పెట్రోల్ ధరలు లీటరుకి రు.1.85 పై.లు తగ్గించిన ఆయిల్ కంపెనీలు


ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరల్ని ఈ రోజు అర్ధ రాత్రి నుండి అంటే బుధవారం నుండీ లీటరుకు రు.1.85 పై.ల చొప్పున తగ్గించాలని నిర్ణయించాయి. అంటే 3.2 శాతం తగ్గింపన్నమాట! 18 నెలల క్రితం పెట్రోల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. పన్నులతో కలుపుకుని ఢిల్లీలో లీటర్ పెట్రో ధర రు.2.22 పై మేరకు తగ్గుతుంది. అంటే ఢీల్లీలో పెట్రోధర లీటరుకి రు.66.42 పై. కు తగ్గుతుంది.

భారత దేశంలో అతి పెద్ద రిటైల్ ఆయిల్ అమ్మకందారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నట్లుగా ధృవీకరించింది. కొద్ది రోజుల క్రితమే పెట్రోల్ ధరలు తగ్గించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ తగ్గుదల కేవలం రు.0.60 పై. మాత్రమే ఉండగలదని అంచనా వేశారు. అనూహ్యంగా దానికి మూడు రెట్లు ధర తగ్గడం వాహనదారులకు ఒకింత సంతోషం మిగల్చకపోదు. కాని నియంత్రణతో సంబంధం లేకుండానే భారత ప్రభుత్వం అనేకసార్లు పెట్రోల్ ధరలు పెంచి మధ్య తరగతికి అందని స్ధాయికి చేర్చింది.

దిగుమతి, రిఫైనింగ్ ఖర్చులు కలుపుకున్న ధరలకు సరఫరా చేసినట్లయితే వినియోగాదారుడికి లీటరుకి పది రూపాయల లోపే లభ్యం అవుతుందనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అలవిగాని పన్నులే పెట్రోల్ ధరలను ఆ స్ధాయికి చేర్చాయని నిపుణులు అనేక సార్లు సెలవిచ్చారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధరలపైన పన్నుల భాగా పెంచడంతొ మరే ఇతర రాష్ట్రంలో లేనంతగా రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్ పై పన్నుల రూపేణా అధిక ఆదాయం లబిస్తోందని వారు తెలిపారు. ప్రభుత్వాల బాదుడు లేనట్లయితే ప్రజలపైన భారం పడకపోను.

“ప్రాధమిక ధర లీటరుకి రు.1.85 పై (మూడు సెంట్లు) తగ్గింది. ఢిల్లీలొ వ్యాట్ పన్ను 20 శాతం కలుపుకుంటే తగ్గుదల రు.2.22 పై లకు చేరుతుంది” అని కంపెనీ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ తెలిపింది. జూన్ 2010 నుండి ఇప్పటివరకూ పేట్రోల్ ధరలు ఆరు సార్లు పెంచారు. ప్రభుత్వ రంగ కంపెనీలు ఇండియల్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందూస్దాన్ పెట్రోలియం కార్ప్ లు మూడూ ఈ పెంపుదలను అమలు చేసాయి. ఈ నెలలోనే రు.1.80 పై. మేరకు పెట్రోల్ ధరలు పెంచాయి. అంటే తాజా తగ్గుదలతో గత నెల స్ధాయికి ధర చేరుకుంది.

భారత దేశ ద్రవ్యోల్బణం ఇంకా తొమ్మిది శాతం పైనే కొనసాగుతోంది. అక్టోబరు లో 9.73 శాతంగా ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ద్రవ్యోల్బణం తగ్గించడం తమ ప్రధమ కర్తవ్యం అనే ఆర్.బి.ఐ, ప్రభుత్వాలు సరిగ్గా ఆ కర్తవ్యానికి వ్యతిరేకంగా పదే పదే చర్యలు తీసుకోవడం విశేషం. పెట్రో ధరలు పెంచితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు మొత్తం పెరుగుతాయి. ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. అంటే పెట్రోల్ ధరల పెంపు ద్రవ్యోల్బణం పెరుగుదలకు మరింతగా దోహదం చేసేదయినా ధరలు పెంచడం ప్రభుత్వం మానుకోదు. పైగా మేము కాదు పెంచేది, కంపెనీలు అని మంత్రులు చెబుతారు. ప్రభుత్వరంగ కంపెనీలు తమకు చెప్పకుండానే రేట్లు పెంచుతున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రెండు వారాల క్రితం జోకారు. ప్రజల పట్ల వారి బాధ్యత అలా తగులడింది.

రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే స్వల్పంగా పెరగడంతో పాటు అంతర్జాతీయ ఆయిల్ ధరలు తగ్గడం వలన పెట్రోల్ ధరల తగ్గింపు సాధ్యమయ్యిందని కంపెనీలు చెబుతున్నాయి. డాలరుకు రు.50 కి పైగా రూపాయి విలువ ఉండగా అది రు.49.30 పై కు పెరిగింది. రూపాయి, డాలర్ ల మారకం విలువల్లో మరిన్ని తేడాలు సంభవిస్తే ఆ మేరకు పెట్రో ధరలో మార్పు వస్తుందని ఐ.ఒ.సి తెలిపింది.

వ్యాఖ్యానించండి