పెట్రోలు ధరలు ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు దార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పదకొండు సార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై గతంలో ఎన్నడూ నోరు విప్పని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొద్ది రోజుల క్రితం రు1.80 లు పెంచితే గయ్యిమని లేచింది. పెంచిన రేట్లు తగ్గిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించమంటారా? అంటూ తాఖీదు పంపింది.
పెట్రోల్ ధరలు తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తామని తన ఎం.పిలు (తనకు తెలియకుండా) తీర్మానం చేసారనీ, వారిని చూస్తే గర్వంగా ఉందని కూడా మరొక నాటకీయ ప్రకటన చేసింది. మన్మోహన్ ఊళ్ళో లేడు గనక తన హెచ్చరికను ఏడో తారిఖు వరకూ వాయిదా వేస్తున్నాను అని కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సెషన్ కూడా ప్రకటించింది.
ఆ ఏడో తారీఖు వచ్చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో సమాలోచనలు జరుపుతున్నారు. మమత చేసిన హెచ్చరిక ప్రకారం మన్మోహన్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాడా? పెట్రోల్ రేట్లు తగ్గించకపోతే మమత మద్దతు ఉపసంహరించుకుంటుందా? ఏం జరుగుతుంది అని పత్రికలు ఎదురు చూస్తున్నాయి.
నిజానికి పెంచిన పెట్రోల్ రేట్లు తగ్గించే విషయంలో మన్మోహన్ ఇప్పటికే ఓ ప్రకటన చేసేశాడు. ఊళ్ళో లేడు కనుక తన హెచ్చరిక అమలు వాయిదా వేస్తున్నట్లు మమత ప్రకటించింది గానీ, మన్మోహన్ ఆ మర్యాద కూడా పెట్టుకోలేదు. ఊళ్ళో లేకుండానే, అంటే కేన్స్ (ఫ్రాన్సు) లో ఉండగానే ప్రకటన చేసాడు. పెట్రోల్ రేట్లు తగ్గించేదే లేదు పొమ్మన్నాడు. “డబ్బేమన్నా చెట్లకు కాస్తోందా, ఊరికే ఇవ్వడానికి? మార్కెట్ లో డిమాండ్ ప్రకారం పెట్రోల్ రేట్లు పెంచుకునే హక్కు కంపెనీలకు ఉండాల్సిందే” అని తన మార్కెట్ ప్రేమనూ, ప్రజలపై ప్రేమ రాహిత్యాన్నీ చక్కగా సిగ్గులేకుండా ప్రదర్శించుకున్నాడు.
మరి మన్మోహన్, మమతా బెనర్జీతో చర్చించేదేముంటుంది? రేట్లు తగ్గించేది లేదని ప్రకటించాక మమత చెయ్యాల్సింది ఇక మద్దతు ఉపసంహరించుకోవడమే. కాని మమత ఆపని చెయ్యదు. ఎందుకంటె పైకి ఆమె ‘పెట్రోల్ ధరలు’ అని చెప్పినా తెరవెనుక ఆమె డిమాండ్ చేస్తున్నది వేరే ఉంది.
పశ్చిమ బెంగాల్ ఆర్ధిక పరిస్ధితి దయనీయంగా ఉందని అధికారానికి వచ్చినప్పటినుండీ మమత చెబుతోంది. వెళ్తూ, వెళ్తూ ఖజానా ఖాళీ చేశారని వామ పక్షాలపైన ఆరోపణలు చేసింది. అదే నోటితొ తన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వమే సహాయం చేయాలని డిమాండ్ మన్మోహన్ ముందు పెట్టింది. అయితే మన్మోహన్ మమత డిమాండ్ పూర్తిగా కాదనకపోయినా ఆమె అడిగినంత ఇవ్వడానికి అంగీకరించలేదు. దానితో మమత బ్లాక్ మెయిలింగ్ చెయ్యడం లేదంటూనె బ్లాక్ మెయిలింగ్ కి దిగింది.
తన బ్లాక్ మెయిలింగ్ కి మంచి సందర్భం కోసం ఎదురు చూసింది. పెట్రోల్ రేట్ల పెంపుదల ఆమెకి సరైందిగా కనిపించింది. బహిరంగంగా “పెట్రోల్ ధరలు తగ్గిస్తారా లేదా?” అంటున్న మమత అంతరంగంగా “బెంగాల్ కోసం నేనడిగినంత సొమ్ము ఇస్తారా లేదా?” అని గద్దిస్తోంది.
