భారత్ అధికారుల అనుమానం నిజం అయ్యింది. ఇండియాకి తామింకా “అత్యంత అనుకూలమైన దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎఫ్) హోదా ఇవ్వలేదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని స్పష్టం చేశాడు. ఆ హోదా ఇవ్వడానికి చర్చలు జరిపడానికి ముందుకు కదలాల్సిందిగా ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ కు ఆదేశాలివ్వడం మాత్రమే జరిగిందని ఆయన శనివారం వెల్లడించాడు.
“ఈ అంశంలో ముందడుగు వెయ్యాలని వాణిజ్య శాఖకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియాతో వాణిజ్యం విషయంలో చురుకుగా ఉన్న వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆ మేరకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. వాణిజ్య సంబంధిత అంశాలపై చర్చలు జరపాలని కేబినెట్ కోరింది. అంతే” అని లాహోర్ లో తెలిపాడు.
“పరిస్ధితులు అనుకూలంగా ఉన్నట్లయితే, అవి జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నట్లయితే ఎం.ఎఫ్.ఎన్ హోదా ఇవ్వడానికి మేము పూర్తి అనుమతి ఇస్తాము. లేనట్లయితే ఆ హోదా ఇవ్వడానికి అంగీకరించబోము” అని గిలాని తెలిపాడు. ఎం.ఎఫ్.ఎన్ హోదా ఇస్తున్నట్లు పాక్ వాణిజ్య శాఖ ప్రకటించిందని భారత్ పత్రికలు వార్తలు ప్రచురించడం, ఆ తర్వాత పాక్ నుండి అటువంటిదేమీ లేదని మంత్రులు ఖండించడం జరిగిన నేపధ్యంలో పాక్ ప్రధాని ఈ వివరణ ఇచ్చాడు.
సమాచార శాఖ మంత్రి ఫిరదౌస్ అవాన్ ‘ఇండియాకు ఎం.ఎఫ్.ఎన్ హోదా ఇవ్వడానికి కేబినెట్ ఏకగ్రీవంగా అంగీకరించిందని’ బుధవారం ప్రకటించాడు. అది కేవలం ముందుకు కదలడానికి మాత్రమేనని ఆ వెంటనే విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. సూత్రబద్ధ అంగీకారం వరకు కేబినెట్ తెలిపిందని ఆ శాఖ చెప్పింది.
మరొక అయోమయం కూడా ఈ అంశంలో నెలకొని ఉంది. ఎం.ఎఫ్.ఎన్ హోదా అనేది వ్యాపార, వాణిజ్యాలు, ఇరుదేశాల స్టాక్ ఎక్ఛేంజిలకు మాత్రమే వర్తిస్తుందని ప్రధాని గిలాని చెబుతుండగా ఇతరులు అందుకు విరుద్ధంగా చెబుతున్నారు. బుధవారం పత్రికల సమావేశంలో మంత్రి ఫిరదౌసి ‘మిలట్రీ, రక్షణ సంస్ధలు కూడా ఎం.ఎఫ్.ఎన్ హోదా అంశంలో కలిసి ఉన్నాయ’ని పేర్కొన్నాడు. ఇండియాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచే అంశం కూడా విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ మిలట్రీ అధికారులతో జరిపిన చర్చలలో ప్రముఖ అంశంగా చోటు చేసుకుందని తెలుస్తోంది. ఐ.ఎస్.ఐ అధిపతి షుజా పాషా కూడా ఈ చర్చలలో పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
“వాణిజ్య విధానం పైన ఇండియాతో బేరసారాలు జరపడంలో వాణిజ్యశాఖ స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అందుకే అది కేబిజెట్ అనుమతి కోరింది” అని గిలాని చెప్పాడు. ఎం.ఎఫ్.ఎఫ్ హోదా విషయంలో కేబినెట్ పార్లమెంటును సంప్రదించవలసిన అవస్రం లేదని కూడా ఆయన చెప్పాడు. పార్లమెంటుకు ఈ విషయంపై సమాచారం ఇస్తాం కాని పార్లమెంటు అనుమతి అవసరం లేదని ఆయన చెప్పాడు.
ఇండియాతో వాణిజ్యం సరళీకరిస్తే పాకిస్ధాన్ కి లాభకరం అని గిలాని అభిప్రాయపడ్డాడు. దానర్ధం కాశ్మీరు అంశాలపైన మా అవగాహనను వదులుకున్నామని కాదు. అవన్నీ కొనసాగుతూనే ఇండియాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకుంటామని గిలాని తెలిపాడు. టెర్రరిజం ఉమ్మడి శత్రువని తాను భారత్ ప్రధానికి చెప్పినట్లుగా ఆయన తెలిపాడు.
ఇండియాకు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడంలో పాకిస్ధాన్ పాలకపార్టీలోనూ, మంత్రివర్గంలోనూ విభేధాలున్నాయని తాజా ఘటనల క్రమాన్ని బట్టి అర్ధం అవుతోంది.