చంద్రబాబునాయుడు ఆస్తులపై సి.బి.ఐ విచారణకు హైకోర్టు ఆదేశం


వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విసిరిన పాచిక తాత్కాలికంగానైనా పని చేసినట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు వేల పేజీల సాక్ష్యాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల సంపాదించాడంటూ జగన్ తల్లి వై.విజయమ్మ ద్వారా వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచి పిటిషనర్ల కోరిక మేరకు సి.బి.ఐని రంగంలోకి దించింది. వై.విజయమ్మ ఆరోపించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకుని, రామోజీరావును ముందుంచి అక్రమ ఆస్తులను సంపాదించిందీ లేనిదీ విచారించవలసిందిగా హైకోర్టు బెంచి సి.బి.ఐని ఆదేశించింది.

చంద్రబాబు నాయుడు, రామోజీరావును బినామీగా ఉపయోగించుకుంటూ అక్రమ ఆస్తులను సంపాదించిందీ లేనిదీ పరిశోధించి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నివేదికను సీల్డ్ కవర్ లో ఉంచి సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి శంకర్రావు, టి.డి.పి నాయకుడు ఎర్రం నాయుడు లు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో కూడా హైకోర్టు అనుసరించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. జగన్ విషయంలో కూడా విచారించి రెండు వారాలలో ప్రాధమిక నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాలపాటు విచారించిన సి.బి.ఐ మరో వారం గడువు కోరగా అది కూడా హైకోర్టు మంజూరు చేసింది. అనంతరం సి.బి.ఐ, కోర్టుకి సమర్పించిన నివేదికతో జగన్ అక్రమాస్తులు సంపాదించాడని హైకోర్టు భావించింది. నివేదిక ఆధారంగా జగన్ అక్రమాస్తుల విషయంలో పూర్తి స్దాయి విచారణకు హైకోర్టు ఆదేశించన సంగతి తెలిసిందే.

జగన్ కూడా చంద్రబాబు నాయుడుపైన అదే పద్ధతిలో పిటిషన్ దాఖలు చేశాడు. “అధికారం దుర్వినియోగం జరిగినట్లుగా పిటిషనర్ కేసును వెలికి తీయగలిగారని కోర్టు భావిస్తోంది. అంతేకాక ప్రతివాది నెం.8 (చంద్రబాబు నాయుడు) దోషులకు శిక్షలకు పడకుండా జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి రిటి పటిషన్ ను అనుమతించాల్సిన అవసరాన్ని రేకెత్తించాయి” అని కోర్టు పేర్కొన్నది. మూడు నెలల్లోగా నివేదిక ఇచ్చినట్లయితే దానిని అనుసరించి తదుపరి చర్యలను కోర్టు చేపడుతుందని యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్ గులాం మహమ్మద్, జస్టిస్ నూతి రాంమోహన రావు లు సభ్యులుగా గల డివిజన్ బెంచి సోమవారం తెలిపింది. పిటిషనర్లు సమర్పించిన 2000 పేజీల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సి.బి.ఐని కోరింది.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా మంత్రి శంకరరావు పిటిషన్ దాఖలు చేయడం వెనక సోనియా గాంది హస్తం ఉందనీ, ఆమే ప్రోద్బలంతోనే మంత్రి పొదవి పొందడానికి శంకర్రావు పిటిషన్ దాఖలు చేశాడని జగన్ ఆరోపణలు సంధించాడు. వై.ఎస్.జగన్మోహన రెడ్డి తనపై జరుగుతున్న సి.బి.ఐ విచారణతో బెంబేలెత్తి విచారణను ఆపించాల్సిందిగా సోనియమ్మ కాళ్ళపై పడ్డాడనీ, అప్పుడు జరిగిన మంత్రాంగం ఫలితంగానే చంద్రబాబు నాయుడుపైన విజయమ్మ అక్రమాస్తుల కేసు దాఖలు చేసిందనీ తెలుగుదేశం ఆరోపించింది. ఇద్దరి ఆరోపణలు నిజమే అయిన పక్షంలో రెండు కేసుల్లోనూ సోనియా గాంధీ ముద్దాయిగా భావించ వలసి వస్తోంది. ఇరుపక్షాల ఆరోపణలను బట్టి, ఆరోపణలు నిజమే ఐతే, రాజకీయంగా సోనియా ముద్దాయిలా కనిపిస్తున్నప్పటికీ, అధికారాన్ని సొంత ఆస్తుల వృద్ధి కోసం వినియోగించిన ఇద్దరు రాజకీయుల బండారాన్ని సోనియా (లేదా కాంగ్రెస్ హైకమాండ్) బైటపెట్టిందని భావించవచ్చు.

వ్యాఖ్యానించండి