తన రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో మునిగిపోయినందున రు.190 బిలియన్ల (రు.19,000 కోట్లు) ప్యాకేజి కేంద్రం ఇవ్వాలని మమత కోరుతోందని వివిధ వార్తా సంస్ధలు తెలిపాయి. ప్యాకేజికి సంబంధించిన నిర్ధిష్ట వివరాలు పూర్తిగా రూపుదిద్దుకోలేదనీ, వాటిపైనే చర్చలు జరుగుతున్నాయనీ త్రిణమూల్ కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అంటే పైకి పాపులిస్టు నినాదాలను ప్రకటిస్తున్న మమతకు నిజానికి కావలసింది పెట్రోల్ ధరల తగ్గింపు కాదు. ఆమె అడిగినన్ని నిధులు కేంద్రం నుండి రాబట్టుకోవడమే మమతకు కావలసింది.
ఇది తెలుసు కనుకనే ‘మద్దతు ఉపసంహరిస్తామని’ మమత ప్రకటించినా ప్రధాని మన్మోహన్ అదరలేదు, బెదరలేదు. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అని కూడా ఎదురు ప్రశ్నించగల ధైర్యం ప్రధాని ప్రదర్శించాడు తప్ప తొణకలేదు. ఇండియాకి వచ్చాక నాలుగు డబ్బులు విసిరి మమత నోరు మూయించవచ్చని ప్రధానికి అవగాహన ఉన్నందున కూటమి ధర్మాన్ని (భాగస్వామ్య పార్టీల బ్లాక్ మెయిలింగ్ లకు లొంగడం) కాలదన్ని నిర్భయంగా రేట్లు తగ్గించేది లేదు పొమ్మన్నాడు.
ప్రస్తుతం మన్మోహన్, మమత ల మధ్య జరుగుతున్న చర్చలలో ఎంత ఇవ్వాలన్నది నిర్ణయమవుతుంది. పెట్రోల్ రేట్లను తగ్గించకుండా మమత చేత ఓ ప్రకటన ఇప్పించవచ్చు. ‘పెట్రోల్ ధరల పెంపుపై ప్రధాని వాదన మాకు సంతృప్తి కలిగించింది” అని మమత ప్రకటన చేయవచ్చు. సొమ్ములు అందుతున్న ఆనందంలో అటువంటి చిన్న ప్రకటన చేయడానికి మమత వెనకాడదు. లేదూ పరువు పోగొట్టుకోకుండా ఉండాలంటె పదో, పరకో తగ్గించొచ్చు. అసలు పెట్రోల్ రేట్లు ముట్టుకోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా పెట్రోల్ రేట్ల పట్ల మమత బహిరంగ డిమాండ్ పట్ల పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు ఆగ్రహం ప్రకటిస్తున్నాయి. ఈ రకంగా పాపులిస్టు (ప్రజా సంక్షేమ విధానాలను ఇలాగే ప్రస్తావిస్తారు. అంటే ప్రజలకు అనుకూలమైన విధానాలు పాపులిస్టు విధానాలే తప్ప ప్రజలకు అవసరమైన విధానాలు కావు అని చెప్పడం దీని ఉద్దేశం. కంపెనీలకు, మార్కేట్లకు ఉపయోగం లేకుండా బడ్జెట్ నుండి ప్రజలకోసం చేసే ఖర్చుల్ని స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ ఈ పేరుతో తీవ్రంగా వ్యతిరేకిస్తారు.) విధానాలకు డబ్బు ఖర్చు పెడితే బడ్జెట్ లోటు ఎలా తగ్గుతుంది అని అవి ప్రశ్నిస్తున్నాయి. తద్వారా కంపెనీలపైన భారం మోపకుండా వారి రాయితీలు తగ్గించకుండా ప్రజలపై భారం మోపే విధానాల ద్వారా బడ్జెట్ లోటు పూడ్చాలని అవి చెబుతున్నాయి.
“ఆమె పాపులిస్టుగా ఉండాలని కోరుకుంటోంది. దాని పర్యవసానాలు ఆలోచించడం లేదు” అని ఆర్పిజి ఫౌండేషన్ అధిపతి పాయ్ పణాధికార్ అన్నట్లుగా రాయిటర్స్ రాసింది. ఇంకా అలాంటి ప్రవేటు కంపెనీల అధిపతులు, మార్కెట్ అనుకూల విశ్లెషకులు ఎలా మమత పెట్రోల్ డిమాండ్ ని నిరసించిందీ అది రాసింది. ఈ వార్తే కాదు. ప్రతి ఆర్ధిక వార్తలోనూ ఇలాగే మార్కెట్ పండితుల అభిప్రాయాలను గుప్పిస్తూ వాటినే ఆర్ధిక సూత్రాలుగా వార్తా సంస్ధలు చెలామణి చేస్తాయి. తద్వారా ప్రజానుకూలంగా ప్రభుత్వాలు ఎప్పుడైన చిన్న చర్య తీసుకుంటే గగ్గోలు పెడుతూ ఉంటాయి.
మార్కెట్ ఆర్ధిక సూత్రాలను సహజ ఆర్ధిక సూత్రాలుగా చెలామణి చెయ్యడం కార్పొరేట్ వార్తా సంస్ధలకు ఒక నిరంతర కార్యక్రమం.