గోధ్రా లో రైలు దహనకాండ అనంతరం, నరేంద్ర మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలపై జరిగిన దారుణ హత్యాకాండపై జరుగుతున్న అనేక కేసుల విచారణలో మొదటిసారిగా నేర నిర్ధారణ జరిగింది. సర్దార్ పురా హత్యకాండకుగాను 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. శిక్షలు ఇంకా ఖరారు కావలసి ఉంది. హత్యాకాండపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ విచారణ జరిగిన కేసులో కోర్టులో నేర నిర్ధారణ జరగడం ఇదే మొదటి సారి. మొత్తం 73 మందిపై నేర విచారణ జరగ్గా 42 మంది నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. వారిలో 11 మందిపై తగిన సాక్ష్యం లేవని ప్రకటించగా, మిగిలిన 31 మందిని ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది.
గుజరాత్ పురా లో హిందూ మతాభిమానులుగా చెప్పుకున్న మూకలు జరిపిన హత్యాకాండలో 33 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. హత్య, హత్యా ప్రయత్నం, దాడులు తదితర ఐ.పి.సి సెక్షన్ల కింద నేర నిర్ధారణ చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. హతులపైన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న నేరాన్ని కోర్టు ఉపసంహరించింది. ఫిబ్రవరి 27, 2002 తేదీన గోధ్రా రైలులో కరసేవకులు ప్రయాణిస్తున్న బోగీని దుండగులు తగులబెట్టడంతో, కరసేవకులతో సహా 59 మంది చనిపోయారు. ఈ దారుణాన్ని అడ్డుపెట్టుకుని “హిందువుల ప్రతీకారం” పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునే ఏ ప్రభుత్వమూ తలపెట్టని దుర్మార్గాన్ని తలపెట్టి ముస్లింలపై హత్యాకాండకు దిగిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా జరిగిన హత్యాకాండలో రెండు వేలకు పైగా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.
సర్దార్ పురా పట్నంలోని విజాపూర్ తాలూకా ఈ మారణకాండకు సాక్షీభూతంగా నిలిచింది. ‘షేక్ వాస్’ అన్న పేరుగల లేన్ ను ఫిబ్రవరి 28, 2002 తేదీన హిందువులుగా చెప్పుకుంటున్న రౌడీ మూక చుట్టుముట్టింది. ఈ లేన్ లో అందరూ ముస్లిం మతస్ధులే కావడంతో దానిపై రౌడీ మూకల కన్ను పడింది. దానితో భయపడిన ముస్లింలు ‘ఇబ్రహీం షేక్’ అనే వ్యక్తి ఇంటిలో తలచాచుకున్నారు. హిందూ మూక అదే అదనుగా భావించింది. ఆ ఇంటిపైన పెట్రోలు పోసి నిప్పంటించడంతో 33 మంది కాలి బొగ్గయ్యారు. వారిలో 22 మంది స్త్రీలు కావడం గమనార్హం. మొత్తం 76 మందిపై పోలీసులు విచారణ జరపగా అందులో ఇద్దరు విచారణ జరుగుతుండగా చనిపోయారు. మరొకరు మైనర్ అయినందున పిల్లల కోర్టులో విచారణ జరుగుతోంది.
జూన్ 2009 లో మొత్తం 73 మందిపైన కోర్టు ఛార్జి షీటు దాఖలు చేసి ట్రయల్స్ ప్రారంభించింది. గోధ్రా రైలు దుర్ఘటన అనంతరం స్ధానిక నాయకుడు, ఇంకొందరు కలిసి ఈ మారణకాండకు కుట్ర పన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సంఘటన జరగడానికి ముందు హత్యాకాండ కోసం ఆయుధాలను పంచారని ఆరోపించింది. నిందితులు తమపైన తప్పుడు కేసులు పెట్టారనీ, బైటినుండి వచ్చిన వ్యక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డారనీ వాదించారు. బాధితుల తరపున వాదించిన వై.బి.షేక్, 80 మంది సాక్షులు, నిందితుల పేర్లను పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో గుర్తించారనీ, ట్రయల్ సందర్భంగా కోర్టులో కూడా వారు నిందితులను గుర్తించారనీ కోర్టుకు తెలిపాడు. సాక్షులు కూడా అల్లర్లలో బాధితులని ఆయన వివరించాడు.
ఛార్జిషీటులో 157 మంది సాక్షులను ప్రస్తావించగా ట్రయల్స్ లో మొత్తం 112 మంది సాక్షులను పరీక్షించారు. వీరిలో ఇరవై మంది డాక్టర్లు కాగా, పదిహేడు మంది పంచనామా సాక్షులు, నలభై మంది అల్లర్ల బాధితులు, ఇరవై మంది పోలీసులు, మరో పదిహేను మంది ఇతరులు ఉన్నారని ‘ది హిందూ’ తెలిపిపింది.
గుజరాత్ మారణకాండకు ప్రధాన బాధ్యుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏ రాష్ట్రం లోనూ లేనంతగా మత సెంటిమెంట్లను గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడి నేతృత్వంలోని బి.జె.పి ప్రభుత్వం రెచ్చగొట్టి ఉంచింది. ఫలితంగా “గోధ్రా రైలు దుర్ఘటన’ పైన మోడి బహిరంగంగా చేసిన మత విద్వేష వ్యాఖ్యలను గుజరాత్ ప్రజలు యధావిధిగా స్వీకరించి మారణ కాండకు తెగబడ్డారు. మతాలు హింసను ప్రేరేపించవని చెబుతూనే అదే మతాన్ని అధికారం కోసం వినియోగించిన బి.జె.పి, చరిత్రలో దోషిగా నిలబడక తప్పదు. రధయాత్ర ద్వారా బి.జె.పి అగ్రనాయకుడు ఎల్.కె.అద్వాని ప్రారంభించిన మారణకాండ, నరేంద్ర మోడి నేతృత్వంలో ఉచ్ఛస్ధాయికి చేరడం యాదృచ్ఛికం కాదు. అధికారం కోసం మత విద్వేషాలను రగిల్చే ఈ పార్టీ ప్రజలకు ఎప్పటికీ మేలు చేయజాలదు.