వికీలీక్స్ అస్సాంజ్ ను స్వీడన్‌ అప్పగింతకు బ్రిటిష్ అప్పిల్ కోర్టు నిర్ణయం


Julian Assange and his lawyer Jennifer Robinson

తనను స్వీడన్ కు అప్పగించడానికి వ్యతిరేకంగా అప్పీలు కోర్టుకు నివేదించుకున్న జులియన్ అస్సాంజ్, అక్కడ అప్పీలును కోల్పోయాడు. స్వీడన్ పోలీసులకు జులియన్ ను అప్పగించడానికి అనుకూలంగా అప్పీలు కోర్టు తీర్పునివ్వడంతో జులియన్ అస్సాంజ్ అప్పగింత అనివార్యం అయ్యింది. అయితే హైకోర్టుకు వెళ్ళడానికి జులియన్ కు ఇంకా అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదీ లేనిదీ హై కోర్టులోనే తేలనున్నది.

వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ గత సంవత్సరం డిసెంబరు నెలలో బ్రిటన్ లో అరెస్టు అయ్యాడు. ఇద్దరు మహిళలపై లైంగిక అత్యాచారం చేశాడన్న ఆరోపణను జులియన్ స్వీడన్ లో ఎదుర్కొంటున్నాడు. ఆరోపణలపై విచారించడానికి జులియన్ అస్సాంజ్ స్వీడన్ రావాలని అక్కడి పోలీసులు కోరుతున్నారు. యూరోపియన్ యూనియన్ చట్టాల ప్రకారం సభ్య దేశాల మధ్య ఇలాంటి అప్పగింతలు జరగడానికి అవకాశం ఉంది. స్వీడన్ కు వెళ్ళాక అక్కడి ప్రభుత్వం తనను అమెరికాకి అప్పగిస్తుందనీ, అమెరికా రహస్యాలు లీక్ అయ్యాయన్న ఆరోపణతో తనను అమెరికా జైళ్లలోనే సుదీర్ఘ కాలం పాటు ఉంచడానికి రాజకీయ కుట్ర జరుగుతున్నదని జులియన్ ఆరోపిస్తున్నాడు.

అయితే, జులియన్ అస్సాంజ్ పైన స్వీడన్ పోలీసులు ఇంకా ఎటువంటి కేసులు పెట్టలేదు. ప్రశ్నించడానికి మాత్రమే స్వీడన్ రావాలని కోరుతున్నారు. ప్రశ్నించడానికే అయితే తనను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రశ్నించవచ్చనీ, స్వీడన్ లో ఉండగా తనను ప్రశ్నించమని పోలీసులను కోరినప్పటికీ అవసరం లేదని చెప్పినవారు బ్రిటన్ వచ్చాక తమకు అప్పగించాలని కోరడం ఏమిటని జులియన్ అస్సాంజ్ వాదిస్తున్నాడు. అమెరికాలో ఉన్న అతని శ్రేయోభిలాషులతో పాటు ప్రపంచ వ్యాపితంగా ఉన్న జులియన్ అభిమానులు అతనిని అమెరికా వెళ్ళవద్దని అనేకసార్లు సలహా ఇచ్చారు. స్వీడన్ పోలీసుల ప్రయత్నాల అనంతరం స్వీడన్ కూడా వెళ్లవద్దనీ, స్వీడన్ ప్రభుత్వం అమెరికాకి అప్పగించవచ్చనీ వారు హెచ్చరించారు.

స్వీడన్ సందర్శనకు వెళ్ళినపుడు జులియన్ ఒక మహిళను రేప్ చేశాడనీ, మరొక మహిళను బలవంతపెట్టాడనీ ఇరువురు మహిళలు పోలీసులకు రిపోర్టు చేసారు. మొదట అస్సాంజ్ పైన అసలు కేసు పెట్టే అవకాశమే లేదని జిల్లా ప్రాసిక్యూటర్ తేల్చివేసి కేసు ప్రోసిడింగ్స్ ను రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత మరొక నగరానికి చెందిన ప్రాసిక్యూటర్ జులియన్ అస్సాంజ్ ను ప్రశ్నించడానికి అదేశాలు జారీ చేశాడు. అప్పటికే జులియన్ స్వీడన్ నుండి బ్రిటన్ కు వచ్చేశాడు.  రాజకియ కారణాలతోటి మహిళలపైన ఒత్తిడి తెచ్చి కేసు దాఖలు చేయించారని జులియన్ తో పాటు అనేకమంది పౌరహక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. స్వీడన్ ప్రయత్నాల వెనుక అమెరికా ఒత్తిడి ఉన్నదని అత్యధికులు భావిస్తున్నారు.

గత సంవత్సరం నవంబరు చివరినుండి అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ ను వరుసగా ప్రచురించడం వికీలీక్స్ సంస్ధ ప్రారంభించింది. ప్రచురణ ప్రారంభమైన వారం రోజులకే బ్రిటన్ పోలీసులు జులియన్ ను అరెస్టు చేశారు. కఠిన బెయిల్ షరతులను విధించి, హౌస్ అరెస్టు విధిస్తూ బ్రిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పీలు కోర్టు తీర్పు వెలువరించేవరకూ షరతులు పాటించాలని తీర్పునిచ్చింది. అప్పీలు తీర్పు ఇచ్చేసింది కనుక తదుపరి హైకోర్టుకు వెళ్ళాలని జులియన్ లాయర్లు నిర్ణయించారు. హైకోర్టులో సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చా లేదా అన్నది తేలుతుంది.

