అప్పు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించండి, సమాచార కమిషనర్ సంచలనం


భారత పాలక పార్టీలన్నీ ఇన్నాళ్ళూ కాపాడుతూ వచ్చిన రహస్య సమాచారం ఒకటి, కొద్ది రోజుల్లో బట్టబయలు కానున్నది. ‘సమాచార హక్కు చట్టం’ అమలుకు ఉద్దేశించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కాజేసిన బడా భోక్తల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా ఎగవేసిన పారిశ్రామిక వేత్తల పేర్లను ఆర్.బి.ఐ డిసెంబరు 31 లోగా పబ్లిక్ గా అందుబాటులో ఉంచాలని సి.ఐ.సి ఆదేశాలు జారీ చేసింది.

అప్పులు ఎగవేసిన టాప్ వందమంది పారిశ్రామికవేత్తల పూర్తి వివరాలను ఆర్.బి.ఐ తన వెబ్‌సైట్ లో ఉంచాలని కూడా సి.ఐ.సి ఆదేశాలు జారీ చేసింది. ఆర్.టి.ఐ చట్టం ప్రకారం అటువంటి వారి పేర్లను ఆర్.బి.ఐ తనంత తానుగా ప్రకటించవలసి ఉండగా ఇంతవరకూ ఆ పని చేయలేదు. ఆర్.టి.ఐ చట్టం సెక్షన్ 4 ప్రకారం ఆర్.బి.ఐ అప్పులు చెల్లించకుండా ఉన్న పారిశ్రామికవేత్తల పేర్లను వెల్లడించవలసి ఉంది. ప్రతి సంవత్సరం సదరు జాబితాను ఎప్పటికప్పుడు తాజాకరించాలని కూడా సి.ఐ.సి ఆర్.బి.ఐ ని ఆదేశించింది. జాబితాను బహిరంగపరిచాక అప్పులు చెల్లించి తమ పేర్లను తొలగించుకోవాలని భావించేవారు ఉండవచ్చు. లేదా ‘తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లు’గా పాత ఎగవేతదార్లకంటె ఎక్కువమొత్తంలో అప్పు ఎగవేసిన వారు కొత్తగా ఉద్భవించవచ్చు. అటువంటి వారి పేర్లు ఎప్పటికప్పుడు జాబితాలో చేర్చి అప్ డేట్ చేయాలని సి.ఐ.సి ఆర్.బి.ఐకి ఆదేశాలు జారీచేసింది.

ఘోరం ఏమిటంటే ఆర్.బి.ఐ తన పాత వాదనలను కొనసాగించింది. ధనిక దొంగల పేర్లను వెల్లడించకుండా కాపాడే బృహత్తర కర్తవ్యాన్ని కొనసాగించడానికి తీవ్రంగా ప్రయత్నించింది. దర్మకర్త హోదాలో ఆ పేర్లను కాపాడుతూ వస్తున్నాననీ, అవి వెల్లడించినట్లయితే భారత రాజ్య ఆర్ధిక ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ నిస్సిగ్గుగా వాదించింది. ఆర్.బి.ఐ అభ్యంతరానికి సి.ఐ.సి శైలేష్ గాంధి ‘కర్రు కాల్చి వాత పెట్టినట్లుగా’ సమాధానం చెప్పాడు. ధర్మకర్త హోదాలో (ఘరానా దొంగల) పేర్లను కాపాడుతున్న మాట వాస్తవమేఅయినా వాటిని వెల్లడి చేయడంలో విశాలమైన ప్రజాప్రయోజనాలు ఉన్న దృష్ట్యా వెల్లడి చేయక తప్పదని చెప్పింది.

“వివిధ బ్యాంకులు తమ వద్ద అప్పులు తీసుకుని ఎగవేసిన పారిశ్రామికవేత్తల పేర్లను ఆర్.బి.ఐ కి అందిస్తాయి. ఆర్.బి.ఐ వాటిని ధర్మకర్త హోదాలో వెల్లడించకుండా రహస్యంగా ఉంచుతుంది. స్వభావరీత్యా అది రహస్యమే. అందులో అనుమానం లేదు” అని ఆర్.బి.ఐ అధికారి ఒకరు వాదనల సందర్భంగా అన్నాడు. హర్యానా లోని పానిపట్ కి చెందిన పి.పి.కపూర్, సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందిస్తూ ఆర్.బి.ఐ అధికారి తన వాదన వినిపించాడు.

