‘భాషాప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదు


“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండడమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మూల సిద్ధాంతం.

“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అన్న ప్రాతిపదికన మాత్రమే హిందీ భాషకు అన్ని రాష్ట్రాలు ఉండడాన్ని అర్ధం చేసుకోగలం.

“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అంటే ఒక రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడెవారు ఉండకూడదన్నదే అర్ధం తప్ప ఒకే భాష మాట్లాడేవారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండకూడదని అర్ధం కాదు.

హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఒకటి కంటె ఎక్కువ ఉన్నాయి. కాని ఆ రాష్ట్రాల్లో హిందీ తప్ప మరొక భాష మాట్లాడేవారు లేకుండా చూశారు.

అలాగే ప్రస్తుతం తమిళం మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి. ఈ రెండు రాష్ట్రాల్లో తమిళం తప్ప వేరే భాష మాట్లాడేవారు లేరు, వలస వెళ్ళి స్ధిరపడ్డవారు తప్ప.

అలాగే ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ అది ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు.

ఎందుకంటె విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ తెలుగు భాష మాట్లాడేవారు మాత్రమే ఉంటారు.

కనుక ఆంధ్రప్రదేశ్ విభజన భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని చక్కగా కాపాడుతుంది.

12 thoughts on “‘భాషాప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదు

 1. అలాగా!
  ఆమధ్య ఒకాయన T.V లో ఒక ఛానెలు వాళ్ళకు ఫోను చేసి మాట్లాడుతూ “మేము తెలుగు వాళ్ళమే కాదండీ. మాది వేరే భాష. మీ ఆంద్రావాళ్ళలా కాక మేము హిందీ, ఉర్దూ, తెలుగు అన్నీ కలిపి మా స్వంత భాష మాట్లాడుతున్నాం. మా రాష్ట్రం మా కెందుకు ఇవ్వరు.” అన్నడే మరి!

 2. క్షమించాలి. వెటకారం కోసం చెప్పలేదు. పైన చెప్పిన సంఘటన నిజంగా జరిగింది. అలా అన్న పెద్దమనిషికి ఛానెల్ చర్చలో పాల్గొన్న వాళ్ళలొ ఒకరో మరొక బయటినుండి ఫోన్ చేసినవారో మద్దతు తెలపటం కూడా నా చెవులారా విన్నాను. ఒక రాష్ట్ర మయేది. రెండయేవి. రాజకీయాలు వేరే విషయం. కాని తెలుగు వాళ్ళే తాము తెలుగు వాళ్ళం కామని (తెలుగు లోనే మాట్లాడుతూ మరీ) సగర్వంగా వాదించటం విన్నాక బాధపడకుండా ఉండటం, ఆ సంఘటన మరచిపోవటం సాధ్యమా?

  ఆంధ్రప్రదేశ్ విభజన భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని చక్కగా కాపాడుతుందన్నది నిజమే. రెండుముక్కలు చేసినా అది నిజమే. పది ముక్కలు చేసినా అది నిజమే. విప్రతిపత్తి యేమీ లేదు. రాజకీయనాయకుల ఆవేశకావేశాల ప్రాతిపదికగా ముక్కలు చేయాలా అని నా ప్రశ్న. ప్రజలే కోరుతున్నారని వాదించే యీ నాయకులు హడావుడి చేసేదాకా ప్రజలు ఆందోళన చేయలేదే? ఒక ప్రాంతంలో యేర్పడిన రాజకీయ ఆవేశాలను ప్రజాభిప్రాయంగా పరిగణించడం కష్టం.

  రాష్ట్ర విభజనలకు తగిన ప్రాతిపదికలు యేర్పాటు చేసుకొని, దేశవ్యాప్తంగా చర్చించి, ఒక రాజ్యాంగ వ్యవస్థను శాశ్వతప్రాతిపదిక మీద సుప్రతిష్టితం చేసి, అటు పిమ్మట యిటువంటి సమస్యలను ఒకటయేది పదయేది పరిష్కరించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

 3. శ్యామల్ గారూ వెటకారం సంగతి వదిలేద్దాం.
  అటువంటి వ్యక్తులది అమాయకత్వమో, తుంతరితనమో అవుతుంది తప్ప సీరియస్ గా పట్టించుకోదగింది కాదని నా అభిప్రాయం.

