జీహాదిస్టులకు సమీపంలో పాక్ అణ్వస్త్రాలు, కొట్టిపారేసిన పాకిస్ధాన్


పాకిస్ధాన్ నిల్వ చేసుకున్న అణ్వస్త్రాలు అక్కడ తలచాదుకున్న జిహాదీ శక్తులకు అత్యంత సమీపంలో ఉన్నాయనీ, పాక్ అణ్వస్త్ర భద్రత ప్రమాదంలో పడిందనీ విశ్లేషిస్తూ అమెరికా పత్రిక “అట్లాంటిక్’ ప్రచురించిన కధనాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది తమ శత్రువులు నిరంతరం తమకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారమేననీ, నిజానికిది కొత్తకాదనీ పాక్ నిరసించింది. వాస్తవంలో అమెరికా డేగకళ్ళనుండే తమ అణ్వస్త్రాలకు ప్రమాదం ఏర్పడిందనీ పాకిస్ధాన్, అమెరికా మొఖాన్నే కాసింత బురద జల్లింది.

పాకిస్ధాన్ దేశాన్ని, అమెరికాకి ‘నరకం నుండి దిగొచ్చిన మిత్రుడు’గా పోలుస్తూ అట్లాంటిక్ పత్రికలో రచయితలు జెఫ్రీ గోల్డ్‌బర్గ్, మార్క్ అంబీందర్ లు అభివర్ణించారు. “ది అట్లాంటిక్” డిసెంబర్ సంచికలో వచ్చిన ఆ కధనం “పూర్తి కల్పితం, ఆధార రహితం, మరియు దురుద్దేశంతో కూడినది” అని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రకటన పేర్కొంది. అణ్వస్త్రాలు గానీ, అణు పదార్ధాలు గానీ పొందడానికి మిలిటెంట్లకు అనువైన ప్రాంతం పాకిస్ధాన్ మాత్రమేనని రచయితలు పేర్కొన్నారు. బలహీన ప్రభుత్వం, భద్రతా బలగాలలోనికి జీహదిస్టు శక్తులు చొచ్చుకుని వెళ్ళడం అందుకు కారణాలని రచయితలు పేర్కొన్నారు.

అయితే పాకిస్ధాన్ ప్రభుత్వం తమ అణ్వస్త్రాలను అమెరికానుండి కాపాడుకోవడానికి ఎక్కువ శ్రమించవలసి వస్తున్నదని పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అభిప్రాయంతో వ్యాస రచయితలు కూడా ఏకీభవించడం గమనార్హం. అమెరికా నుండి ప్రమాదం వలన తమ అణ్వస్త్రాలను ఎవరికి తెలియని రహస్య ప్రదేశంలో దాయడానికి పాక్ ప్రయత్నిస్తున్నదని రచయితలు వ్యాఖ్యానించారు. రచయితల ప్రకారం పాకిస్ధాన్ అణ్వస్త్రాలను భద్రపరచడానికి అమెరికా 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. మరో 20 బిలియన్ డాలర్లు గత దశాబ్దంలో పౌర, మిలట్రీ సహాయార్ధం అమెరికా ఇచ్చింది. తద్వారా టెర్రరిజం వ్యతిరేక యుద్ధంలో పాకిస్ధాన్ లొంగుబాటుని అమెరికా డిమాండ్ చేసింది.

అయితే పాకిస్ధాన్ సహకారం పట్ల అమెరికా అంతకంతకూ అనుమానాలు పెంచుకుందని రచయితలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇద్దరు పాక్ పౌరులను సి.ఐ.ఎ అధికారి కాల్చిచంపడం, బిన్ లాడెన్ హత్య తర్వాత టెర్రరిస్టులనూ, వారి సానుభాతిపరులనూ నిర్మూలించడంలో పాకిస్ధాన్ చిత్తశుద్ధితొ కృషి చేయడం లేదని అమెరికా భావిస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా బలగాలపై పదే పదే దాడులు చేస్తున్నది పాక్ మద్దతు ఉన్న హక్కానీ గ్రూపు మిలిటెంట్లేనని అమెరికా భావిస్తూ ఆ గ్రూపును నిర్మూలించాలని పాక్ ని డిమాండ్ చేస్తున్నది. కాని పాక్ దానికి సిద్ధపడడం లెదు. హక్కాని గ్రూపుతో తనకు సంబంధాలు లేవని చెబుతూ, తన భూభాగంపై దాడులు చేసే ఆలోచనను అమెరికా కట్టిపెట్టాలని పరుష ప్రకటన చేసింది.

పాక్ భూభాగంపై దాడి చేసి బిన్ లాడెన్ ను చంపినట్లు అమెరికా ప్రకటించినప్పటినుండీ తన అణ్వస్త్రాల విషయంలో కూడా అటువంటి దుస్సాహసానికె అమెరికా పూనుకుంటుందని పాకిస్ధాన్ భావిస్తోంది. పాక్ లోకి చొరబడి బలవంతంగా అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుందని పాక్ అనుమానిస్తోంది. ఈ అనుమానాలలో నిజం ఉందని అట్లాంటిక్ వ్యాస రచయితలు ధృవీకరిస్తున్నారు. పాక్ ప్రభుత్వం బలహీనపడినప్పుడో లేదా జీహాదిస్టు శక్తులు పై చేయి సాధిస్తేనో కొన్ని వందల మంది కమేండర్లనూ, అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయగల నిపుణులనూ వెంటేసుకుని వచ్చి పాక్ అణ్వస్త్రాలను నిర్బంధించి నిర్వీర్యం చేయడానికి అమెరికా పలు పధకాలు రూపొందించిందని వ్యాస రచయితలు తెలిపారు.

