మూడో క్వార్టర్‌లో ఫర్వాలేదనిపించిన అమెరికా ఆర్ధిక వృద్ధి


మూడో క్వార్టర్ లో అమెరికా ఆర్ధిక వృద్ధి ఫర్వాలేదనిపించింది. గత రెండు క్వార్టర్లలో మాదిరిగానే అమెరికా జిడిపి వృద్ధి దాదాపు ఆగిపోయినట్లుగానె అందరూ భావిస్తున్న నేపధ్యంలో 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే సామాన్య జనం ఊపిరిలు ఆగిపోవడం కొనసాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అమెరికా వాణిజ్య విభాగం గురువారం చేసిన ప్రకటనలో మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) జిడిపి వృద్ధి వివరాలు తెలిపింది. వార్షిక వృద్ధి రేటు 2.5 శాతం అంటే, మూడవ క్వార్టర్ లో నమోదు చేసిన వృద్ధి రేటు వాస్తవానికి 0.625 శాతం అని అర్ధం. వార్షిక రేటు గా మార్చడం ద్వారా అంకెలు పెద్దవిగా చేసుకుని సంతృప్తి పడడం ఒక విధానంగా స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు గల దేశాలు ఆచరిస్తుంటాయి.

అమెరికా, మొదటి క్వార్టర్లో వార్షిక జిడిపి వృద్ధి రేటును 0.4 శాతమే నమోదు చేసింది. అంటె క్వార్టర్లో 0.1 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదు చేసింది. ఇంత తక్కువ వృద్ధి రేటును దాదాపు వృద్ధి రేటు సున్నగానే పేర్కొనవచ్చు. అంటె మొదటి క్వార్టర్లో అమెరికా ఆర్ధిక వ్యవస్దలో వృద్ధి అనేదే జరగలేదన్నమాట. రెండో క్వార్టర్లో అమెరికా జిడిపి వృద్ధి రేటు వార్షికంగా 1.3 శాతం కాగా, క్వార్టర్ లో 0.325 శాతం గా నమోదయ్యింది.

రెండో క్వార్టర్లో సైతం అత్యంత నెమ్మదైన వృద్ధి రేటును అమెరికా నమోదు చేయడంతో ప్రపంచవ్యాపితంగా మళ్ళీ ఆర్ధిక మాంద్యం వస్తుందన్న భయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా వృద్ధి రేటు మందగమనం అంటె అమెరికాలో వస్తువులు సేవలకు గిరాకి తగ్గిందన్నమాట. అమెరికాకి ఎగుమతులు చేయడంపైన గణనీయంగా ఆధారపడి ఉన్న ఆర్ధిక వ్యవస్ధలు కలిగిన ఎమర్జింగ్ ఎకానమీ దేశాలు ఈ దెబ్బతో తమ వృద్ధి రేటు కూడా పడిపోవడాన్ని చూడక తప్పలేదు.

అమెరికా ఆర్ధికవృద్ధి మందగమనంతో పాటు యూరప్ రుణ సంక్షోభం తోడు కావడంతో చైనా, అమెరికాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేసే చైనా, బ్రెజిల్, ఇండియా లాంటి దేశాల్లో జిడిపి వృద్ధి రేట్లు పడిపోయాయి. పడిపోయినప్పటికీ చైనా వృద్ధి రేటు సెప్టెంబరు క్వార్టర్ కు గాను 9.1 శాతం వృద్ధి నమోదు చేయగలిగింది. ఇండియా వృద్ధి రేటు తన రెండవ క్వార్టర్ (సెప్టెంబరు తొ అంతమయ్యే మూడు నెలల క్వార్టర్) లో 7.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది.

మూడో క్వార్టర్ లో వార్షిక వృద్ధి రేటు 2.5 శాతం వృద్ధి రేటును అమెరికా నమోదు చేసి ఉండవచ్చని అంచనా వాణిజ్య విభాగం అంచనా వేయడంతో ప్రపంచవ్యాపితంగా మార్కేట్లు కొంత ఊపు సంపాదించుకున్నాయి. అమెరికాకి ఈ వృద్ధి రేటు కొనసాగుతుందని ఎవరూ పెద్దగా నమ్మకం పెట్టుకోవడం లేదు. మూడో క్వార్టర్లో కూడా అతి తక్కువ వృద్ధి రేటు నమొదైతే అమెరికా ఫెడరల్ రిజర్వు మళ్ళీ మార్కేట్లలో డబ్బు కుమ్మరించే చర్యలు తీసుకోవచ్చని భావించారు. అది ఇప్పటికి తప్పినా పూర్తిగా కొట్టిపారవేయలేం.

అమెరికా మార్కేట్లలో డబ్బు కుమ్మరిస్తే (ట్రెజరీ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా ట్రెజరీకి డబ్బు సమకూర్చడం) అది చైనా, ఇండియా లకు ద్రవ్యోల్బణం గా ప్రతిఫలిస్తుంది. ఆ దేశాల్లో ధరలు ఇంకా పెరుగుతాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో కుమ్మరించిన సొమ్ము చైనా, ఇండియా లాంటి ఎమర్జింగ్ దేశాల స్టాక్ మార్కేట్లలోకి పెట్టుబడులుగా రావడమే దానికి కారణం. గ్లోబలైజేషన్ విధానాల ఫలితంగా అమెరికా, యూరప్ దేశాలకు జలుపు చేస్తే ఇండియా ఆర్ధిక వ్యవస్ధ తుమ్మక తప్పదు మరి. పూర్తిగా మార్కెట్ ఎకానమీగా ఇండియా మారాక తుమ్ముతో సరిపెట్టడానికి వీలు లేదు. అప్పుడిక వైరల్ జ్వరాలు, విష జ్వరాలు రావడం తధ్యం

వ్యాఖ్యానించండి