ప్రభుత్వరంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా చెలామణి అవుతున్న పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించాలని పి.పి.కపూర్ దరఖాస్తు చేశాడు. ఎగవేతదారుల జాబితా, అత్యధికంగా అప్పులు ఎగవేసిన టాప్ వందమంది జాబితా, వ్యాపారవేత్తలపేర్లు, చిరునామాలు, మొదటి పేరు, అసలు వడ్డీలు, అప్పు తీసుకున్న తేదీ తదితర వివరాలు వెల్లడించాలని కపూర్ కోరాడు. దరఖాస్తు చేసినప్పుడే కపూర్ చాలా తెలివిగా వ్యవహరించాడని చెప్పవచ్చు. ఎందుకంటె ఆర్.బి.ఐ గానీ ప్రభుత్వం గానీ ఇటువంటి విషయాల్లో ఇప్పటికే చాలా తెలివి మీరారు. సిగ్గు కూడా మీరారు. సమాచారం వెల్లడిస్తూనే వివిధ రకాలుగా అయోమయంలో పడవేసే సమాచారమో, వివరాలు ఏమీ తెలియని సమాచారమో వెల్లడించి చేతులు దులుపుకోవచ్చు.

ఉదాహరణకి అప్పులు ఎగవేసిన వారిలో అంతగా తెలియని పేర్లు కొన్నింటిని వెల్లడించి ఇక అంతే అని చెప్పొచ్చు. లేదా పెద్ద మొత్తంలో ఎగవేసిన వారి పేర్లను వెల్లడించకుండా చిన్న మొత్తాల వారి పేర్లవరకు వెల్లడించి బ్యాంకులు పెద్దగా నష్టపోయింది ఏమీ లేదని చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఈ పప్పులేవీ ఉడక కుండా అప్పులు ఎగవేసినవారిలో అత్యధికంగా ఎగవేసిన వారిలో మొదటి వంద మంది పేర్లు వెల్లడించాలని దరఖాస్తులో కపూర్ పేర్కొన్నాడు. పలుకుబడి గల వారి పేర్లలో ఎవరికీ తెలియని భాగాన్ని మాత్రమే వెల్లడించి ఊరుకోకుండా మొదటి పేరు, చిరునామా కూడా వెల్లడించాలని దరఖాస్తులో పేర్కొన్నాడు. అసలు వడ్డీ కూడా చెప్పాలని కోరడం ద్వారా దాచిపెట్టే అవకాశాలు లేకుండా చేయాలని కపూర్ ప్రయత్నించాడు. ఇన్ని చేసినప్పటికీ తిమ్మిని బమ్మిని చేయగల సామర్ధ్యం భారత పాలకవర్గాలకు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారికి బాగానే ఉంది.

వాదనలు జరుగుతున్న సందర్భంగా అప్పుల ఎగవేతదారుల పేర్లను ఆర్.బి.ఐ చట్టప్రకారం కలిగి ఉన్నదా అని సి.ఐ.సి ప్రశ్నించాడు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే బ్యాంకులు పన్నుల ఎగవేతదారుల పేర్లను ఆర్.బి.కి అందిస్తున్నాయని ప్రజా సమాచార అధికారి (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) అంగీకరించాడు. తన సవివరమైన ఉత్తర్వుల్లో శైలేష్ గాంధి ఈ విధంగా పేర్కొన్నాడు. “నిజానికి, దేశంలొ అప్పులు ఎగవేసిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించినట్లయితే అటువంటి వ్యక్తులపైన అప్పులు చెల్లించేలా ఒత్తిడి పెరుగుతుంది. చెల్లింపులు చేయకుండా ఎగవేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఉంది. పేర్ల వెల్లడి వారిని నలుగురిలో సిగ్గుపడేలా చేస్తుంది” అని సమాచార కమిషనర్ అభిప్రాయపడ్డాడు. సరిగ్గా ఈ కారణాల వల్లనే వారి పేర్లని ఇన్నాళ్ళూ పాలకులు కాపాడారన్నది అసలు విషయం. నిజానికి ఎగవేసినవాళ్లలో రాజకీయ నాయకులు, ఎం.పిలు, మంత్రులు, ఎం.ఎ.ఎ లు కూడా అధిక సంఖ్యలో ఉన్నా ఆశ్చర్యం లేదు.