  తెలంగాణ వాదం ప్రజల్లో ఉన్నది కనుకనే అది ఎప్పుడు లేవనెత్తినా ప్రజా మద్దతు లభిస్తోంది. ప్రజల మద్దతు లేకపోతే రాజకీయ నాయకులు ఇన్ని వేషాలు వేయలేరు. తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న మద్దతును ప్రజాభిప్రాయంగా పరిగణించడం కష్టం అని అంటున్నారా? అది ప్రజా మద్దతుగా కాక కేవలం రాజకీయ ఆవేశంగా పరిగణిస్తున్నారా? రాజకీయ ఆవేశం అంటే?

  ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉన్న డిమాండు రాజకీయపరమైనది అని మీరు చెప్పదలచుకుంటే గనక, అదింకా శక్తివంతంగా ఉన్నదనే అర్దం. సాధారణంగా ఆయా డిమాండ్లు ఆర్ధిక పరంగా మొదలయ్యి ప్రజల ఆందోళన బలం పుంజుకునేకొద్దీ రాజకీయ రూపాన్ని సంతరించుకుంటాయి. ప్రజలు రాజకీయంగా పరిణతి సాధించి తమ డిమాండ్లను కూడా రాజకీయ దృష్టితో చూడడం మొదలుపెడితే ఏ ఉద్యమమైనా లక్ష్యం సాధించడానికి, విజయవంతం కావడానికి అత్యధిక అవకాశాలు ఉంటాయి.

  “సరే. ఇప్పుడే హైద్రాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది, అందుకు సీమాంధ్ర ప్రజల్లో కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఒక సంవత్సరంలో తెలంగాణ భౌగోళికంగా విడిపోతుంది. కొత్త రాజధాని ఏర్పడేవరకూ హైద్రాబాద్ లోనే సీమాంధ్ర రాజధాని కొనసాగుతుంది. ఈ లోపు నదీజలాల పంపిణీ, ఇతర వనరుల పంపిణీ, బొగ్గు లాంటి వనరుల సరఫరా లాంటి ముఖ్యమైన అంశాలపైన చర్చలు ప్రారంభం అవుతాయి. సాధ్యమైనంత త్వరగా అవి పూర్తవ్వాలని నిర్ణయిస్తారు.” ఈ విధంగా తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ప్రజలకు రానున్న నష్టం ఏమిటి? చెప్పండి శ్యామల్ గారూ. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను.

 4. కాలం ప్రపంచాన్ని యెలా లాక్కుపోతున్నదో చూస్తూ ఉండటం గాక నేను వ్యతిరేకిస్తున్నదీ వ్యతిరేకిస్తే మారేదీ ఆగేదీ కూడా యేమీ ఉండదు. అయితే నేను నా అభిప్రాయాలను ప్రస్తావించినది పదిమందితో పంచుకోవటానికే కాని నేనేదో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాననో పోషించగలననో లేక యెవరితోనయినా వాదించి గెలవాలనో కాదు.

  ప్రజలు రాజకీయంగా పరిణతి సాధించారా అనేది నాకయితే అనుమానమే. 1977లో ఇందిరాగాంధిని పడగొట్టినప్పుడుగాని నేడుగాని ప్రజలు యెక్కువగా అప్పటి పరిస్థితులు, తక్షణ సమస్యలు ఆధారంగానే స్పందిస్తున్నారనిపిస్తోంది కాని దీర్ఘకాలిక అవగాహనతో స్పందిస్తున్నారనిపించటంలేదు నాకు. నాదే పొరపాటయితే సంతోషమే. కాని రాజకీయ నాయకులు ఉద్యమాల్ని నిర్మిస్తారు – ప్రజలు అనుసరిస్తారు అన్నట్లుగా సాగే ఉద్యమాలపట్ల నాకు అనుమానం ఉంది. తద్విలోమంగా జరిగేవే అసలు ఉద్యమాలని నా అవగాహన. ఇదీ పొరపాటేమో బహుశః కొందరి దృష్టిలో.

