ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఫ్రాన్సు సైనికుల ఉపసంహరణ


ఫ్రాన్సు సైనికులలో మొదటి బ్యాచ్ ఆఫ్ఘనిస్ధాన్ నుండి స్వదేశం చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ సైనికుల విరమణ జరుగుతుంది. మొదటి విడతగా 200 మంది సైనికుల్ని వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ఫ్రాన్సు ప్రకటించింది. గత జులైలో ఆఫ్గనిస్ధాన్ సందర్శించిన సందర్భంగా తమ సైనికులను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి ప్రకటించాడు. అది ఇప్పుడు ప్రారంభమయ్యింది.

రెండవ విడతలో మరో 200 మంది సైనికులను విరమిస్తామని ఫ్రాన్సు తెలిపింది. రాబోయే క్రిస్టమస్ పండగలోపు రెండవ విడత సైనికులు ఫ్రాన్సు చేరుకుంటారని ఫ్రాన్సు ప్రభుత్వం తెలిపింది. 2014 సంవత్సరం లోపుగా “సాయుధ ఘర్షణలలో పాల్గొనడనికి ఉద్దేశించిన” సైనికులను ఉపసంహరించడానికి నాటో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఉపసంహరణ జరుగుతోంది.

ఫ్రాన్సు 4000 మంది సైనికులను ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణకు పంపింది. 2001 నుండి ఇప్పటివరకూ 75 మంది ఫ్రాన్సు సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణలో మరణించారు. అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలయిన బ్రిటన్, కెనడా, బెల్జియం తదితర దేశాలు తమ సైనికులను ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి.

2012 లోపుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించుకుంటున్నట్లుగా అమెరికా ప్రకటించింది. అమెరికా, కెనడాలకు చెందిన సైనికులు కొంతమంది తమ బాధ్యతలను ఆఫ్ఘనిస్ధాన్ భద్రతా దళాలకు అప్పజెప్పి స్వదేశానికి వెళ్ళిపోయారు. సైనిక విరమణ ప్రకటించినప్పటినుండీ తాలిబాన్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్ధాన్ బలగాలు తమ భద్రతను తామే పర్యవేక్షించడానికి తగిన విధంగా తయారు ఉన్నారా లేరా అన్న విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తాలిబాన్ దాడులు ఆఫ్ఘన్ భద్రతా బలగాల సహాయంతోనే జరుగుతున్న నేపధ్యంలో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

ఫ్రాన్సు తన సైన్యాన్ని ప్రధానంగా సురోబి జిల్లాలోనూ, దాని పొరుగునే ఉన్న కాపిసా రాష్ట్రంలోనూ నియమించింది. “దామాషా ప్రాతిపదికన మా సైన్యాన్ని ఉపసంహరిస్తున్నాము. మా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆఫ్ఘన్ సైన్యానికి అప్పజెపుతాం” అని ఫ్రాన్స్ రక్షణ మంత్రి గెరార్డ్ లాంగెట్ ఫ్రాన్స్ రేడియోకు చెప్పినట్లుగా బిబిసి తెలిపింది. అమెరికా సైనికులను విరమిస్తున్న నిష్పత్తిలో తమ సైన్యాన్ని విరమిస్తున్నామని గెరార్డ్ చెబుతున్నాడు.

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఓటమి అంచున ఉంది. వరుసగా ఎదురవుతున్న దాడులను నాటో సైనికులు నివారించలేని పరిస్ధితిలో ఉన్నారు. మంచి తాలిబాన్ నాయకులతో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించినప్పటికీ ఇంతవరకూ ఆ విషయంలో ఒక్క అంగుళం కూడా కదల్లెకపోయింది. పైగా చర్చల పేరుతో వచ్చిన నాయకులు కొంతమంది డూప్లికేట్ నాయకులు కాగా మరికొంతమంది బాంబులతో వచ్చి కొందరు ముఖ్యమైన ఆఫ్ఘన్ నాయకులను చంపారు. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు, ప్రముఖ యుద్ధ ప్రభువు శాంతి చర్చల కమిటీ అధిపతి అలాగే చనిపోయారు.

ఇరాక్ నుండి పెద్ద ఎత్తున సైనికులను ఉపసంహరించుకున్నప్పటికీ అక్కడ ఇంకా అమెరికా సైనికుల ఉనికికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తూనే ఉంది. అక్కడ ఎన్నికలలో నెగ్గిన ప్రభుత్వం కూడా అమెరికా కంటే, అమెరికాకి బద్ధ వ్యతిరేకి అయిన ఇరాన్ కు దగ్గరగా ఉండడంతో ఇరాక్ సాధించామంటున్న గెలుపుకు అర్ధం లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్ధాన్ లో సైతం ఇంతకంటే ఘోరమైన పరిస్ధితి అమెరికాకి దాని మిత్రులకి ఎదురుకానున్నది. దురాక్రమణదారులకు వియత్నాం తర్వాత, ఆఫ్ఘనిస్ధాన్ మరొకసారి అంత గట్టి గుణపాఠం చెప్పనున్నది.

వ్యాఖ్యానించండి