“అప్పుల ఎగవేతదారులైన పారిశ్రామికవేత్తల పేర్లను ప్రజల దృష్టికి తీసుకురావాలనడంలో ఎట్టి అనుమానాలు అనవసరం. దానివలన ప్రజా ప్రయోజనాలు పెద్ద ఎత్తున కాపాడబడతాయనడం లో కూడా ఎట్టి సందేహమూ అవసరం లేదు. ఈ నేపధ్యంలో ఆర్.బి.ఐ పై గల ధర్మకర్తృత్వ బాధ్యత పెద్దగా లెక్కలోకి రాదు” అని సమాచార కమిషనర్ తేల్చి చెప్పాడు. “పేర్ల వెల్లడి దేశం యొక్క ఆర్ధిక, నైతిక ప్రయోజనాలను రక్షించడం కోసమే. అత్యధిక మొత్తంలో ఎగవేసిన వ్యక్తుల పేర్లను వెల్లడించినట్లయితే బ్యాంకర్లూ, వారి కష్టమర్లకూ మధ్య ఉన్న ధర్మకర్తృత్వ సంబంధం దెబ్బతిన్నప్పటికీ, దానికంటే దేశ ఆర్ధిక మరియ నైతిక పొరకు చేకూరే లాభాలు అత్యంత ఉన్నతమైనవని కమిషన్ పూర్తిగా అంగీకరిస్తున్నది” అని సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు.

ఈ సందర్భంగా ఆర్.బి.ఐ గుక్క తిప్పుకోలేని వాస్తవాన్ని సమాచార కమిషనర్ ప్రస్తావించాడు. “అప్పుల ఎగవేతదారుల సమాచారాన్ని సి.ఐ.బి.ఐ.ఎల్ సంస్ధకు ఆర్.బి.ఐ అందిస్తున్నదని కమిషన్ కు తెలుసు. అలాంటిది అదే సమాచారం సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తున్న వారికి తెలియజేయడంలో ఎందుకంత నిర్లక్ష్యమో కమిషన్ కు అర్ధం కావడంలేదు” అని చాచి లెంపకాయ కొట్టింది. భారత దేశ ఆర్ధిక ప్రయోజనాలకు హాని కలుగుతుందన్న వాదనను కూడా కమిషన్ తిరస్కరించింది. “అంటే, అటువంటి అప్పుదారులు తమ పేర్లు వెల్లడి అవుతాయన్న భయంతో పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకోరని చెప్పదలుచుకుంటె, అది నిజానికి దేశ ప్రయోజనాలకు మేలు చేసినట్లే కదా” అని కమిషనర్ ఆర్.బి.ఐ సిగ్గు వస్త్రాలను చీరి అవతలపారేశాడు.