  సీమాంధ్ర ప్రజల్లో కూడా హైద్రాబాద్ రాజధానిగానో మరొక విధంగానో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే పెద్దగా వ్యతిరేకత లేదనేది నా అభిప్రాయంలో అస్పష్టమైన విషయం. సీమాంధ్ర ప్రజలకు రానున్న నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఇటువంటి విభజన కారణంగా రేపు సీమాంధ్ర అనేది సీమ – ఆంధ్రగా మారాలని ఉద్యమాలు రాకూడదా? అటువంటి వాటికి పునాది వేయటం మంచిదా? రేపు ఆంధ్రలోంచి కూడా కోనసీమరాష్ట్రం కావాలనే ఉద్యమం వస్తే? ఈ రాష్ట్రం యెన్ని ముక్కలయినా యేమి నష్టం అంటారా లేక యే రాష్ట్రం యెన్ని ముక్కలయినా యేమి నష్టం లేక ప్రాంతీయ వాదాలతో దేశం యెన్ని ముక్కలయినా యేమి నష్టం అంటారా? సరే, రేపు వరంగల్లు నగరంలో నూటికి నూరుమందీ యేకకంఠంగా మా నగరాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని నినదిస్తే
  కాదనటానికి యేమన్నా కారణాలుంటాయా? నా భయాలు యిటువంటివి యీ రోజు అతిశయభయాలుగా తోచవచ్చు. కాని నా కలా అనిపించటం లేదు.
  నిత్యం యేవో విభజనల రాగాలాలాపిస్తూ దేశం యేమాత్రం సవ్యంగా నడుస్తుందీ అనిపిస్తోంది నాకు.

 5. మీ అభిప్రాయం అడిగింది కూడా చర్చకోసమే. మీరు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని కాదు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నవారి వాదనలు తెలుసుకోవాలనే అడిగాను.

  మీరు ప్రస్తావించిన నష్టం హైపాతిటికల్. ఉహాజనితమైనది. మదిలో జన్మించడానికి కూడా అర్హత లేనిది. అయితే, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్లు తలెత్తుతాయి. డిమాండ్లకు ప్రజా మద్దతు వచ్చినపుడే ఏదైనా సమస్యగా ముందుకొస్తుంది. కావూరి సాంబశివరావు రేపు ఎస్సి, ఎస్టి వాళ్ళు తమకు రాష్ట్రం కావాలంటారు అని కూడా అన్నాడు. ఇవన్నీ తెలంగాణని వ్యతిరేకించడానికి మద్దతుగా తెస్తున్న వాదనలు తప్ప అందులో వాస్తవం లేదన్నది నా భావన.

  మీ అనుమానం కంటే శక్తివంతంగా తెలంగాణ డిమాండ్ ఉంది. రాష్ట్రంగా ఏర్పడడానికి తగిన అన్ని అర్హతలూ తెలంగాణకు ఉన్నాయి. మీరు ప్రస్తావించిన ప్రాంతాలకు అది లేదు. ప్రజల మద్దతు ముఖ్య అవసరం. ఎన్నిముక్కలైనా నష్టం ఏమిటని నేననను. తెలంగాణ అడుగుతుంటే ఇతర డిమాండ్లు ప్రస్తావించడం, లేని డిమాండ్లను కూడా ప్రస్తావించడం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇతర ప్రాంతాల వారికి నష్టం ఉంటేనే గదా అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సింది. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లు ప్రతిపాదన దశలోనే కొట్టివేయబడతాయి.

  విభజన రాగాలు లేకపోయినా అను నిత్యం వినపడే రాగాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆకలి, దరిద్రం, నిరుద్యోగం ఇలాంటివి. తెలంగాణ తో సంబంధం లేకుండా అవెప్పుడూ ఉంటాయి. తెలంగాణ సమస్యకు కారణమైనవారే ఈ సమస్యలకూ కారకులు. ప్రస్తుతం దేశం సవ్యంగా నడుస్తున్న దాఖలాలు ఏవైనా ఉన్నాయంటారా?

