త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా


దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైన దృష్టి పెట్టకపోతే త్వరలో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు, ఆయిల్ దిగుమతుల బిల్లుని మించిపోవడం ఖాయమని భారత ప్రభుత్వ ఐ.టి సలహాదారు శ్యాం పిట్రోడా హెచ్చరించారు. ఎలక్ట్రానికిక్ మాన్యుఫాక్చరింగ్ లో పునాదిని విస్తృతపరుచుకోవడం కోసం ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలని పిట్రోడా తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతున్నదని కాని ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆ డిమాండ్ తట్టుకోవడానికి దిగుమతులపై ఆధారపడవలసి వస్తోందని పిట్రోడా తెలిపాడు.

సేవల రంగంతో పాటు ఐ.టి రంగం కూడా ఇండియా ఎమర్జింగ్ ఎకానమీగా ముందుకు రావడానికి దోహదం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్ రంగం మొత్తం ఉత్పత్తిలో 16 శాతం మాత్రమే ఉండగా ప్రకటిత లక్ష్యం అయిన 25 శాతానికి అది బాగా తక్కువగా ఉన్నదని వారు వివరిస్తున్నారు. చైనా ఉత్పత్తిలో మాన్యఫాక్చరింగ్ వాటా 30 శాతం పైనే ఉన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. “ఎలక్ట్రానిక్స్ గతంలో ఉన్న మాన్యుఫాక్చరింగ్ కి సంబంధించిన పునాది మొత్తాన్ని ఇప్పుడు మనం కోల్పోయాము” అని శ్యాం పిట్రోడా తెలిపాడు. ముంబై లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇండియా ఎకనమిక్ సమ్మిట్ సభల వద్ద మాట్లాడుతూ పిట్రోడా ఈ విషయాలు తెలిపాడు.

“ఇప్పటికయినా మనం జాగ్రత్తపడకపోతే, రానున్న పది, పదిహేను సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 400 బిలియన్ డాలర్లు మించుతుంది. అది ఆయిల్ దిగుమతుల కంటే ఎక్కువగా ఉండొచ్చు” అని పిట్రోడా వివరించాడు. ఇండియా ఆర్ధిక వృద్ధిని సేవలరంగం మాత్రమే కాక ఇతరరంగాలకు కూడా విస్తరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. పారిశ్రామిక పునాదిని విస్తరించడం అందులో ఒక భాగంగా గుర్తించారు. తద్వారా ఉద్యోగాల కల్పన, వాణిజ్య లోటు తగ్గింపు లాంటి లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. చైనా నుండి వస్తున్న దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో ఇండియా వాణిజ్య లోటు రాబోయే మూడేళ్ళలో రెట్టంపు అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ సంవత్సరం మార్చిలో ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి వాణిజ్య లోటు 150 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అత్యున్నత వాణిజ్య శాఖ అధికారి చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. ఇది 2004 సంవత్సరంలో కేవలం 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. గత సంవత్సరం ఇండియా 27.2 బిలియన్ డాలర్ల మేరకు ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకోగా, ఆయిల్ దిగుమతులు 102 బిలియన్ డాలర్ల మేరకు జరిగాయి. అయితే ఇండియా క్రూడాయిల్ దిగుమతి చేసుకున్నప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారు కూడాఅ కావడంతో కొద్ది మేరకు ఆయిల్ ఖాతా లోటు పూడుతోంది.

ఇంటెల్ కార్ప్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్ ఇంక్., ఫ్రీస్కేల్ సెమికండక్టర్ హోల్డంగ్స్ లిమిటెడ్ తదితర ప్రపంచ స్ధాయి ఛిప్ తయారీదారులు భారత దేశంలో డిజైన్ కార్యకలాపాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. గత సంవత్సరం 6.55 బిలియన్ డాలర్లమేరకు సెమీకండక్టర్లను భారత దేశంలో కొనుగోలు జరిగిన ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడగా అందులో ఏవీ భారత దేశంలో ఉత్పత్తి కాకపోవడం ఎలక్ట్రానిక్ రంగంలో ఇండియా పరిస్ధితిని తేటతెల్లం చేస్తోంది. ఈ పరిస్ధితిని విస్మరించలేమని శ్యాం పిట్రోడా చెబుతున్నాడు. “మనకు ఫౌండ్రీ అవసరం ఉంది. పర్యావరణ వ్యవస్ధలు అవసరం. దేశీయకరణ అవసరం. మనకు మన సొంత ఉత్పత్తులు కావాలి” అని శ్యాం పిట్రోడా నొక్కి చెప్పాడు.

దేశీయంగా మాన్యుఫాక్చరింగ్ బేస్ విస్తృతం చేసుకోవడానికి తగిన డిమాండ్ బాగా ఉందనీ, వేగంగా పెరుగుతున్న సంపదలు ఈ డిమాండ్ ని మరింత పెంచుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. స్ధానికంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారి లేకపోవడం వల్ల దిగుమతి బిల్లులతో ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వారు విశ్లెషిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం దేశీయంగా పరిశోధనా సౌకర్యాలను విస్తృతం కావించి బోధనా, పరిశోధనా రంగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వెళ్ళే విధంగా తగిన ప్రోత్సాహకాలు కల్పించవలసిన అవసరం ఉంది. హెచ్చు వేతనాల కోసం విదేశాలకు తరలి వెళ్తున్న భారతీయ ఇంజనీర్లను ఆకర్షించడానికి అంతకంటే మిన్నగా సౌకర్యాలు కల్పించవలసిన భాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. బోధన, పరిశోధన రంగాలు లేకుండా కేవలం మాన్యుఫాక్చరింగ్ రంగంపైనే దృష్టి పెట్టినట్లయితే అది మళ్ళీ విదేశీ కంపెనీల పెట్టుబడులపై ఆధారపడడం వరకే పరిమితం కాక తప్పదు.

4 thoughts on “త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా

  1. అదేం తీర్పు? ప్రభుత్వం దృష్టి పెట్టాలే గానీ తప్పకుండా రాణించవచ్చు.
    గతంలో తొంభైల ముందు ఇండియా లో కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకి తగిన పునాది ఉండేది.
    అంతా సాఫ్ట్ వేర్ వైపుకి మళ్ళడంతో అది పడిపోయింది.
    తగిన మానవ వనరులు మనకున్నాయి. విద్యారంగంలో లబ్దప్రతిష్టులు ఉన్నారు.
    వీరంతా దృష్టి పెడితే అదేమంత బ్రహ్మాండం కాదు.

  2. టపాసుల పరిశ్రమ శివకాశీతోనే ఎందుకు ముడిపడిఉంటుండి? చైనాకు అన్నన్ని వనరులున్నా, ఐ.టీ. రంగంలో ఎందుకు భారత దేశానికి సరి రాదు? బొమ్మా బొరుసు వేసి చెప్పిన తీర్పు కాదు, నా పై వ్యాఖ్య. అదో పెద్ద కథ.

వ్యాఖ్యానించండి