సి.ఐ.బి.ఐ.ఎల్ (సిబిల్) అన్నది అప్పుల సమాచార సంస్ధ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్). రుణదాతలు, రుణ గ్రహీతల సమాచారం దీనివద్ద ఉంటుంది. వాణిజ్య, వినియోగదారీ రుణ గ్రహీతల రుణ చరిత్రలు దీనివద్ద ఉంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు రూపంలో ఈ సమాచారాన్ని సిబిల్ తన సభ్యులకు అందిస్తుంది. సెప్టెంబరు 2009 నాటికి సిబిల్ వద్ద 160 మిలియన్ల వినియోగదారీ వ్యాపారుల సమాచారం ఉంది. నాలుగు మిలియన్ల వాణిజ్యవేత్తల సమాచారం ఉంది. వీరి సమాచారం సిబిల్ వద్ద వేగంగా పెరుగుతూ పోతోంది. అప్పుల సమాచారాన్ని తన సభ్యులయిన 175 మందికి అందజేస్తుంది. సమాచారం అందించినందుకు వారు సిబిల్ కు కొన్ని మేళ్ళు చెయ్యాల్సి ఉంటుంది. సిబిల్ లో సభ్యత్వం గలవారిలో రుణ దాత బ్యాంకులు, ద్రవ్య సంస్ధలు (ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్), బ్యాంకింగేతర ద్రవ్య సంస్ధలు (ఎన్.బి.ఎఫ్.సి – నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీస్), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు, వివిధ రాష్ట్రాల ఫైనాన్షియల్ కార్పొరేషన్లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో అనేకం ప్రవేటు సంస్ధలు ఉన్నాయి. సిబిల్ ని అడిగి రుణ గ్రహీతల రుణాల చరిత్ర తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయా సంస్ధలు అప్పులు ఇవ్వాలా లేదా అని నిర్ణయించుకుంటాయన్నమాట. ప్రభుత్వ బ్యాంకుల్లో అప్పులు ఎగవేసిన వాళ్ళే ఛిట్ ఫండ్ లాంటి కంపెనీలు పెట్టి మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అదీకాక ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండేది ప్రజల డబ్బు. అది ఎవరికిస్తున్నదీ. తిరిగి వస్తూలవుతున్నదీ లేనిదీ సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఆ హక్కును ప్రభుత్వాలు, ఆర్.బి.ఐ లు ఇన్నాళ్లు తొక్కిపెడుతూ వస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టం రాకతో ప్రజలకు ఇన్నాళ్ళకు బడా దొంగల పేర్లు తెలియబోతున్నాయి.

గతంలో కాంగ్రెస్, బి.జె.పి ప్రభుత్వాలు రెండూ అప్పులు ఎగవేసిన పారిశ్రామికవేత్తల పేర్లను వెల్లడించడానికి సాక్ష్యాత్తు పార్లమెంటులోనే నిరాకరించాయి. దేశ భద్రత దెబ్బతింటుందన్న వింతైన కారణం చెప్పి ప్రభుత్వాలు తప్పించుకున్నాయి. ఒకరి ప్రభుత్వంలో వేరొకరు పేర్లు వెల్లడించాలని పార్లమెంటులో అరిచి గోలపెట్టి తాము అధికారంలోకి వచ్చాక అదే కారణం చెప్పి తప్పించుకున్నాయి. సి.ఐ.సి ఉత్తర్వుల పుణ్యమాని వారు దాచి పెట్టిన పేర్లు వెల్లడి కానున్నాయి. భారత దేశ పారిశ్రామిక ప్రగతికి మూల స్తంభాలుగా చెప్పుకునే పలువురు ప్రముఖ వ్యాపార కుటుంబాలు, పారిశ్రామికవేత్తల కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నా ఆశ్చర్యం లేదు.

One thought on “అప్పు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించండి, సమాచార కమిషనర్ సంచలనం

  1. అంతే కాదు, వాళ్ళ వివరాలు తెలియడం వల్ల, వాళ్ళగురించి ప్రజలకు వాళ్ళ అవగాహనమేరకు ఏ ఏ రాజకీయ పార్టీలతో అనుబంధాలున్నాయో తెలుసునుగనుక, ఆయా రాజకీయ పార్టీలు అధికారం లో కొనసాగడానికి ఎవరు ఎంతమేరకు వెనకనుండి ప్రయత్నిస్తున్నారో అవగాహనచేసుకుందికి ఉపకరిస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నడుస్తున్నాయో, పారిశ్రామికవేత్తలు నడిపిస్తున్న ప్రభుత్వాలు నడుస్తున్నాయో, ప్రజలకు అవగాహన అవుతుంది. మంచి వ్యాసం రాసేరు. అభినందనలు.

వ్యాఖ్యానించండి