 6. నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారిలో ఒకడిని కాను. అలాగని తెలంగాణను కోరుతున్న వారిలో ఒకడినీ కాను. మీ రన్నట్లు ప్రజా మద్దతు వచ్చినపుడే ఏదైనా సమస్యగా ముందుకు రావాలి న్యాయంగా. కాని రాజకీయం అనేది జనాన్ని కూడగట్టడం అనే కళలో ఆరితేరింది. ఇలా జనాన్ని కూడగట్టడం అన్ని సార్లూ సాధ్యం కాకపోవచ్చు. కాని సాధ్యం అయే అవకాశాలూ తగినంతగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనను శ్రీ క.చం.రావుగారు ప్రారంభించడానికి లోగడ ఇదే ఉద్యమాన్ని శ్రీ చెన్నారెడ్డిగారు ప్రారంభించడానికి గల కారణమూ ఒకటే కాదా? మొన్న రెడ్డిగారికి తన యెన్నిక చెల్లకపోయేసరికి ప్రజల్లో రంగంలో ఉండటానికి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆసరా అయింది. నిన్న క.చం.రావు గారికి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిపదవి పోవటం వలన అదే ప్రజల్లో రంగంలో ఉండటానికి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆసరా అయింది. ఇలా హఠాత్తుగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజకీయ అవసరాల కోసం తెరమీదకు వస్తూ ఉండటం వలన అది ప్రజలనుండి ప్రారంభం అయిందని నమ్మటం కష్గం అవుతున్నది. ప్రజలనుండి ప్రారంభం అయిందయితే ఉద్యమం స్థిరంగా విరామరహితంగా ఉండక నలభై సంవత్సరాలు నిద్ర పోవటం యేమిటి?

  ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని అర్హతలూ తెలంగాణకు ఉన్నాయి వేరే ప్రాంతాలకు లేవు అన్నారు. ఇవి యే అర్హతలయినా ఇవి మాత్రమే అర్హతలుగా నిర్ణయొంచటానికి యేమిటి ప్రాతిపదిక? రేపు కొత్త కొత్త అర్హతలు రంగంలోని రావని యేమిటి భరోసా? నాది ఉహాజనితమైన ప్రశ్నగా మీరు భావిస్తే నెనేమీ వాదించను.

  విభజన రాగాలు లేకపోయినా అను నిత్యం వినపడే ఆకలి, దరిద్రం, నిరుద్యోగం లాంటి రాగాలు మీరన్నట్లు యెప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం దేశం సవ్యంగా నడవటంలేదన్నదీ నిజమే. అయితే విభజనరాగం వేరు. మనదేశ ప్రజలలోని అనైక్యతయే మనదేశం బహుకాలం పరాయిపాలనలో మ్రగ్గటానికి కారణం. అలాంటి పరిస్థితి మళ్ళీ చేతులారా తెచ్చుకోరాదన్నదే నా విన్నపం. ఐకమత్యంతో ఉంటే యెప్పటికైనా దేశం సవ్యంగా నడిపించుకొనే అవకాశం ఉంటుంది.

 7. ప్రజలమద్దతు ఉన్న సమస్యలు నిద్రాణంగా ఉండి ఎవరైనా కదిలించినపుడు కూడ తలెత్త వచ్చు.
  ప్రజా సమస్యల పైన ఉద్యమాలు ఫలానా పద్ధతి ద్వారానే ముందుకు రావాలని నియమం లాంటిదేదీ లేదు.
  అందుబాటులో ఉన్న మార్గం ద్వారా ఏ రూపంలోనైనా, ఏ మార్గంలోనైనా, ఎవరిద్వారానైనా ప్రజా ఉద్యమాలు తలెత్తవచ్చు.
  ప్రజలనుండే బయల్దేరిన ఉద్యమాలు అనంతరం రాజకీయ నాయకుల కిందికి వెళ్ళవచ్చు. రాజకీయ నాయకుల ద్వారా తలెత్తిన ఉద్యమాలు వారిని నెట్టివేసి ప్రజాపునాది గల ఉద్యమాలుగా మారవచ్చు.
  ఏ మార్గం ద్వారా తలెత్తినప్పటికీ ప్రజల సమస్యపై తలెత్తిన ఉద్యమం, ప్రజల చైతన్యాన్ని బట్టి ప్రజా ఉద్యమంగా మారగల అవకాశాలుంటాయి.

  ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని అర్హతలూ తెలంగాణకు ఉన్నాయని అన్నాను. కాని వేరే ప్రాంతాలకు లేవన్నది నా అభిప్రాయం కాదు. మీరు ప్రస్తావించిన కోనసీమ, వరంగల్ తదితర ఉదాహరణలకు ఆ లక్షణం లేదు అనే నేను చెప్పాను. అది కాకుండా వేరే అర్ధం వస్తే అది నా ఉద్దేశ్యం కాదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ లకు కూడా ఆ అవకాశాలు లేవు. తెలంగాణ వ్యతిరేకత నుండి ఇవి ముందుకు వస్తున్నాయి. తెలంగాణ డిమాండ్ ను పూర్వ పక్షం చెయ్యడానికి సీమాంధ్ర ధనికులు ఈ డిమాండ్లకు జన్మనిచ్చారన్నది నా అభిప్రాయం.

  మనకు ఏ ఊహ తట్టినా అందుకు దారితీయగల అవకాశాలు వర్తమానంలో ఉండి తీరాలి. వర్తమానంలో పునాదులు ఉన్నప్పటికీ అవి కూడా తగినంతగా బలంగా ఉండాలి. అప్పుడు వాటికి సాధ్యపడే అవకాశాలు ఉండొచ్చు.

  ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అన్నది ఐక్యతకు భిన్నం కాదని నా అభిప్రాయం. దేశానికి సంబంధించిన అంశాలలో ఐక్యత చెడిపోతే శతృవులు జొరబడతారన్న భయం ఉండవచ్చు. రాష్ట్రాలన్నీ కేంద్రం అధికార పరిధుల్లోనే ఉంటాయి గనుక మీరు చెప్పిన అనైక్యత భయాలకు ఆస్కారం ఉండదు కదా.

 8. మీ అభిప్రాయాలతో చాలా వరకు నాకు నిర్వివాదం. కృత్రిమ ఉద్యమాల గరించి పెద్దగా పట్టించుకోనవసరంలేదు. మీరన్నట్లు అలాంటివి యెవరో యెగదోసినా మనలేవు. వర్తమానంలో పునాదులు లేని వ్యవహారాలను భవిష్యత్తు నిర్మించటం అసంబధ్ధం యేమీకాదు – ఎటొచ్చీ మనకు అటువంటివాటి పట్ల దార్శనిక దృష్టి ఉండటం అరుదు – నాని అసాధ్యం కాదు. యెవరైనా అటువంటివి ప్రస్తావించే అవకాశాన్ని కొట్టిపారేఐకండి, నేనేమీ దార్శనికదృష్టి కలవాడిని కాకపోవచచ్చును గాక. రాష్ట్రాలన్నీ కేంద్రం అధికార పరిధుల్లోనే ఉంటాయన్నది నిజమే కాని బహుకుటుంబీకుడి లాగా కేంద్రం బలహీనంగా మారకుండా కూడా మనం జాగ్రత్తపడాలి – అటువంటి బలహీనత కేంద్రం ఒక్కదాన్నేకాదు, అన్ని దేశ వ్యవస్థలనూ బలహీనం చేస్తుంది. అది ప్రమాదం కదా.

 9. అవును. ప్రస్తావించడాన్ని కొట్టిపారవేయలేము. మీరన్నట్లు అవి మనలేవు. రష్యా, యుగొస్లావియా లాంటి దేశాలను ముక్క చెక్కలు చేసిన అమెరికా, యూరప్ దేశాలు కుట్రలు పన్నితే తప్ప సమస్యలు లేని చోట, జాతులు, భాషల అణచివేత లేని చోట దేశాలుగా విడిపోయే ఆలోచనలను ప్రజలు చేసిన సంఘటనలు చరిత్రలో చాలా అరుదు. ఆ విధంగా భారత దేశంలో, తెలంగాణ లాంటి ప్రాంతీయ సమస్యలు, దేశానికి ప్రమాదం తెచ్చే స్ధాయివరకూ పోకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 10. “రష్యా, యుగొస్లావియా లాంటి దేశాలను ముక్క చెక్కలు చేసిన అమెరికా, యూరప్ దేశాలు కుట్రలు పన్నితే తప్ప సమస్యలు లేని చోట, జాతులు, భాషల అణచివేత లేని చోట దేశాలుగా విడిపోయే ఆలోచనలను ప్రజలు చేసిన సంఘటనలు చరిత్రలో చాలా అరుదు.”

