2010 సం.లో ఇండియాలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు


పిల్లలపై అత్యాచారాలు జరపడంలో భారత దేశం పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2010 సంవత్సరంలోనే భారత దేశంలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1408 మంది పిల్లలను చంపేశారని కూడా ఆ నివేదిక పేర్కొంది.

అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటా కలుపుకుని మొత్తం 10,670 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమో, ఎత్తుకెళ్లడమో చేశారని ఎన్.సి.ఆర్.బి తెలిపింది. ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే గత సంవత్సరం 315 మంది పిల్లలను హత్య చేయగా, మధ్య ప్రదేశ్ లో 1182 మందిపైన అత్యాచారాలు జరిగినట్లుగా రికార్డయ్యిందని జాతీయ ప్రభుత్వ సంస్ధ తెలిపింది. పిల్లలను హత్య చేయడంలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్ధానం పొందగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం పిల్లలపై లైంగిక అత్యాచారాల విషయంలో అగ్ర స్ధానం పొందిందని తెలిపింది.

మహారాష్ట్రలో 211 మంది పిల్లలు హత్యకు గురికాగా, బీహార్ లో 200 మంది పిల్లలూ, మధ్య ప్రదేశ్ లో 124 మంది పిల్లలూ హత్యకు గురయ్యారు. అలాగే మహారాష్ట్రలో 747 మంది పిల్లలపై లైంగిక దాడులు జరగగా, ఉత్తర ప్రదేశ్ లో 451 మందీ, ఆంధ్ర ప్రదేశ్ లో 446 మందీ పిల్లలు అత్యాచారాలకు గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో 29 మంది పిల్లలు హత్యకు గురి కాగా, 304 మంది పిల్లలపైన లైంగిక అత్యాచారాలు జరిగాయని బ్యూరో పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీ, పిల్లలను కిడ్నాప్ చేయడంలో అగ్ర స్ధానం సంపాదించుకుంది. గత సంవత్సరం రాజధానిలో 2,982 మంది కిడ్నాప్ కు గురికాగా, ఆ తర్వాత స్ధానాలను బీహార్ (1,359), ఉత్తర ప్రదేశ్ (1,225), మహారాష్ట్ర (749), రాజస్ధాన్ (706), ఆంధ్రప్రదేశ్ (581), గుజరాత్ (565) లు ఆక్రమించాయి.

నిజానికి పిల్లలపై జరుగుతున్న ఈ అత్యాచారాలు పత్రికలు రిపోర్టు చేసిన దాఖలాలు లేకపోవడం గమనించదగ్గ విషయం. ధనికుల పిల్లలు కిడ్నాప్ కు గురయినపుడో, లేదా హత్యకు గురైనపుడో పత్రికలు పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించినప్పటికీ ఇతరుల పిల్లల విషయంలో అంత ఆసక్తి కనపరచకపోవడం నిష్టుర సత్యం.

ఆంధ్ర ప్రదేశ్ లో గత ఒక్క సంవత్సరంలోనే 581 మంది పిల్లలు కిడ్నాప్ కు గురయ్యాయని బ్యూరో వెల్లడించింది. అంటే దాదాపు ప్రతి రోజూ ఒక్కరి కంటే ఎక్కువ మందే కిడ్నాప్ నేరాలు జరిగాయని తెలుస్తోంది. కాని ఈ స్ధాయిలో పత్రికలు కిడ్నాప్ నేరాల గురించి నివేదించలేదు. బాలలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించయితే కనీసం ఒక్క కేసయినా నివేదించినట్లుగా దాఖలాలు లేవు. పిల్లలపై జరుగుతున్న నేరాల గురించి పత్రికలు ఎందుకని నివేదించలేకపోతున్నాయి?

వ్యాఖ్యానించండి