ముంబై దాడులపై ప్రణబ్ ముఖర్జీ మాటలకు బెంబేలెత్తిన పాకిస్ధాన్ -రైస్ ఆత్మకధ


26/11 దాడులు గా పేరు పొందిన ముంబై టెర్రరిస్టు దాడుల అనంతరం అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కటువుగా చేసిన వ్యాఖ్యలతో పాకిస్దాన్ బెంబేలు చెందినట్లుగా అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొండొలిజా రైస్ తన ఆత్మకధలొ పేర్కొంది. “మేము యుద్ధానికి దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు” అని ప్రణబ్ ముఖర్జీ ఫోన్ లో మాట్లాడుతూ అనడంతో పాకిస్ధాన్ తీవ్ర స్ధాయిలో అప్రమత్తమయ్యిందని ఆమె పేర్కొన్నది. చైనా నుండి అమెరికా వరకూ అన్ని దేశాలకూ ‘ఇండియా పాకిస్ధాన్‌పై యుద్ధానికి దిగనున్నదంటూ’ సమాచారం అందించి అప్రమత్తం చేసిందనీ, పాకిస్ధాన్ నుండి తనకు అందిన సమాచారంతో తాను కూడా తాత్కాలికంగా నిర్ఘాంతపోయాయనీ రైస్ తన ఆత్మకధలో తెలిపింది.

పాక్ నుండి సమాచారం అందాక కొండోలిజా రైస్ ఇండియాకు ఫోన్ చేసి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తో మాట్లాడడానికి ప్రయత్నించింది. కాని ప్రణబ్ ముఖర్జీ చాలా సేపటివరకూ లైన్లోకి రాకపోవడంతో రైస్ కూడా యుద్ధ వార్తలు నిజమేనేమో అన్న అనుమానానికి గురయ్యింది. పదే పదే ప్రయత్నించినా ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడడం రైస్ కు సాధ్యం కాలేదు. పాకిస్ధాన్ పై యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నందునే ప్రణబ్ ముఖర్జీ ఫోన్ లైన్ లోకి రావడం లేదని రైస్‌కి అనుమానం రావడంతో ఆమె కూడా కొద్ది సేపు అసహనానికి గురయ్యింది.

“పాకిస్ధాన్ పై యుద్ధం చేయడానికి ఇండియా నిశ్చయించుకున్నట్లుగా హెచ్చరిక పంపారని పాకిస్ధానీయులు చెబుతున్నారు” అని వైట్ హౌస్ లో ఉండే సహాయకుడు రైస్ గా ఆందోళనగా ఫోన్ చేయడంతో కలకలం ప్రారంభమయ్యింది. పాకిస్ధాన్ నుండి యుద్ధ వార్తలు వస్తుండడంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, తన విదేశాంగ మంత్రి కొండోలిజా రైస్ ను వెంటనే పాకిస్ధాన్, ఇండియాలకు వెళ్ళి శాంతింపజేయాల్సిందిగా ఆదేశించాడని తన తాజా పుస్తకం ‘నో హై ఆనర్స్’ లో రైస్ రాసింది. వైట్ హౌస్ సహాయకుడు చెప్పిన వార్తతో రైస్ “ఏమిటీ?!” అంటూ మ్రాన్పడిపోయానని రైస్ తెలిపింది. “కాని వాళ్ళు (ఇండియా) నాకు చెబుతున్నది అది కాదు. గత రెండు రోజులుగా ఇండియన్లతో నేను చాలా సార్లు మాట్లాడాను. పరిస్ధితిని చల్లబరచాలన్న కోరికను వారు గట్టిగా చెప్పారు. అందుకోసం దాడులకు బాధ్యతను స్వీకరిస్తూ టెర్రరిస్టులను పట్టుకోవడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లుగా పాకిస్ధాన్ ఏదో ఒకటి చేయాలని వారు కోరారు” అని రైస్ రాసింది.

వైట్ హౌస్ ఫోన్ అందుకున్నాక రైస్ ఆపరేషన్స్ సెంటర్ కు ఫోన్ చేసి ప్రణబ్ ముఖర్జీ కి లైన్ కలపాల్సిందిగా కోరింది. కాని వారికి ఎంతకీ ప్రణబ్ దొరకలేదు. దానితో రైస్ లో అసహనం పెరగడం ప్రారంభమయ్యింది. ఇండియా యుద్ధానికి సిద్ధపడినందువల్లనె ప్రణబ్ తన ఫోన్ కి దొరక్కుండా తప్పించుకుంటున్నాడని రైస్ కి అనుమానం తీవ్రమయ్యింది. “నేను మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ స్పందన లేదు. అప్పటికె ఇంటర్నేషనల్ ఫోన్ లైన్లన్నీ పాకిస్ధాన్ పై ఇండియా యుద్ధం చేయబోతున్నదన్న వార్తలతో బిజీగా మారిపోయాయి. పాకిస్ధానీయులు అందరినీ పిలవడం ప్రారంభించారు. సౌదీలు, ఎమిరటిస్, చైనీస్… ఇలా అందర్నీ. చివరికి ప్రణబ్ ముఖర్జీయే నాకు ఫోన్ చేశాడు. నేను విన్న విషయాన్ని ఆయనకి తెలియజేశాను” అని రైస్ పేర్కొంది.

