా అర్ధీస్తున్నాయి. పశ్చిమ దేశాల పత్రికల విష ప్రచారాలను, అబద్ధపు ప్రచారాలను తాము కూడా నెత్తిన వేసుకుని భారత ప్రజలకు నూరిపోసిన భారత రాజకీయ నాయకులు, పత్రికలు, అధికారులు ఇప్పటి పరిణామాలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తాము వల్లించిన పోటీ సిద్ధాంతం అమెరికా కంపెనీల వద్దకు వచ్చేసరికి ఎందుకు చిన్నబోతోందో వివరించవలసిన అవసరం ఉంది.
యు.ఎస్. ఎయిర్ లైన్స్ వాదనను అమెరికా ఎక్సిమ్ బ్యాంక్ ఖండిస్తోంది. ఎగుమతుల అప్పులను మంజూరు చేయడం వల్ల అమెరికా కంపెనీలకూ, అమెరికా కార్మికులకు అనుకూలమైన పరిస్ధితులే ఏర్పడతాయని హామి ఇచ్చింది. పోటీ ప్రపంచంలో గ్లోబల్ మార్కేట్లలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలని సలహా కూడా పడేసింది. బోయింగ్ కంపెనీ మాత్రం ఇంకా ఏమీ అన్లేదు.