“పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం” అని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, చివరికి తన బెదిరింపులు నిజమైనవి కావని తేల్చేసింది. మంగళవారం ప్రధానితో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి లు ప్రధాని నుండి తమకు ఏ విధమైన హామీ రాలేదని చెప్పారు. “(ఇప్పుడు పెంచితే పెంచారు), ఇకముందు పెంచకూడదు” అని హెచ్చరించి వచ్చాం” అని కూడా వారు పత్రికలకు చెప్పి చక్కా పోయారు.
‘లేస్తే మనిషిని కాను’ టైపు ప్రకటనలతో ప్రజల్నీ, పత్రికల్నీ కూడా మోసం చేయజూస్తున్నారు. తమ ఎం.పిలు తీర్మానం కూడా చేసారని మమత కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అందుకు తాను గర్వపడుతున్నాని కూడా వ్యాఖ్యానించింది. ఇపుడీ ఎం.పి లు మమత గర్వాన్ని రెట్టీంపు చేసారో, సగానికి తగ్గించారో మమత చెప్పాల్సి ఉంది.
పెట్రోల్ ధరల్ని ఇకముందు పెంచితే సహించేది లేదని ప్రధానికి తెగేసి చెప్పినట్లుగా తృణమూల్ ఎం.పిలు పత్రికలకు తెలిపారు. “మా సెంటిమెంట్లను ప్రధానికి వివరించాము. కోల్ కతాలో జరిగిన మా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆమోదించిన తీర్మానం కాపీని ఆయనకు ఇచ్చాము.” తృణమూల్ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న సుదీప్ బంధోపధ్యాయ్, ప్రధానిని కలిసిన అనంతరం తెలిపాడు.
మరోసారి పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచే దిశగా తీసుకునే ఏ నిర్ణయాన్నయినా మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రధానికి చెప్పామని సుదీప్ చెప్పాడు. డీజెల్, ఎల్.పి.జి, కిరోసిన్ ధరలు పెంచడానికి వీల్లేదని హెచ్చరించామని చెప్పాడు. అయితే డీజెల్, గ్యాస్, కిరోసిన్ రేట్లు పెంచే ఆలోచన, ప్రతిపాదన ఉన్నదని తనకు ఎలాంటి సమాచారం లేదని ప్రధాని చెప్పినట్లుగా కూడా వాళ్ళు చెప్పారు. అంటే లేని నిర్ణయం పైన వారు హెచ్చరిక జారీ చేసారన్నమాట.
“పెట్రోల్, డీజెల్, గ్యాస్ ల ధరలు పెంచేందుకు మరొకసారి నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని త్రిణమూల్ కాంగ్రెస్ అంత తేలికగా జీర్ణించుకోలేదు” అని సుదీప్ పత్రికలకు తెలిపాడు. పెంచినప్పుడల్లా ఏదొక తాయిలం ఇస్తూ ఉంటే అప్పుడు త్రిణమూల్ ధరల పెంపును తేలిగ్గా జీర్ణించుకుంటుంది.