ఇజ్రాయెల్ వెబ్‌సైట్లపై ‘ఎనోనిమస్’ సైబర్ దాడులు, నిరాకరించిన ఇజ్రాయెల్


ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, ఆర్మీ లతో పాటు వివిధ ప్రభుత్వ వెబ్ సైట్లపైన సైబర్ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ‘ఎనోనిమస్’ సంస్ధ ప్రకటించిన రెండు రోజుల్లోనే సదర్ వెబ్ సైట్లన్నీ అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ రూపొందించడంలో పేరెన్నికగన్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్ సైట్లే హ్యాకింగ్ కి గురైతే ఆ వార్త ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అందుకేనేమో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ సైట్లను ఎవరూ హ్యాక్ చెయ్యలేదనీ, కొన్ని సమస్యలవలన మాత్రమే తాత్కాలికంగా మూతబడ్డాయని ప్రకటించింది.

ఇజ్రాయెల్ అధికారులు, సెక్యూరిటీ నిపుణులు ఎనోనిమస్ హ్యాకర్లు దాడులు చేశారన్న వార్తను నిరాకరించారు. ఆదివారం అనేక ప్రభుత్వ వెబ్ సైట్లు విఫలం కావడం వెనుక ఎవరి హస్తమూ లేదని తెలిపారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్, మరొక సీక్రెట్ సర్వీస్ సంస్ధ ‘షిన్‌బెట్’, ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర అనేక ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వెబ్ సైట్లు ఆదివారం విఫలం అయ్యాయి. మొస్సాద్, షిన్‌బెట్ వెబ్ సైట్లు కూడా విఫలం కావడం సంచలనం కలిగిస్తోంది. అనేక గంటలపాటు ఈ వెబ్ సైట్లన్నీ అందుబాటులో లేకుండా పోయాయి. సోమవారానికల్లా వెబ్ సైట్లు పునరుద్ధరించబడ్డాయి.

గత శుక్రవారం యూ ట్యూబ్ లో ఎనోనిమస్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఇజ్రాయెల్ వెబ్ సైట్లపైన దాడి చేస్తానని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైనిక దిగ్బంధనలో ఉన్న పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ కు సహాయం అందజేయడానికి సముద్రం ద్వారా వస్తున్న నౌకలను అడ్డుకోవడం కొనసాగిస్తే దాడులు చేస్తామని హెచ్చరించింది. కెనడా, ఐర్లండ్ నుండి వస్తున్న నౌకలను అడ్డుకుని సిబ్బందిని అరెస్టు చేసిన  కొద్ది సేపటికే ఈ విడియో ప్రత్యక్షమయ్యింది. వీడియో ద్వారా ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక గొంతు రికార్డ్ చేయబడింది.

సముద్ర లోతుల్లో ఇజ్రాయెల్ పైరసీ ఎక్కువయ్యిందని వీడియో నిందించింది. “మీ చర్యలు చట్టవిరుద్ధం. ప్రజాస్వామ్యానికీ, మానవ హక్కులకూ, అంతర్జాతీయ సముద్ర చట్టాలకు వ్యతిరేకమైనవి. ఆత్మరక్షణ అనే చట్టవిరుద్ధమైన ముసుగులో యుద్ధం, హత్యలు, చట్టవిరుద్ధంగా అడ్డుకోవడం, పైరేట్ల వలే చేసే చర్యలు మొదలైనవాటికి పాల్పడడం మా దృష్టినీ, ప్రపంచ ప్రజానీకం దృష్టినీ తప్పించుకుని పోలేవు. నిరాయుధులయిన పౌరులపై మళ్ళీ మళ్ళీ దాడులు చేసే ప్రవర్తనను మేము సహించజాలము. గాజాకు మానవతా సాయంతో వస్తున్న నౌకలను మళ్ళీ అడ్డుకున్నట్లయితే మేము దాడి చేయడం తప్ప మరొక అవకాశం మాకు ఇవ్వనట్లే. మళ్ళీ మళ్ళీ దాడి చేస్తాం. మీరు ఆపే వరకూ” అని వీడియో సందేశం పేర్కొన్నది.

ఈ సందేశం పోస్ట్ అయిన 48 గంటల్లోనే ఇజ్రాయెల్ వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి. ఆర్మీ ప్రతినిధి ఒకరు అది కేవలం ‘యాదృచ్ఛికం’ మాత్రమేనని సర్ది చెప్పాడు. ఆయన సర్దుబాటును ఇతర నిపుణులు కొట్టిపారేశారు. పాలస్తీనా వెబ్ సైట్లు, రస్సెన్ ట్రిబ్యునల్ వెబ్ సైట్ కూడా హ్యాక్ అయిన సంగతిని వారు గుర్తు చేశారు. ‘ఇజ్రాయెల్ వర్ణవివక్ష అమలు చేస్తున్న దేశం’ గా ఎందుకు పరిగణించాలన్న విషయంలో సౌత్ ఆఫ్రికాలో సాక్ష్యాలను రస్సెల్ కమిషన్ రికార్డ్ చేస్తోంది. ఇజ్రాయెల్ వెబ్ సైట్ల రక్షణకు బాధ్యత వహించే నిపుణుడు నిట్జన్ మైరాన్ మాత్రం ‘ఈ యాదృచ్ఛికత మాత్రం కొత్తగా ఉంది’ అని వ్యాఖ్యానించాడు.

ప్రపంచవ్యాపితంగా ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ లను ఇజ్రాయెల్ తయరు చేసిన అల్గారిధమ్స్ రక్షణ నిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఉత్తమంగా భావించే ఇజ్రాయెల్ వెబ్ సైట్లే హ్యాకింగ్ కి గురవడం అంటే అది ఆ దేశానికి చాలా అవమానకరం. తనకు అవమానకరంగానూ, తన తప్పును పట్టించే చర్యలనూ వెంటనే తిరస్కరించే అలవాటు ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు బాగా ఉంది. పాలస్తీనా పైన అమానుషమైన దాడులు చేసి ఆ తర్వాత వారిపైన టెర్రరిస్టు ముద్ర వేయడం ఇజ్రాయెల్ కి వెన్నతో పెట్టిన విద్య. అటువంటి ఇజ్రాయెల్ అంత త్వరగా తన బలహీనతను ఒప్పుకోవడం జరిగే పని కాదు.

వ్యాఖ్యానించండి