శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత


శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత ‘ఛాప్టర్ 8′ తోనే మట్టిగొట్టుకు పోయింది. ఏ కమిషన్ అయినా, స్వతంత్ర భారత దేశంలో ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో సూచించిన సందర్భాలు లేవు. భారత దేశమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దేనిలోనైనా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సూచనలిచ్చిన కమిషన్ ఉందా అన్నది నాకు అనుమానమే. ప్రభుత్వాలు గూడచారులను నియమించుకుని ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తగిన సమాచారం తెప్పించుకుంటాయి అది వేరే సంగతి. కాని ప్రధాని భాషలోనే చెప్పాలంటె ఒక ‘జాతీయ సమస్య’ గా ముందుకొచ్చిన సమస్య పైన నివేదిక ఇస్తున్నపుడు ఏ మాజీ/ న్యాయమూర్తి అయినా అటువంటి నివేదికను ఇవ్వజాలడు. అటువంటి క్రెడిట్ శ్రీకృష్ణ కమిటీ దక్కించుకుంది.

ఇరు ప్రాంతాల మధ్య తీవ్రమైన వ్యతిరేకతలు ప్రబలి ఉన్న కాలంలో సమస్య పరిష్కారం కోసం నియమించబడిన కమిటీ సభ్యులు ఎలా మసలుకోవాలి? ఇరు ప్రాంతాల మధ్య ఏ వైపూ మొగ్గు చూపడం లేదని తమ కదలికలలో కూడా చూపాలి. కానీ పర్యటనలు ముగిశాయి. సేకరణ ముగిసింది ఇక నివేదిక తయారు చేస్తున్నాం అన్న కాలంలోనే వారు సీమాంద్ర ధనికులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. సీమాంధ్రలో ఎవరైతే దోపిడిదారులుగా పేరుపడ్డారో, విదేశీ వ్యాపారాల్లో దొంగలుగా ముద్ర పడ్డారో వాళ్ళ ఇళ్లకు కమిటీ సభ్యులు విందులకు వెళ్లడం ఎలా అర్ధం చేసుకోవాలి. వారికి మరొక ఉద్దేశ్యం లేకపోయినా అటువంటి వాటిని ఖచ్చితంగా జరగకుండా చూసుకోవాలి. కనీసం ఆ మర్యాదను, ఆ నిబంధనను కూడా కమిషన్ సభ్యులు పాటించలేదు. వాళ్ళసలు అటువంటి అంశాలను పట్టించుకునే స్ధితిలో కూడా లేరు.

శ్రీకృష్ణ కమిటి నిజానికి చేయవలసిన పని చేయలేదని నా ఆరోపణ. సమస్య మూలాలను పరిశీలించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎంతవరకూ అవసరమో అంత వెనక్కూ చరిత్రలో వెళ్ళి పరిశీలనలు జరపాలి. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, వ్యవస్ధాగత చరిత్రలను పరిశీలించాలి. జరిగిన అభివృద్ధికీ, జరగని అభివృద్ధికీ కారణాలు వెతకాలి. ఆ కారణాలకు ప్రజలకు ఉన్న సంబంధాలను పరిశీలించాలి. అభివృద్ధి అని చెబుతున్న దాని పర్యవసానాలను పరిశీలించాలి. జరిగిన అభివృద్ధి ఎవరికి ఉపయోగపడిందో పరిశీలించాలి.

ఇవేవీ చేయకుండా అటూ ఇటూ వివిధ పార్టీలూ, సంఘాలూ, సంస్ధలు ఇచ్చిన నివేదికలు తీసుకుని అందులో విషయాలను క్రోడీకరించింది. ప్రజలనుండి తెలుసుకుంటున్నామన్న పేరుతో యాంత్రికంగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వాటిని ప్రాతిపదికగా తీసుకుంది. అది సరైందేనా? ప్రజలకు తమ చరిత్ర పట్లా, తమ వెనుకబాటుతనం పట్లా, తమ అభివృద్ధి పట్లా ఏమన్నా అవగాన ఉంటుందా? రోజువారీ జీవనలంలో రేపు ఎలా అన్నదే ప్రశ్నగా మిగులుతున్నపుడు తమ గతం, వర్తమానం, భవిష్యత్తులపైన సమగ్రమైన అవగాహన ఏర్పరచుకోగల అవకాశం ప్రజలకు ఉంటుందా? ఉంటుందని శ్రీకృష్ణకమిటీ భావించినట్లుగా దాని పని తీరు తెలిపింది. 