  తెలంగాణా సమస్యపై తదితర అంశాలపై మీ రచనలన్నీ ఫాలో అవుతున్నాను. (స్పందించలేకపోవడానికి నా ఖాళీ సమయాన్ని బ్లాగులవైపు కేటాయించలేకపోవడం, నా సిస్టమ్ కొంతకాలంగా నాకు అందుబాటులో లేకుండా పోవడం కారణం.)

  ఇదలా ఉంచండి. కాని పైన మీరు చేసిన వ్యాఖ్య తెలంగాణా సమస్య నుంచి మరో సమస్య వైపుకు తీసుకుపోవడమే కాకుండా అమెరికా, యూరప్ కుట్రల వల్లే రష్యా -అంటే సోవియట్ యూనియన్ అనే కదూ- యుగొస్లేవియా దేశాలు ముక్కచెక్కలు అయ్యాయనే అర్థంలోకి మారుతోంది. ఇది ఎంఎల్ థియరీకే భిన్నమైన సూత్రీకరణ అనిపిస్తోంది. ఇక్కడ ఈ విషయంపై చర్చ సందర్భోచితం కాదనుకుంటాను.

  కాని లెనిన్ తదనంతర కాలం నుంచే రష్యా జాతీయ దురహంకారం సోవియట్ ఐక్యతను దెబ్బతీసే తరహా పాలనా సంస్కృతిని ఆ మహాదేశంలో దశాబ్దాలపాటు సాగించిందని చాలా సార్లు చాలా చోట్ల చదివాను. సోవియట్ యూనియన్ రద్దు కావడానికి ఆ యూనియన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న పెడధోరణులు అంతర్గత కారణాలుగా పనిచేశాయా లేదా అమెరికా, యూరప్ కుట్రలు బాహ్యకారణాలుగా పనిచేశాయా అనేది సిద్ధాంత సమస్య. ఇక్కడ ఈ సమస్యను ప్రస్తావించడం సందర్భోచితం కాదనిపిస్తూనే ఇలా వ్యాఖ్యానించవలసి వస్తోంది. క్షమించాలి.

  తెలంగాణా సమస్యపై ఇంత తీవ్రంగా సానుకూల, ప్రతికూల భావాలు ఏర్పడిన క్రమంలో కోస్తా రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోవడంలో ఎక్కడో లోపం జరుగుతోందనిపిస్తోంది. తెలంగాణా ప్రజల న్యాయమైన ఆకాంక్షను గుర్తించడం గౌరవించడం ఒకటి. చీటికీ మాటికీ ఆంధ్రోళ్లు, లంగలు, లఫంగులు, అంటూ చివరకు గోదావరి బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణను కూడా పోల్చి వంకలు పెట్టేంత పెడధోరణితో రాజకీయ నేతల ప్రసంగాలు, అభిప్రాయాలు వ్యాప్తి చెందిన తర్వాత.. తెలంగాణా సమస్యపై ప్రజల ఆకాంక్షల కోణం పక్కకు పోయి ఇతరేతర వ్యర్థకోణాలు రంగంమీదికి వచ్చేశాయనిప్సోంది. సోనియా గాంధీ పుట్టిన రోజు బహుమతిగా తెలంగాణాపై కేంద్ర ప్రకటన చేయడం, తెలుగు ప్రజలను విడదీశానన్న పాపం తనకు అంటరాదంటూ సోనియా ఇప్పుడు యుటర్న్ తీసుకున్నట్లు వార్తలు రావడం. తెలంగాణా సమస్యకు అటు ఇటుగా సాగుతున్న బూతు పంచాంగాలు రాజకీయ నిర్ణయ కోణం నుంచి పక్కకు పోయాయేమో మరి.

