డజను భారత సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తివేసిన పాకిస్ధాన్


త్వరలో భారత్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడానికి వీలుగా ప్రక్రియ ప్రారంభించడానికి అనుమతినిస్తూ పాకిస్ధాన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం, భారత్ నుండి వచ్చే 12 రకాల సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాటల వరకే కాదని నిరూపించుకుంది. పాకిస్ధాన్ శనివారం ఈ విషయం తెలిపింది.

పాకిస్ధాన్ లో ‘ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ’ (ఇసిసి), ఆర్ధిక వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే అత్యున్నత ససంస్ధ. పాకిస్ధాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత దేశంనుండి దిగుమతి చేసుకోగల సరుకుల సంఖ్యను పెంచాలని ఇటీవల ఇసిసి ని కోరింది. “ఇసిసి శుక్రవారం సమావేశమై చర్చించింది. పన్నెండు సరుకులను భారత్ నుండి స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడానికి ఇసిసి నిర్ణయించింది” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత్ పాకిస్ధాన్ ల మధ్య మైత్రీ బంధం బలపడాలని అమెరికా కోరుకుంటోంది. ఆ కోరికలో అమెరికా ప్రయోజనాలు తప్ప భారత్, పాక్ ల ప్రయోజనాలు అసలు లేవు. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నట్లయితే పాకిస్ధాన్ తన సైన్యాన్ని భారత్ సరిహద్దుల వద్ద కేంద్రీకరించవలసి ఉంటుంది. కాని ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దులో తలచాదుకుంటున్న టెర్రీరిస్టులపైకి పాక్ సైన్యం యుద్ధం చేసి అణిచివేయాలని అమెరికా కోరిక. అది నెరవేరాలంటే భారత్ సరిహద్దులనుండి పాక్ సైన్యాన్ని ఆఫ్ఘన్ సరిహద్దుల వైపుకి మార్చవలసి ఉంటుంది. ఇది భారత్, పాక్ ల మధ్య సంబంధాలు బాగున్నపుడే సాధ్యం కనుక ఇరు దేశాలు వైరం మరిచి మిత్రులు కావాలని అమెరికా ఆదేశించడంతో ప్రస్తుతం సంబంధాలు బాగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నందున దానికి కూడా పాక్ సైన్యం అమెరికా కార్యాన్ని నిర్వర్తిస్తూ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉండాల్సి ఉంది. అంటే అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే భారత్, పాక్ ల పాలకవర్గాలు మైత్రీబంధాన్ని దృఢపరుచుకునే పనిలో పడ్డాయన్నమాట!

తోలు పరిశ్రమ, టెక్స్‌టైల్స్ పరిశ్రమలకు అవసరమైన యంత్రాలు, ముడి పదార్ధాలు అనుమతించబడిన సరుకుల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక వ్యాపారాలని పెంచుకోవడానికై, వచ్చేవారం ఇరు దేశాల వాణిజ్య శాఖల సీనియర్ అధికారులు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆ సమావేశానికి తయారు కావడం కోసమే తాజాగా పాక్ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. 2009-10లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం 1.4 బిలియన్ డాలర్లమేరకే జరిగింది. అనధికారికంగా మూడో దేశం ద్వారా మరో 3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది.

వ్యాపార సంబంధాలను సాధారణీకరించేందుకు నిర్ధిష్ట చర్యలు తీసుకుంటామని ఇండియా ఫారెన్ సెక్రటరీ రంజన్ గురువారం తెలిపాడు. పాక్ తో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందం (పి.టి.ఎ) కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపాడు. పాక్ వ్యాపారులకు ఇచ్చే వీసాలపైన విధించే నియమ నిబంధనలకు కూడా సరళీకరిస్తామని ఆయన తెలిపాడు. పాకిస్ధాన్, భారత్ ల మధ్య ఎల్లపుడూ కక్షలూ కార్పణ్యాలూ రగులుతూ ఉండాలని కోరుకునేవారు ఇరువైపులా ఉన్నారు. మెరుగుపడుతున్న సంబంధాలను విద్వేషంతో చూడడం, వ్యాఖ్యానించడం కూడా వీరు చేస్తుంటారు. అసలు పాకిస్ధాన్, భారత దేశానికి శతృదేశం అని చెప్పడానికి కూడా వెనకాడరు. సముద్రాల ఆవల ఉన్న అమెరికాతో నేస్తం చేయడానికీ, అది ఆజ్ఞాపించినట్లుగా చెయ్యడానికి ఇష్టపడే వీరు, పొరుగువారినీ, అది కూడా దాయాదులను మాత్రం ద్వేషిస్తుంటారు. ‘అయినవాడికి ఆకులు కానివాడికి కంచాలు’ అన్నమాట.

పొరుగుదేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఎప్పటికైనా ఎవరికైనా సానుకూలమైన అంశం. వ్యక్తుల మధ్య వైరాలను పరిష్కరించుకుని, సామరస్యంతో ఉండాలని బోధించే వారసత్వం భారతదేశానిది. ఆ వారసత్వం ఎవరు పాటించినా ఆహ్వానించి అభినందించవలసిందే. అవకాశం వచ్చినపుడల్లా పొరుగు దేశాల మధ్య వైరాన్ని రెచ్చగొట్టి తమ ఆయుధాలు అమ్ముకునే అమెరికా, యూరప్ దేశాలు నిరంతరం కాపలా కాస్తుండే పరిస్ధితుల్లో భారత వారసత్వాన్ని కొనసాగించడం అత్యవసరం.

వ్యాఖ్యానించండి