సీమాంధ్ర కంటే తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది అని చెప్పిందే గానీ ఆ అభివృద్ధి తెలంగాణ ప్రజల వరకూ కనీసం తెలంగాణ పెట్టుబడిదారులవరకూ వచ్చిందా అన్న అసలు విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ పట్టించుకోలేదు. ఏ అంశాలైతే తెలంగాణ డిమాండ్ ను మళ్ళీ మళ్ళీ రగల్చడానికి కారణంగా నిలుస్తున్నాయో ఆ అంశాలనను వేటినీ శ్రీకృష్ణ కమిటీ పట్టించుకోలేదు.

శ్రీకృష్ణకు ఉన్న విశ్వసనీయతను బట్టే ఆయనకు కమిటి నివేదిక తయారిలో ఉన్న భాగస్వామ్యం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తప్ప ఆయన విశ్వసనీయతను అనుమానించడానికి ఎవరికీ సరదా కాదు. స్వార్ధ ప్రయోజనాల కోసం చూస్తున్నవారిని పక్కనబెట్టి తెలంగాణ అంశాన్ని సీరియస్ గా పరిశీలించి సమర్ధిస్తున్నవారి అభిప్రాయలనైనా పరిశీలించాలసిన అవసరం ఉంది. వారు కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదిక పట్ల పెదవి విరవడానికి కారణాలు అర్ధం చేసుకోవల్సిన అవసరం ఉంది. తెలంగాణ విషయంలో ఎవరైనా ముందు గుర్తించవలసింది ప్రజల్లో తెలంగాణ పట్ల ఉన్న ఆశలు, ఆకాంక్షలు. వాటిని ఎవరూ విస్మరించరాదు. ప్రజలను విస్మరిస్తూ ఏ కమిటీ నివేదిక ఇచ్చినా దానికి విలువ ఉండదు. కమిటీకి శ్రీకృష్ణ నాయకుడే తప్ప ఆయన అభిప్రాయాలె అక్కడ చెల్లుతాయనీ లేదని కూడా గుర్తించాలి.

తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేవాళ్లంతా ఏదో ఒక విధంగా, అబద్ధాలనో నిజాలనో చెప్పి వాదిస్తారని భావిస్తే ఎవరైనా చేయగలిగిందేమీ లేదు.  అందరూ అలాగే వాదిస్తారు అని భావించడం భావ్యం కాదు. అది నిజం కాదు కూడా. చారిత్రక వాస్తవాలన్నవి అనుకూలంగా ఉన్నవారికీ, ప్రతికూలంగా ఉన్నవారికీ కూడా ఒక్కటే. వాస్తవాలను తెలుసుకోవడంలో, తెలుసుకున్న వాటిని సక్రమంగ అర్ధం చేసుకోవడంలో అనేక తేడాలు ఉంటాయి. అక్కడే వాదనల మధ్య, అభిప్రాయల మధ్య విభేధాలు తలెత్తుతాయి. దృక్పధంలో తప్పున్నా, తాము వాస్తవాలనుకున్నవాటిలో తప్పులున్నా సవరించుకోవడానికి ఎవరైనా సిద్దంగా ఉండాలి. అప్పుడే ఒక మంచి దృక్పధాన్ని, అభిప్రాయాన్నీ, అవగాహననూ నిలపగలుగుతాం. నిలిపి అంతా గెలవగలుగుతాం.

తటస్ధుల కమిటీ తాము తటస్ధులమని తెలంగాణ వారిని నమ్మించలేకపోయింది. ‘ఛాప్టర్ 8′ ద్వారా తెలంగాణ వారి ఆగ్రహాన్ని, అప నమ్మకాన్నీ సంపాదించింది.

3 thoughts on “శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత

  1. తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలా ? వద్దా ? నిర్ణయించమని శ్రీకృష్ణ కమిటీ ని అడగలేదు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి పరిష్కార మార్గాలు కనుగొనమనే కదా, ఆ కమీషన్ ని వేసింది. ఒకసారి టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూడండి. అలాంటపుడు అది ఇంకేవిధంగా రిపోర్ట్ ఇవ్వగలదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితినే అది వివరించింది. అందులో దోషం ఏమీలేదు.

  2. కిరణ్ గారూ రాష్ట్రంలో ఉన్న పరిస్ధితిని వివరించడానికి శ్రీకృష్ణ కమిటీని నియమించవలసిన అవసరం లేదు కదండీ. అంత పెద్ద కమిషన్ వేసి అంత చిన్న బాధ్యతను అప్పజెప్పిఉంటారా చెప్పండి. ఉన్న పరిస్ధితి వివరించడం మాత్రమే చేస్తే ఛాప్టర్ 8 ఎందుకు రాసినట్లు? అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్నే మేము సూచిస్తాం అని మొదటి నుండి ఎందుకు హామీ ఇచ్చింది? టత్మ్స్ ఆఫ్ రిఫరెన్సు ప్రకారం చూసినా అదే తెలుస్తోంది.

వ్యాఖ్యానించండి