ఆర్ధిక సంక్షోభం దెబ్బకు కుప్పకూలనున్న గ్రీసు ప్రభుత్వం


గ్రీసు ప్రభుత్వం అంతిమ క్షణాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ సంస్ధ ఇవ్వ జూపిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్, దానితో పాటే వచ్చే కఠినమైన షరతులను గ్రీసు ప్రజల ఆమోదానికి పెట్టడానికై రిఫరెండం నిర్వహిస్తామని గ్రీసు ప్రధాని గత సోమవారం ప్రకటించినప్పటినుండీ అక్కడి పరిణామాలు వేగవంతం అయ్యాయి.

ఆశ్చర్యం ఏమిటంటే యూరప్ పెద్ద తలకాయలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల ప్రభుత్వాధిపతులు ఇద్దరూ రిఫరెండం ఆలోచనను సమర్ధించారు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పైనే కాకుండా గ్రీసు యూరో జోన్ లో కొనసాగాలా లేదా అన్న అంశం పైన కూడా రిఫరెండం నిర్వహించాలని జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ లు కలిసి గ్రీసు ప్రధాని జార్జి పపాండ్రూను ఒప్పించారు. జార్జి పపాండ్రూ రిఫరెండం ఆలోచనను గ్రీసు ఆర్ధిక మంత్రి వ్యతిరేకిస్తున్నాడు.

నిజానికి గ్రీసు ఆర్ధిక మంత్రి ఎవాంజిలోస్ వెనిజెలోస్ ప్రారంభంలో రిఫరెండం ఆలోచనను సమర్ధించాడు. ఆ తర్వాత పపాండ్రూ, వెనిజెలోస్ ఇద్దరూ బుధవారం ఫ్రాన్సు లోని కేన్స్ నగరంలో ఏంజెలా మెర్కెల్, నికొలస్ సర్కోజిలతో సమావేశమయ్యాక వెనిజెలోస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు మరికొద్ది రోజుల్లో గ్రీసు కు బెయిలౌట్ ప్యాకేజికి సంబంధించిన 8 బిలియన్ యూరోల ప్యాకేజి ఇవ్వవలసి ఉంది. దానికి ముందే రిఫరెండం జరిపి గ్రీసు యూరో జోన్ లో ఉండాలనుకుంటున్నదీ లేనిదీ తేల్చాలని జర్మనీ, ఫ్రాన్సు లు పపాండ్రూను కోరాయి. అలా చేసినట్లయితే ఇ.యు ఇవ్వవలసిన 8 బిలియన్ యూరోల వాయిదా గ్రీసు చేతికి రాదు. రిఫరెండం జరపకుండా ఒక్క సెంటు కూడా ఇచ్చేది లేదని ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్సులు తేల్చి చెప్పేశాయి.

ఈ నేపధ్యంలో అధికార సోషలిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులలో ఒకరు జార్జి పపాండ్రూకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రిఫరెండంకు పిలుపిచ్చాక సోషలిస్టు పార్టీ సభ్యులొకరు జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపివ్వగా, మరొకరు పపాండ్రూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జరగనున్న విశ్వాస పరీక్షలో పపాండ్రూకు మద్దతివ్వనని మరొక సభ్యురాలు ప్రకటించడంతో 300 సబ్యులుగల పార్లమెంటులో అధికార పార్టీ బలం 151 సభ్యులకు తగ్గిపోయింది. శుక్రవారం నాటికి ఇది కూడా లేకపోతే గ్రీసు ప్రభుత్వం కుప్పకూలడం అనివార్యం.

గత రెండు సంవత్సరాలుగా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు పైన తీవ్రమైన ఆర్ధిక దాడి జరిపాయి. తమ బ్యాంకులు గ్రీసుకి ఇచ్చిన అప్పును వసూలు చేయడానికి బెయిలౌట్ అప్పులు ఇచ్చి దానికి విషమ షరతులను గ్రీసు ప్రజలపైన రుద్దాయి. ప్రభుత్వ రంగాన్ని కుదించివేసి ఉద్యోగాలను గణనీయంగా తగ్గించాయి. ఉద్యోగుల సదుపాయలు, పెన్షన్లు తగ్గించాయి. తమకు రావలసింది వచ్చాక గ్రీసును తనదారి తాను చూసుకొమ్మని చెప్పేస్తున్నాయి.

ఇప్పటికైనా గ్రీసు, ఇ.యు విష పరిష్వంగం నుండి బైటికి రావడమే ఉత్తమం. 2001 లో అర్జెంటీనా ప్రభుత్వం చేసినట్లుగా అప్పు చెల్లింపులపైన మారిటోరియం ప్రకటించి సొంత కరెన్సీని పునరుద్ధరించుకోవడం ఉత్తమం. ప్రభుత్వరంగాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఉగ్యోగావకాశాలు పెంచడం ద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచినట్లయితే ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి గాడిన పడతాయి. ప్రవేటీకరించిన కంపెనీలను తిరిగి జాతీయం చేయడం ద్వారా మరిన్ని ఉద్యోగావకాశాలను పెంచవచ్చు. ఈ విధానాలు కాకుండా మళ్ళీ మార్కెట్ సంస్కరణలను కొనసాగించినట్లయితే గ్రీసు ప్రజలు మరిన్ని కష్టాలను ఎదుర్కోవడం ఖాయం.

వ్యాఖ్యానించండి