
ఈ వారం ప్రారంభంలో ఇండియాకు, పాకిస్ధాన్ ప్రకటించిన ‘అత్యంత అనుకూల దేశం’ (మోస్ట ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎన్) హోదా ను మళ్ళీ చిక్కులో పడింది. దేశీయంగా తలెత్తిన అభ్యంతరాలతో ఇండియాకు ఎమ్.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ శుక్రవారం తెలిపింది.
ఎం.ఎఫ్.ఎన్ హోదా ఉన్నట్లయితే కొన్ని వ్యాపార సంభంధిత ప్రయోజనాలను ఇండియా పొందగలుగుతుంది. ఇండియా, పాకిస్ధాన్ కు ఎన్నడో 1990లలోనే ఎం.ఎఫ్.ఎఫ్ హోదాను మంజూరు చేసింది. అప్పటినుండీ పాకిస్ధాన్ నుండి తగిన ప్రతిస్పందన రాలేదు. గత బుధవారమే పాక్ ప్రభుత్వం భారత్ కు ఎం.ఎఫ్.ఎఫ్ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. దానితో పొరుగుదేశాల మధ్య వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు.
ఎం.ఎఫ్.ఎన్ హోదా లభించినట్లయితే భారత్, పాకిస్ధాన్ కు చేశే అనేక ఎగుమతులపైన పన్ను రాయితీ లభిస్తుంది. ఎగుమతులపై ఉన్న అనేక నిబంధనలు ఎత్తి వేయబడతాయి. తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది. ఇరువైపులా వాణిజ్య వర్గాలు ఈ హోదాతో లబ్ది పొందుగాయి. పాకిస్ధాన్ ఎగుమతులకు ఇండియా ప్రస్తుతం అనేక రాయితీలు ఇస్తోంది. పాకిస్ధాన్ కు ఎం.ఎఫ్.ఎఫ్ హోదా ఇచ్చినందు వలన ఇండియా, పాకిస్ధాన్ లు రెండూ లబ్ది పొందుతున్నాయి. ఇండియాకు కూడా ఎం.ఎఫ్.ఎన్ హోదా లభించినట్లయితే ఈ వ్యాపారం మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది.
అయితే పాకిస్ధాన్ లోని వ్యాపార వర్గాలు , రాజకీయ లాబీలు, ఇండియాకు ఎం.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానితో ఇండియా ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా భారత అధికారి ఒకరు తెలిపారు. “బేషరతుగా ఇండియాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఇస్తున్నట్లు పాకిస్ధాన్ ప్రకటించినప్పటినుండీ పాకిస్ధాన్ మళ్ళీ వెనక్కి మళ్ళీనట్లు స్పష్టమవుతోంది అని భారత అధికారి తెలిపినట్లుగా రాయిటర్స్ తెలిపింది.
భారత్, పాకిస్ధాన్ ల మధ్య వ్యాపారం చాలా కాలంగా రాజకీయ కారణాలవలన పెద్దగా అభివృద్ధి చెందలేదు. బుదవారం ఇండియాకు ఎం.ఎఫ్.ఎఫ్ హోదా ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని మైలురాయిగా ఇరు పక్షాలూ అభివర్ణించుకున్నాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికి దోహదం చేస్తుందని భావించాయి. ఒకరిపై మరొకరు విశ్వాసం పెంపొందడానికి వాణిజ్య సంబంధాలు దోహదం చేస్తాయని సంతోషించారు. ఇంతలోనే పాకిస్ధాన్ నుండి ప్రతికూల వార్తలు వచ్చాయి.
వ్యాపార వీసాలు జారీ చేయడానికి నిబంధనలను సరళీకరించాలనీ, పన్నులు కాని ఇతర వ్యాపార అడ్డంకులను తొలగించాలనీ, భూ సరిహద్దు ద్వారా వ్యాపారాన్ని పెంపొందించాలనూ కూడా ఇరు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం భారత ఎగుమతి దారులు మూడవ దేశం గుండా ఎగుమతులు చేయవలసి వస్తున్నది. ఉదాహరణకి దుబాయ్ ద్వారా పాకిస్ధాన్ కు సరుకులను భారత ఎగుమతుదారులు ఎగుమతి చేస్తున్నారు. పాకిస్ధాన్, భారత్ కి చేసే ఎగుమతులు కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఇది రవాణా కాలాన్ని, ఖర్చునూ పెంచి సరుకుల ధరలలో కలపవలసి వస్తోంది. దానితో సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. మోస్ట్ ఫేవర్డ్ హోదా వచ్చినట్లయితే ఇలాంటి అడ్డంకులు ఎన్నో తొలగిపోయే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా భారత్ కి ఎం.ఎఫ్.ఎన్ హోదా ఇచ్చే విషయంలో పాకిస్ధాన్ వెనక్కి తగ్గిందన్న వార్తలను పాకిస్ధాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. “పాకిస్ధాన్ వెనక్కి వెళ్లడం లేదు” అని విదేశాంగ శాఖ ప్రతినిధి తెహ్‌మినా జాంజువా తెలిపింది. దేశీయ వ్యాపార వర్గాల ఒత్తిడికి తలొగ్గి ఇండియాకు ఎం.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వడానికి పాకిస్ధాన్ వెనక్కి తగ్గిందని భారత్ సీనియర్ అధికారి చెప్పిన అనంతరం, పాక్ ప్రతినిధి ఈ ప్రకటన జారీ చేసింది. “ఇండియాకు ఎం.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వడంలో ముందుకు వెళ్ళడానికి పాక్ కేబినెట్ సూత్రబద్ధ ఆమోదం తెలిపిందని పాకిస్ధాన్ స్పష్టంగా తెలిపింది” అని ఆమె తెలిపింది.
