పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ


యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో సంప్రదించకుండా పెట్రోల్ ధరలు పెంచినందుకా లేక పెట్రోల్ ధరలే పెంచినందుకా అన్నది స్పష్టం కాకుండా ఉంది. “పెట్రోల్ ధర పెంపుదల కొనసాగినట్లయితే మేము మద్దతు ఉపసంహరించుకుంటాము. మమ్మల్ని అనేకసార్లు అవమానించారు. పార్లమెంటులో మాకు కనీసం చోటు లేకుండా చేస్తున్నారు” అని ఆమె కోల్‌కతా లో పత్రికలతో మాట్లాడుతూ అన్నది. త్రిణమూల కాంగ్రెస్ ఈ హెచ్చరిక జారీ చేసిన అనంతరం పెట్రోల్ ధరల పెంపు కొంతమేరకైనా ఉపసంహరించే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా దైనిక్ భాస్కర్ పత్రిక తెలిపింది.

జి20 సమావేశాలకు హాజరైన ప్రధాని మన్మోహన్ శనివారం తిరిగి ఇండియా చేరుకుంటాడు. ఆయన రాకకోసం కాంగ్రెస్ మంత్రులు ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ధరల పెంపువలన ఏర్పడనున్న రాజకీయ పరిణామాలు, తదనంతర చర్యల గురించి ప్రధాని మన్మోహన్ వచ్చాక చర్చిస్తారని తెలుస్తోంది. తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలనీ పెట్రోల్ ధరల పెంపుదల తమకు సమ్మతం కాదనీ మమతా బెజర్జీ హెచ్చరిక ఎలా ఉన్నప్పటికీ పెట్రోల్ ధరల పెంపును ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్ధించుకున్నాడు.

ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం కాదని ఆయిల్ కంపెనీలు పెంచాయనీ ప్రణబ్ ముఖర్జీ ఓ పెద్ద కళ్ళు తిరిగే వాస్తవాన్ని వెల్లడించాడు. తద్వారా పెట్రోల్ ధర పెంపుకు కేంద్ర ప్రభుత్వం  బాధ్యత లేదని ఆయన గారు చెప్పదలిచారు.. పెట్రోల్ ధరల పెంపుదల ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదపడుతుందని కూడా ఆయన సిగ్గులేకుండా వ్యాఖ్యానించాడు. “ప్రభుత్వంలో ఎవరికీ తెలియదు… ఎందుకంటే పెట్రోల్ ధరల్ని పెట్ర్రోలియం కంపెనీలు పెంచాయి. ప్రభుత్వం కాదు. డీజెల్, కిరోసిన్, గ్యాస్ ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది” అని ప్రణబ్ వ్యాఖ్యానించాడు.

ద్రవ్య విధానం సమీక్ష జరిపిటేప్పుడు ఆర్.బి.ఐ గవర్నర్ ద్రవ్యోల్బణం తగ్గించడమే తమ ప్రధానకర్తవ్యమని ప్రకటిస్తాడు. అందుకోసం ఇప్పటికి వరుసగా పదమూడు సార్లు వడ్డీ రేట్లను పెంచి సాధారణ ప్రజానీకానికి బ్యాంకు అప్పులు అందుబాటులో లేకుండా చేశాడు. మరోపక్క ఆయిల్ కంపెనీలు అదే పనిగా పెట్రోల్, డీసిల్, గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతాయి. రూపాయి ధర తగ్గిన భారం కూడా ప్రజలపైనే కంపెనీలు బాదుతాయి. కాని రూపాయి విలువ తగ్గిన భారం ప్రజలపైన కూడా పడుతున్న సంగతిని కంపెనీలూ, ప్రభుత్వాలు కూడా విస్మరిస్తాయి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినపుడు దేశియంగా పెట్రోల్ ధరలు తగ్గించిన పాపాన ఒక్కసారి కూడా కంపెనీలు పోలేదు. ఇక ద్రవ్యోల్బణం తగ్గించడానికే ప్రభుత్వం, ఆర్.బి.ఐ కట్టుబడి ఉందని చెబుతుంటే వీళ్లని ప్రజలు ఎలా నమ్మాలి?

ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు సార్లు పెట్రోల్ ధరల్ని పెంచారు. గతంలో నాలుగు సార్లు పెంచినపుడు ఈ త్రిణమూల్ పార్టీ ఎక్కడ ఉన్నదో, కలకత్తా కాళిక ఎక్కడున్నదో అర్ధం కాని విషయం. లీటరుకి ఐదు రూపాయలకు పైగా ఒకేసారి పెంచిన సందర్భంలో మన్ను తిన్న పాములా గమ్మున ఉండిపోయిన మమతా బెనర్జీ లీటరుకి రు.1.80 పెంచినపుడు పెద్ద ఎత్తున నిరసన తెలపడం, మద్దతు ఉపసంహరిస్తానని ఉడత ఊపులు ఊపడం ఎవరిని మభ్యపెట్టడానికి? మన్మోహన్ వచ్చాక ఓ పదో, పరకో పైసలు పెంచిన పెట్రోల్ ధరని తగ్గిస్తారు కాబోలు!

వ్యాఖ్యానించండి