ఈ అనుమానం నేపధ్యంలో పాకిస్ధాన్ పైన మరొక ఆరోపణను రచయితలు చేస్తున్నారు. అణ్వస్త్రాలను పూర్తిగా తయారు చేసిన రూపంలోనే పౌర వాహనాలలో ఎవరికీ అనుమానం రాకుండా, పెద్దగా మందీ మార్బలం రాకుండా ఒక చోటి నుండి మరొక చోటికి పాక్ ప్రభుత్వం రవాణా చేస్తున్నదని రచయితలు ఆరోపించారు. ఎవరూ పసిగట్టకుండా ఉండడానికి రెగ్యులర్ ట్రాఫిక్ లోనే కలిసిపోయి రవాణా చేస్తున్నారని ఆరోపించారు. జీహాదిస్టులు అణ్వస్త్రాలను దొంగిలించడానికి ఈ పరిస్ధితి మరింత అనుకూలంగా ఉన్నదని వారు చెబుతున్నారు.

ఈ అనుమానాలను పాకిస్ధాన్ కొట్టిపారేసింది. “తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి పాకిస్ధాన్ కి ఉన్న నిబద్ధతను ఎవరూ అనుమానించలేరు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి భూభాగాలను రక్షించుకోవడానికి పాక్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని నొక్కి చెప్పారు.

పాకిస్ధాన్ ప్రభుత్వం బలహీనంగా ఉండడం ఒక్కటే కాకుండా శక్తివంతమైన మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు చురుకుగా జీహాదిస్టు శక్తులకు మద్దతు ఇస్తుండడమే అమెరికాకు ఆందోళనగా ఉన్నదని రచయితలు భావిస్తున్నారు. “టెర్రరిస్టు సంస్ధలకు మద్దతు ఇస్తున్న విషయాన్ని పాకిస్ధాన్ ఉద్దేశ్యపూర్వకంగానే అమెరికాకు తెలియకుండా దాచి పెట్టింది” అని రచయితలు ఆరోపిస్తున్నారు. హక్కానీ గ్రూపుపైన దాడులు చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే హక్కాని గ్రూపుని పెంచి పోషించింది అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఏ మాత్రమేననీ, అది మరిచి పాకిస్ధాన్ పైన ఆరోపణలు గుప్పించడం మానాలని పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ అమెరికాకు బదులిచ్చిన సంగతిని రచయితలు పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది.

సోవియట్ రష్యా సైన్యానికి వ్యతిరేకంగా అమెరికా, సి.ఐ.ఎ, పాకిస్ధాన్, ఐ.ఎస్.ఐ లు ఉమ్మడిగా టెర్రరిస్టు సంస్ధలను పెంచి పోషించిన సంగతిని రచయితలు ఎలా విస్మరించగలిగారో అర్ధం కాని విషయం. ఇరవై సంవత్సరాలుగా అమెరికాకి తెలియకుండా పాకిస్ధాన్ టెర్రరిస్టులతో సంబంధాలు నెరిపిందనడం పచ్చి అబద్ధం, మోసపూరితం కూడా. అసలు టెర్రరిస్టు సంస్ధలను పెంచిందే అమెరికా ప్రయోజనాల కోసం కాగా ఆ సంగతి అమెరికాకి తెలియదనడం వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప మరొకటి కాదు. తానొక్కటే టెర్రరిస్టు గ్రూపులను పోషించగల సత్తా పాకిస్ధాన్ కి ఉందా అన్నది అనుమానమే.

రాబోయే రోజుల్లో పాకిస్ధాన్ పైన కూడా అమెరికా దాడి చేయడానికి తగిన భూమికను రచయితలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాకిస్ధాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడానికి అమెరికా కుట్ర పన్నిందనడం వరకూ రచయితల వాదనను అంగీకరించవచ్చు. కానీ పాపం అంతా పాకిస్ధాన్ దే అనడం పూర్తిగా అబద్ధం. ఆ వంకతో పాక్ పై చేయడానికి అమెరికా భావిస్తుండవచ్చు. అప్పటివరకూ మిత్రుడుగా అభివర్ణిస్తూ వచ్చిన గడ్డాఫీని బాంబుదాడులతో చంపినట్లుగానే ఇప్పటివరకూ పాక్ ను మితృడుగా చెబుతూ వచ్చిన అమెరికా ఆ దేశంపైన దాడి చేయడానికి ఏ మాత్రం వెనకాడదు. అదే జరిగితే అమెరికా వలన ఇండియాకు కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.

వ్యాఖ్యానించండి