తనకు నచ్చని దేశాలపైన, దేశాల ప్రభుత్వాధిపతులపైన బాంబులు వేసి చంపిన దుష్ట చరిత్ర అమెరికా సొంతం. తన వ్యూహత్మక ప్రయోజనాల కోసం రెండు దురాక్రమణ యుద్ధాలను సాగిస్తున్న అమెరికా, ప్రపంచ దేశాలలో తన రహస్య గూఢచార కార్యకలాపాలను బైట పెట్టడంలో చురుకుగా వ్యవహరిస్తున్న జులియన్ అస్సాంజ్ పైన అమెరికా ఎటువంటి కుట్రలకైనా పాల్పడగల నైతిక పతనావస్ధలో ఉంది. జులియన్ లాంటి కార్యకర్తలను కాపాడుకోవలసిన అగత్యం, అమెరికా దుర్మర్గాలకు బలవుతున్న ప్రపంచ ప్రజానీకంపైన ఉన్నది.

4 thoughts on “వికీలీక్స్ అస్సాంజ్ ను స్వీడన్‌ అప్పగింతకు బ్రిటిష్ అప్పిల్ కోర్టు నిర్ణయం

  1. అసాంజ్ గొప్ప ధైర్య వంతుడా? తెలివి తక్కువోడా?

    అమెరికాని సరీగ్గా అంచనా వెయ్య లేకపొయ్యాడా?

    వ్యక్తిగతంగా చాలా నష్టపోతాడు.

    ఇతని రాజకీయాలు నాకు అర్ధం కావట్లేదు.

  2. అస్సాంజ్ కి రాజకీయాలేవీ లేవు కనుక మనం అర్ధం చేసుకోవడానికి కూడా ఏమీ లేదు.
    అతని భావాలు ప్రధానంగా స్వేచ్ఛా జర్నలిజానికి సంబంధించినవి. సమాచారం అందరికీ స్వేచ్ఛగా అందుబాటులోకి వస్తే ప్రజలు తమకు కావలసిందేదో తామే నిర్ణయించుకుంటారు అన్న మోటివ్ తో పని చేస్తున్నాడు.
    తెలివితక్కువోడు అనడం సరైంది కాదు. అతను ఇస్తున్న ఇంటర్వ్యూలలో అది స్పష్టంగా అర్ధం అవుతోంది. ది హిందూ అతనితో ఇంటర్వ్యూ ప్రచురించింది.
    అతను ఏం చేస్తున్నాడో అతనికి స్పష్టంగానే తెలుసు. అమెరికా అకృత్యాలను వెల్లడించడంలో రాజీ పడడం లేదు. కనుక నిస్సందేహంగా ధైర్యవంతుడే.
    పైగా కేబుల్స్ లీక్ చేసిన అమెరికా ఇంటలిజెన్స్ ఎనలిస్టు బ్రాడ్లీ మేనింగ్ తరపున డిఫెన్స్ కోసం నిధులు సమకూరుస్తూ అతని తరపున వాదించడానికి లాయర్లను కుదిర్చాడు. అటువంటిది అతను ధైర్యవంతుడేనా అన్న అనుమానం అనవసరం.
    అదీకాక అతను చేస్తున్న పని నేపధ్యంలో ఆ అనుమానం రిలెవెంట్ కూడా కాదు.
    వ్యక్తిగతంగా లాభపడదామని అస్సాంజ్ తాను చేస్తున్నది చేయడం లేదు. పర్యవసానాలు అతనికి తెలుసు.
    వ్యక్తిగత లాభాలు చూసుకునేవారు అస్సాంజ్ ఎన్నుకున్న జీవితాన్ని ఎన్నుకోగలరా?
    అమెరికాపైన అతని అంచనాలు ఎప్పుడూ తక్కువగా లేవు. అమెరికానుండి ఎదురుకాగల నిర్భంధంపై అతనికి ఐడియా ఉన్నట్లుగా అతని ఆర్టికల్స్ చెబుతున్నాయి.

  3. శేఖర్ గారు..
    నాకో ఆనుమానం.
    ఒక వ్యక్తిగా మీరు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నారా?
    లేక నలురైదుగురు కలిసి ఒకే పేరుతో రాస్తున్నారా?
    తెలుగు బ్లాగర్లలో మీకున్నంత సహనం, ఓపిక, విషయ పరిజ్ఞానం, వివరాణాత్మక చర్చా స్పూర్థి ఇంకెవరికీ లేవు.
    ఇన్ని పోస్టులు ఎలా రాయగలుగుతున్నారు!

  4. లేదు రమణ గారూ, ఒక్కడ్నే రాస్తున్నాను.
    నిజానికి మీరు ప్రస్తావించిన సుగుణాలు నాకు పూర్తిగా, లేకుంటే అవసరం అయిన మేరకైనా, లేవని నా అవగాహాన.
    ఆ గుణాలు పొందడానికి నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను.
    కొన్ని అంశాల్లో కొద్దిగా అయినా సఫలం అవుతున్నప్పటికీ చాలా అంశాల్లో విఫలం అవుతూనే ఉన్నాను.
    కనుక నా గురించి మీ పరిశీలన పూర్తి వాస్తవం కాకపోవచ్చు.
    ఊహ తెలిసినప్పటినుండి చదువుతూనే ఉన్నాను. ఆ అలవాటు, విషయాలను తెలుసుకోవడంలో సహాయపడింది.

వ్యాఖ్యానించండి