  శేఖర్ గారూ, మనలో మాట.. తెలంగాణా రాష్ట్రం ఇప్పటి నేపధ్యంలో మరి కొన్నేళ్లకయినా ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా? సైద్ధాంతిక విశ్లేషణలు ఎంత శక్తివంతంగా అయినా చేయవచ్చు మనం. కానీ సహజ ఇంగిత జ్ఞానం ఎక్కడో ఇది సాధ్యం కాదని మొత్తుకుంటోంది. ‘తెలంగాణా ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా’ అంటూ మీరు మరో వ్యాసానికి పెట్టిన శీర్షికే ఆ ఉద్యమ బలహీన కోణాన్ని చెబుతోందేమో చూడండి.

  ఈ ద్వేషాన్ని అటూ ఇటూ పెంచి పోషించకుండా ఉన్నట్లయితే సమస్య సరైన పరిష్కార దిశలో కొనసాగి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంత జరిగి చివరకు ఏం మిగిలిందంటే పరస్పర విద్వేషం, అపనమ్మకాలే మిగిలాయి. తెలంగాణా ప్రజల ఆకాంక్ష కెసిఆర్ కెకె వంటి రాజకీయ బ్రోకర్ల ప్రభావంలో పడి సన్నగిల్లిపోయిందనుకుంటాను. కెసిఆర్, కెకె లాంటి వాళ్లు మన మధ్య తిరుగుతున్నంత కాలం ప్రత్యేక రాష్ట్రం భావనను మర్చిపోయి చల్లగా నిద్రపోవచ్చన్న వ్యాఖ్యలు బయలుదేరుతున్నాయి. గమనిస్తున్నారా? ఇది పాలక వర్గాల రాజకీయ పోరాటంపై చీఫ్ కామెంటే కావచ్చు… తెలంగాణా ప్రజల డిమాండ్ జోకర్ల బారిన పడిందంటే ఆశ్చర్యపోవలసిన పనేముంది? సామూహిక డిమాండ్ కన్నా వ్యక్తుల ప్రాధాన్యత గొప్పది కాదు. నిజమే. కాని ఆ డిమాండ్ ఇలాంటి వాళ్ల చేతుల్లో పడి వీగిపోతోందేమిటా అనిపిస్తోంది.

  ఈ క్షణంలో ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ, తీరాంధ్రలు ఏర్పడినా లేక ఎస్టీల ప్రత్యేక మన్యసీమ ఏర్పడినా ఈ ప్రపంచం కుప్పగూలిపోదు. నేను తెలంగాణా వ్యతిరేకిని కాను అని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదనే అనుకుంటాను. రాష్ట్రం నాలుగు ముక్కలయినా ఉత్పాతాలు సంభవించవు. 65 ఏళ్ల వయసున్న భారతదేశ ఐక్యతకు ఆకస్మికంగా వచ్చి పడే ప్రమాదమూ లేదనే నా ఉద్దేశం.

  “ప్రస్తుతం దేశం సవ్యంగా నడుస్తున్న దాఖలాలు ఏవైనా ఉన్నాయంటారా?”

  మీ ప్రశ్నే తెలంగాణా సమస్యకు తిరుగులేని సమాధానం అనుకుంటాను. సమస్యపై ఒక అడుగు ముందుకు పడింది లేదు. కాని ఎంతగా విడిపోవాలో అంతగా విడిపోయాం ఇప్పటికే. ఇక ఒకర్ని ఒకరు తిట్టుకోవడానికి కూడా శక్తి లేనంతగా అందరూ ఉడిగిపోయినట్లుంది చూస్తుంటే.

 11. రాజుగారూ, మీ వ్యాఖ్య స్పాం లోకి వెళ్ళిపోయింది. నేను గమనించలేదు. ఇప్పుడే చూసాను.

