భారత్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్లు, ప్రతీకారమే కారణం


పాకిస్ధాన్ కి చెందిన హ్యాకర్లు భారత ప్రభుత్వానికి చెందిన కొన్ని కంపెనీలు, విభాగాల వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు. భారత హ్యాకర్లు పాకిస్ధాన్ ప్రభుత్వ కంప్యూటర్లను పలుమార్లు హ్యాకింగ్ చేస్తున్నాయనీ, అందుకే తాము భారత ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ చేస్తున్నామని  వారు ప్రకటించారు.

దాదాపు ఎనిమిది ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకింగ్ కి గురయినట్లుగా తెలుస్తోంది. హ్యాకింగ్ చేసిన వెబ్ సైట్లలో అభ్యంతరకరమైన వార్తలు ప్రచురించారని ‘ది హిందూ’ తెలిపింది. పాకిస్ధాన్ హ్యాకర్ తననుతాను ‘khantastic haXOr’ అభివర్ణించుకున్నట్లు zone-h.org వెబ్ సైట్ తెలిపింది.

బి.ఎస్.ఎన్.ఎల్ కంపెనీకి చెందిన వెబ్ సైట్ లో ఐదు పేజీల స్వరూపాన్ని మార్చేశారని తెలుస్తోంది. కోల్ కతా లోని మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంటు కి చెందిన వెబ్ సైట్ పైన కూడా పాక్ హ్యాకర్లు దాడి చేసి పేజీ స్వరూపాన్ని మార్చేశారు. అలాగే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చెన్నై మెట్రో రైల్ కి చెందిన ఒక పేజీ స్వరూపాలను హ్యకర్ మార్చేశాసాడు.

తాము హ్యాక్ చేసిన వెబ్ సైట్ల డేటా బేస్ మొత్తాన్ని తొలగించినట్లుగా హ్యాకర్ ఆయా వెబ్ సైట్లలోనే మెసేజ్ లు ఉంచడం ద్వారా తెలియజేశాడు. కాపీ కూడా చేసుకున్నాని తెలిపాదు. గురువారం సాయంత్రానికల్లా అసలు పేజీకి బదులు హ్యాకింగ్ కి గురయిన వెబ్ పేజీలు దర్శనమిచ్చాయని ఆయా కంపెనీల ఉద్యోగులు తెలిపారు. మరికొన్ని పేజీలలో 404 మెసేజ్ దర్శనమిచ్చింది.

ఈ వ్యవహారంలో ఇరు వైపులా ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదీ లేనిదీ వివరం వెలువడలేదు. ప్రభుత్వాల ఆదేశాలతోనే హ్యాకింగ్ జరిగిందా అన్నది వివరించలేదు. ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికీ వారికి పరోక్షంగా ప్రభుత్వాల పాత్ర లేదని ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేదు. మూడు యుద్ధాలు చేసుకున్న దాయాదులు కంప్యూటర్ రంగంలో కూడా తమ యుద్ధాన్ని విస్తరించున్నాయని భావిమ్చవచ్చు.

వ్యాఖ్యానించండి