సంక్షోభంలో ‘అన్నా బృందం’, ఇద్దరు సభ్యులు దూరం


అన్నా బృందం ఐక్యత సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన పరిణామాల పర్యవసానంగా బృందంలో ఇద్దరు ప్రముఖ సభ్యులు బృందం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బృందం బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పి.వి.రాజగోపాల్, ‘వాటర్ మేన్’ రాజీందర్ సింగ్ లి మంగళవారం కోర్ గ్రూపునుండి తప్పుకోవాలన్న తమ ఉద్దేశ్యాన్ని బహిరంగపరిచారు. అన్నా బృందం రాజకీయ లక్షణాలను సంతరించుకుంటున్నదని వీరు భావిస్తుండడంతో వీరీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్ సభ్యులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో తమవి కాని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి వస్తున్నదని కూడా వీరు భావిస్తున్నారు.

హర్యానాలోని హిసార్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న నిర్ణయం ఈ ఇద్దరు కార్యకర్తల తాజా నిర్ణయానికి ఒక కారణం. రాజగోపాల్ అన్నా బృందం నుండి బైటికి వెళ్లడానికి నిర్ణయం తీసుకోకుండా ఒత్తిడి వస్తున్నదని ఆయన తెలిపాడు. “బృందంతో విడిపోతున్నాను. బృందం రాజకీయంగా మారుతోంది. అందుకు హిసార్ ఉదంతంతో పాటు ఇతర సూచనలు కూడా ఉన్నాయి” అని రాజీందర్ సింగ్ తెలిపాడు. భూమి హక్కుల కోసం నిర్వహిస్తున్న అఖిలభారత యాత్రలో రాజగోపాల్ తలమునకలై ఉన్నాడు. బృందంనుండి బైటికి వస్తున్నట్లుగా కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. అన్నా బృందంలో సభ్యత్వం కావాలని తాను ఎన్నడూ కోరనందున బైటికి రావడానికి కూడా లేఖ అవసరం ఉంటుందని తాను భావించడం లేదని రాజీందర్ సింగ్ తెలిపాడు.

ప్రశాంత్ భూషణ్ విషయంలో అన్నా హజారే వ్యక్త పరిచిన అభిప్రాయాలు బృందం సభ్యులను పునరాలోచనలో పడవేసినట్లు భావిస్తున్నారు. కాశ్మీరులో ప్రజాభిప్రాయం సేకరించి వారు స్వతంత్ర దేశం కోరుకుంటే అందుకు అనుమాతించాలని ప్రశాంత్ భూషణ్ రెండు మూడు సార్లు చెప్పడంతో ఆయన అభిప్రాయం కరెక్టు కాదని అన్నా ప్రకటించాడు. భూషణ్ ఒకవైపు కాశ్మీరుపై అభిప్రాయం తన వ్యక్తిగతమైనదని చెబుతున్నప్పటికీ, భూషణ్ అభిప్రాయం అతని వ్యక్తిగతమైనదనీ, ఆయనను బృందంలో కొనసాగించేదీ లేనిదీ త్వరలోనే నిర్ణయిస్తామని అన్నా పేర్కొనడం బృందంలోని ఇతర సభ్యులను పునరాలోచనలో పడేసింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి జన్ లోక్ పాల్ చట్టం చేయాలని డిమాండ్ చేసే అన్నా హజారే, కాశ్మీరులో ప్రజాభిప్రాయం గురించి పట్టించుకోకూడదన్నట్లుగా వ్యాఖ్యానించడం బృందం సభ్యులను అయోమయంలోకి నెట్టింది.

“బృందంలో కొనసాగడంలో నాకున్న కష్టాన్ని వివరిస్తూ లేఖ రాశాను. అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోవద్దని వారు కోరారు. అఖిలభారత యాత్ర మధ్యలో నేనున్నాను” అని రాజగోపాల్ పి.టి.ఐ కి తెలిపాడు. బృందం సభ్యులమధ్య సమన్వయంలో లోపాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. హిసార్ విషయంలో కోర్ గ్రూపులో చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. వ్యక్తిగత నిర్ణయాలను సమర్ధించడంలో తనకు కష్టాలున్నాయని ఆయన స్పష్టం చేశాడు. నీటి సంరక్షణ కార్యకర్తగా పేరు పొందిన రాజీందర్ సింగ్ మెగసెసె అవార్డు గ్రహీత. ఆయన బృందంలో ఎన్నడూ అంత చురుకుగా లేనట్లు తెలిపాడు. రాజకీయ రంగు పులుముకుంటున్నపుడే బైటికి రావాలని నిర్ణయించుకున్నట్లుగా రాజీందర్ తెలిపాడు.

బృందం పరిధిలేమిటో తెలియనందున బృందం నుండి బైటికి రావాలని రాజగోపాల్ నిర్ణయించుకున్నాడని ఆయన సహచరుడు తెలిపాడు. యాత్ర సందర్భంగా తనను అనేక మంది హిసార్ విషయమై ప్రశ్నిస్తున్నారనీ వాటికి సమాధానం చెప్పడం కష్టంగా మారిందని ఆయన తెలిపాడు.

ప్రశాంత్ భూషణ్ ను బృందంలో కొనసాగించేదీ లేనిదీ నిర్ణయిస్తామని అన్నా హజారే ప్రకటించడంతోటే విభేధాలు ఒకింత తీవ్రరూపం సంతరించుకున్నాయి. హిసార్ లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేసిన అన్నా హజారే తన గ్రామానికి వెళ్ళాక లోక్ బిల్లుని ఆమోదించినట్లయితే దేశవ్యాపితంగా కాంగ్రెస్ తో పని చేయడానికి సిద్ధం అని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. దసరా ముగిసిన వెంటనే కాంగ్రెస్ పై ప్రచారం చేయాలని మొదట ప్రకటించిన అన్నా ఆ తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత ప్రచారం ఉంటుందని ప్రకటించాడు. ఈ పరిస్ధితి ఇతర సభ్యులలో అయోమయాన్ని రేకెత్తించడంతో దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయాలని నిర్ణయించడమే రాజకీయ రంగంలో అన్నా బృందం ప్రవేశించినట్లయింది. రాజకీయేతర స్వచ్ఛంద సంస్ధలుగా చెప్పుకునే తమ సంస్ధలు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సహజంగానే ప్రశ్నలను రేకిత్తించింది. ఏ సూత్రాలు, నియమాలు లేకుండా ఏర్పడిన అన్నా బృందం ఇతర విషయాలు చర్చకు వచ్చినపుడి విడిపోవడం అంతగా ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు.

వ్యాఖ్యానించండి