  మీరు గమనించిన అంశం గురించి: మీరన్నట్లు అమెరికా, పశ్చిమ దేశాల కుట్రలు బాహ్య కారణాలు అనడంలో సందేహం లేదు. సోవియట్ రష్యా, యుగోస్లావియాలు జాతుల బందిఖానాలుగా మారడం వల్ల అంతర్గతంగా అవి విడిపోవడానికి తగిన భూమిక ఏర్పడింది. అయితే సోవియట్ రష్యా సోషలిస్టు దేశం కనుక ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశలో, అక్కడి సోవియట్ వ్యవస్ధను నాశనం చేసే దిశలో అమెరికా, యూరప్ లు అనేక కుట్రలను పన్నాయన్నది తెల్సిన విషయమే. ఈ కుట్రలు బాహ్య కారణాలుగా పని చేయడంతో పాటు అంతర్గతంగా జాతుల అసమానతలను పెంచే దిశగా కూడా పని చేశాయి. అంతే బాహ్య కారణాల ప్రభావం అంతర్గత వైరుద్యాల ఫలితం పైన ప్రభావం చూపడం వరకు మాత్రమే ఆగిపోలేదు. అవి అంతర్గత వైరుధ్యాలలో సోవియట్ రష్యా ఉనికికి ప్రతికూలమైన అంశాలను బలపరచే పాత్రను కూడా పోషించాయి. అంటే సోవియట్ రష్యాలో రష్యన్ల జాతి ఆధిపత్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమం కూడా అవి చేపట్టాయి. ఆ ప్రభావాన్ని ఎలా కలుగజేశాయని ప్రశ్న వేసుకుంటే అనేక మార్గాలు అవి దొరకబుచ్చుకున్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వంలోని వ్యక్తులను ప్రభావితం చెయ్యడం దగ్గర్నుండి జాతి తిరుగుబాట్లకు తగిన శిక్షణ, సహాయాలు అందించే వరకూ ఎన్నో రకాలుగా పశ్చిమ దేశాల సహాయం సోవియట్ లోని ప్రతికూల శక్తులకు అందాయి. అంటె సోవియట్ రష్యాలోని అంతర్గత శక్తులను నేరుగా ప్రభావితం చేసే స్ధాయిలో అవి కృషి చేశాయి.

  ఈ నేపధ్యంలోనే పై ప్రస్తావన తెచ్చాను. అంతర్గత వైరుధ్యాలు బద్దలు కావడానికి బాహ్య శక్తుల ప్రమేయం ఒక షరతుగా ఉంటుందని గుర్తు చేసుకుని నా ప్రస్తావనను ఆ కోణంలో చూడగలరు.

  అవును. తెలంగాణ ఉద్యమంలో చాలా బలహీనతలున్నాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో ఉద్యమం కొనసాగుతుండడమే ఆ ఉద్యమానికి ఉన్న పెద్ద బలహీనత. వారు అనేక రాజీలతో ఉద్యమాన్ని నడుపుతుంటారు. వారి రాజీల వల్లనే చెన్నారెడ్డి కాలంలో తెలంగాణ ఒకసారి మోసపోయింది. ఇప్పుడు కె.సి.ఆర్ కూడా కాంగ్రెస్ తో చెట్టపట్టాలేసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి కే.సి.ఆర్ నాయకత్వమె పెద్ద బలహీనత. ఆ కుటుంబం దూరంగా ఉంటే తెలంగాణ ప్రజలు అటో ఇటో తేలుస్తారు. కాని ప్రజల్లో చాలామంది కె.సి.ఆర్ మోసాన్ని గుర్తించలేకపోతున్నారు. మొన్న మన్మోహన్ ప్రకటన ఇచ్చాక ‘తెలంగాణ ప్రజలారా, బాధపడకండి, మీ పక్క నేనున్నాను. అని కె.సి.ఆర్ అనడం చూస్తే అతని రాజీ అర్ధం అవుతోంది.

  కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే బి.జె.పి తాను ఇస్తానని ఇప్పటికె కమిట్ అయ్యింది. కనుక కాంగ్రెస్ ఎన్నికల ముందు తెలంగాణ ప్రకటించవచ్చని నాకు తోస్తోంది. కె.సి.ఆర్ కూడా పరోక్షంగా అవే సూచనలు ఇస్తున్నాడు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s