“ఏమిటీ? నేను నా నియోజకవర్గంలో ఉన్నాను (ఇండియా అప్పడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రణబ్ ముఖర్జీ తన నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నాడు.) మేము యుద్ధానికి దిగేపనైతే నేను న్యూఢిల్లీ బైట ఉండడానికి సాధ్యమవుతుందా” అని ముఖర్జీ ప్రశ్నించాడని ఆమె తెలిపింది. తాను పాకిస్ధాన్ విదేశాంగ మంత్రితో కటువుగా మాట్లాడిన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నాడని ముఖర్జీ తనతో అన్నాడని తెలిపింది. “యుద్ధానికి వెళ్ళడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారని పాక్ విదేశాంగ మంత్రితో అన్నాను” అని ముఖర్జీ అన్నాడని ఆమె తెలిపింది. ముంబై దాడుల అనంతరం రైస్ ఇండియా సందర్శించింది. ప్రధాని మన్మోహన్, విదేశాంగ మంత్రి ఇరువురూ తాము యుద్ధానికి వ్యతిరేకులం అని స్పష్టంగా తెలిపారు. ప్రజలనుండి ఒత్తిడి పెరుగుతున్నందున పాకిస్ధాన్ ఏదో ఒకటి చేయాలని వారు రైస్ తో చెప్పారు.

రైస్ పాకిస్ధాన్ వచ్చేటప్పటికి ముంబై దాడులతో తమకు సంబంధం లేదనే ఇంకా చెబుతున్నారు. దాడులు చేసినవారు పాకిస్ధానీయులే అని ప్రపంచం అంతా భావిస్తుండగా ఆ విషయాన్ని పాకిస్ధాన్ నిరాకరిస్తోంది. “పాకిస్ధాన్ ఒక్కసారిగా భయభ్రాంతమయ్యింది. అదే ధోరణిలో దాడుల్లో పాకిస్ధానీయులు పాల్గొన్నవారన్న ఇండియా ఆరోపణలను తిరస్కరించింది. యుద్ధం జరగకూడదని పాక్ అధ్యక్షుడు జర్దారీ అన్నప్పటికీ ముంబై దాడుల్లో పాక్ పాత్ర ఉందన్న నిజాన్ని అంగీకరించడానికి సిద్ధపడలేదు” అని రైస్ రాసింది. పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పెద్ద ఉపన్యాసమే చెప్పాడనీ, ముంబై దాడులతో పాక్ కు సంబంధం లేదని చెప్పాడనీ ఆమె రాసింది.

“మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరైనా నాకు అబద్ధం చెబుతుండాలి లేదా మీ మనుషులైనా మీతో అబద్ధం చెబుతుండాలి అని గిలానితో అన్నాను. తర్వాత దాడులు ఎక్కడ ప్రారంభం అయ్యాయో అమెరికాకి తెలుసు అని కూడా చెప్పాను” అని రైస్ రాసింది. “పాకిస్ధాన్ ప్రభుత్వం దాడుల్లో పాల్గొన్నదని నేను ఆరోపించలేదు. అక్కడ పాయింట్ అది కాదు. భద్రతా బలగాలలో రోగ్ వ్యక్తులు కొందరు టెర్రరిస్టులకు సాయం చేసి ఉండవచ్చు. ఆ విషయాన్ని పాక్ ప్రభుత్వం అంగీకరించాల్సిన సమయం అది. విషయాన్ని తీవ్రంగా తీసుకుని విచారణ చేయాల్సి ఉంది” అని రైస్ పేర్కొన్నది.

“అంతిమంగా పాకిస్ధాన్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అస్ఫాక్ పెర్వేజ్ కయాని ని కలవడానికి వెళ్ళాను. మా మిలట్రీకి అతనంటే సానుకూల దృక్పధం ఉంది. నిజాయితీగల వ్యక్తి అని ప్రభావశీలి అనీ అతని గురించి భావిస్తుంది. పాకిస్ధాన్ బాధ్యత ఉందని ఆయన అంగీకరించనప్పటికీ అసలేం జరిగిందన్నది ఒక వివరణ ఇవ్వవలసిన అవసరం పాక్ పైన ఉన్నదని ఆయన అంగీకరించాడు. అది ప్రారంభం” అని రైస్ రాసింది. పాక్, ఇండియాలలో ఉన్న అమెరికా రాయబారులు కూడా యుద్ధ వార్తల గురించి ఆందోళనగా ఫోన్ చేశి మాట్లాడారని రైస్ తెలిపింది. భారత అమెరికా రాయబారి డేవిడ్ మల్ఫోర్డ్ స్పష్టంగా చెప్పాడనీ, యుద్ధ జ్వరం వ్యాపించి ఉందనీ భారత్ ప్రధాని ఆపగలడో లేదో తనకు తెలియదనీ, పాకిస్ధాన్ నుండే టెర్రరిస్టులు వచ్చారని అందరికీ తెలిసిపోయిందనీ డేవిడ్ రాసినట్లుగా రైస్ తెలిపింది. పాకిస్ధాన్ పాలకులు ఇసుకలో తల దూర్చారని పాక్ అమెరికా రాయబారి అన్నే ప్యాటర్సన్ వ్యాఖ్యానించింది.

వ్యాఖ్యానించండి