జమ్ము&కాశ్మీరు రాష్ట్రంలో ప్రజల పాలిట మృత్యుపాశంగా మారిన “సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ – ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ)” ను కొన్ని జిల్లాలలో ఉపసంహరించుకునే విషయమై చర్చించడానికి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానితో సమావేశం అయ్యాడు. గత కొన్ని వారాలుగా ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని భద్రతా పరిస్ధితులు మెరుగుపడిన జిల్లాలలో ఉపసంహరించాలని జమ్ము&కాశ్మీరు ముఖ్యమంత్రి వాదిస్తూ వచ్చాడు. సి.ఎం వాదనను సైనిక దళాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భద్రత రిత్యా చట్టం ఉపసంహరణ ప్రమాదకరమని ఆర్మీ వాదిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఆర్మీ అధికారులతో జరిగిన సమావేశంలో ఒమర్ అబ్దుల్లా ప్రతిపాదిత జిల్లాలనుండి సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించవలసిందేనని తేల్చి చెప్పాడు. సైనికాధికారులు చెప్పిన అభ్యంతరాలన్నీ సైద్ధాంతికపరమైనవేననీ, వాస్తవంలో ఉన్న బౌతిక పరిస్ధితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఊహలతో అభ్యంతరాలు చెబుతున్నారని ఒమర్ అబ్దుల్లా తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల అవసరాల రీత్యా స్పందించాల్సిన అవసరం ఉందని ఒమర్ నొక్కి చెప్పాడు.
ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టం అత్యంత క్రూరమైన చట్టం. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని సైనిక దళాలు జమ్ము&కాశ్మీరు రాష్ట్రంతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా అనేక అకృత్యాలకు పాల్పడింది. ఈ చట్టం ప్రకారం కేవలం అనుమానం ఉంటేనే అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైళ్లలో కుక్కవచ్చు. సైనికులు అనుమానంతో ఎవరినైనా కాల్చి చంపవచ్చు. చంపినా విచారణ ఉండదు. ఈ చట్టం ఉందన్న ధైర్యంతో ఈ రెండు రాష్ట్రాలలో అనేక మంది మహిళలని సైనికులు రేప్ చేసి చంపారు. సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినప్పటికీ దోషులపైన విచారణ జరిపి శిక్షించడం జరగలేదు. ఇటువంటి చట్టం లేకపోతే సైనిక దళాల మానసిక స్ధైర్యం దెబ్బతింటుందని సైనికాధికారులు వాదిస్తున్నారు.
తీవ్రవాదం అణచివేసే పేరుతో ప్రజలకు సంబంధించిన ఏ సమస్యపైన ఆందోళన చేసినా ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టం కింద అరెస్టు చేసి సంవత్సరాల తరబడి విచారణ లేకుండా నిర్బంధిస్తున్నారు. అమాయకులను అనేకమందిని చంపి శవాలు కూడా అప్పగించకుండా మాయం చేశారు. జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర సాధికారతా బృందం కొన్ని వందల సంఖ్యలో గుర్తు తెలియని సమాధులను కనుగొన్నది. తొంభైలనుండీ అనేక మంది కాశ్మీరీ యువకులను సైనికబలగాలు పట్టుకెళ్ళి కాల్చి చంపిన ఘటనలు జరిగాయి.
ఈ అర్ధరాత్రి అరెస్టుల వలన, అదృశ్యాల వలన 2001లో జరిగిన జనాభా లెక్కల సేకరణలో జమ్మూ&కాశ్మీరు రాష్ట్రంలో మహిళల జనాభా తో పోలిస్తే పురుషుల జనాభా బాగా తగ్గిపోయినట్లు తేలింది. దానితో సైన్యం అకృత్యాలు బైటికి తెలుస్తాయన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆ సంవత్సరం జమ్ము&కాశ్మీరు రాష్ట్ర జనాభా లెక్కలను ప్రకటించలేదు. ఇప్పటికీ పది సంవత్సరాల క్రితం జమ్ము&కాశ్మీరులో సేకరించిన జనాభా లెక్కల వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. అప్పటినుండీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటోంది. అత్యంత క్రూరమైన ఈ సైనిక చట్టం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతగా నష్టపోయారో ఈ ఒక్క సంఘటనే చెబుతుంది.
అటువంటి చట్టాన్ని ఉపసంహరించడానికి సహజంగానే సైన్యం అంగీకరించడం లేదు. కాని సైన్యం ఉండాలా లేదా నిర్ణయించవలసింది రాజకీయ నాయకత్వం, ప్రభుత్వాలు తప్ప సైన్యం కాదు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి సైనిక చట్టం ఉపసంహరణపై అర్ధ గంట సేపు చర్చజరిపాడు. రాష్ట్రంలో భద్రతా పరిస్ధితులపైన కూడా ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. మన్మోహన్ ని కలిసాక ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరంను కూడా కలిశాడు. ప్రధాని కలవక ముందు ఆదివారం ముఖ్యమంత్రి రక్షణ మంత్ర్రి ఎ.కె.ఆంటోని ని కలిశాడు.
చట్టం ఉపసంహరణపై సైన్యానికి ఉన్న అభ్యంతరాలను ఎ.కె.ఆంటోని సి.ఎం కు వివరించినట్లు తెలిసింది. అయితే ఎన్నికల సమయంలో జమ్ము&కాశ్మీరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఇచ్చిన ఉమ్మడి వాగ్దానలను నెరవేర్చవలసిన అవసరం ఉందని ఒమర్ అబ్దుల్లా నొక్కి చెప్పినట్లు తెలిసింది. గత సంవత్సర కాలం పాటు శాంతిని కాపాడిన రాష్ట్ర ప్రజలకు తగిన రివార్డ్ ఇవ్వాలని ఒమర్ చెప్పాడు. టూరిజం ఆదాయం పెరిగిన సంగతిని కూడా ఆయన గుర్తు చేశాడు. టూరిజం కూడా పెరిగినప్పుడు తీవ్రవాదం అంటూ ప్రజలను ఇంకా శిక్షించడం తగదని ఒమర్ వాదించాడు.
జమ్ము కాశ్మీరుతో పాటు మణిపూర్ లో కూదా ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని ఉపసంహరించాలి. ప్రజల సమస్యలకు సైనిక నిర్భంధం ఎంతమాత్రం పరిష్కారం కాదు.