
గాజాను పాలిస్తున్న హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ సైనికుడి పేరు “గిలాద్ షాలిత్.” ఐదు సంవత్సరాల క్రితం హమాస్ సైనికులకు పట్టుబడ్డాడు. ఈ ఐదు సంవత్సరాలలో అనేక పరిణామాలు ఇజ్రయెల్, పాలస్తీనాలలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 2007 డిసెంబరులో ఇజ్రాయెల్ అమానుషంగా గాజాపై దాడి చేసింది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ధ్వంసం చేసింది. 1400 కి పైగా పాలస్తీనా పౌరులను చంపేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి నియమించిన రిచర్డ్ గోల్డ్ స్టోన్ నివేదిక ధృవపరిచింది. హమాస్ కూడా యుద్ధ నేరాలకు పాల్పడిందని గోల్డ్ స్టోన్ తెలిపినప్పటికీ నివేదికలో అత్యధిక భాగాన్ని ఇజ్రాయెల్ అమానుషాలను ఎండగట్టడానికే కేటాయించాడు.
ఈ దాడితో పాటు ఇజ్రాయెల్ అనేక సార్లు చిన్న చిన్న దాడులు కూడా పాలస్తీనాపై చేసి అనేకమంది పౌరులను పొట్టనబెట్టుకుంది. గాజాను అష్ట దిగ్బంధనం కావించి నిత్యావసర సరుకులను అందకుండా చేస్తోంది. తాను కూలగొట్టిన అనేక భవంతులను పునర్నిర్మాణం చేసుకోవడానికి నిర్మాణ సరుకులను కూడా గాజాలోకి అనుమతించడం లేదు. సిమెంటు లాంటివాటి ద్వారా బాంబులు తయారు చేస్తారని వాదిస్తూ గాజా పునర్నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులు కల్పిస్తున్నది. గిలాద్ షాలిత్ విడుదల కోసం జరిగిన అనేక చర్చలు విఫలం అయ్యాయి కూడా.
హమాస్ కి చెందిన ఉన్నత స్ధాయి ప్రతినిధి బృందం ఇజ్రాయెల్ సైనికుడు సార్జంట్ గిలాద్ షాలిత్ ను తీసుకుని మంగళవారం ఉదయాని కల్లా ఈజిప్టు చేరుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ విడుదల చేసిన పాలస్తీనీయులను స్వాగతం పలకడానికి వారు సిద్ధమై వెళ్ళారని హమాస్ టి.వి ఆల్-అక్సా తెలిపింది. ఈజిప్టు చేరుకున్న అనంతరం గిలాద్ షాలిత్ సరిహద్దు దాటుకుని ఇజ్రాయెల్ ప్రవేశించవలసి ఉంటుంది. అక్కడి నుండి సెంట్రల్ ఇజ్రాయెల్ లో గల నావికా శిబిరంలో ఎదురు చూస్తున్న అతని కుటుంబాన్ని అతను కలుసుకుంటాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వం తన కొడుకుని విడుదల చేయించేలా ఒత్తిడి చేయడానికి నోమ్ షాలిత్ అనేక విధాలుగా కష్టపడ్డాడు. ప్రజా సంఘాలతో కలిసి అనేక ఆందోళనలు కూడా జరిగాయి. ఒత్తిడి ఫలితంగా హమాస్ కోరినంతమందిని విడుదల చేసి ఇజ్రాయెల్ సైనికుడి విడుదలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు.
పాలస్తీనా ఖైదీలను వందలమందిని ఉదయం కాకముందే కొంతమందిని వెస్ట్ బ్యాంక్ కూ, మరికొంతమందిని ఈజిప్టు సరిహద్దులకూ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకెళ్ళింది. వీరిని ఆహ్వానించడానికి గాజా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసుకుంటున్నది. ఖైదీల హితులు, బంధువులు పెద్ద ఎత్తున సమకూడి దశాబ్దాలుగా చూడని తమ బంధువులను చూడడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్న దృశ్యాలను చూసి తీరవలసిందే. మంగళవారం విడుదల కావలసిన వారిలో కనీసం 300 మంది వరకూ సుదీర్ఘకాలంగా, కొంతమంది నేర నిర్ధారణ కూడా ముగియకుండా ఇజ్రాయెల్ జైళ్ళలో మగ్గుతున్నవారే. ఇరువైపులా ఖైదీల అప్పగింతకు ఈజిప్టు ప్రభుత్వంతో పాటు రెడ్ క్రాస్ సంస్ధ కూడా మధ్యవర్తిత్వం వహిస్తోంది.
ఇజ్రాయెల్ లో షాలిత్ ను విడుదల చేయాలంటూ మీడియా సంస్ధలు పెద్ద ఎత్తున నాలుగు సంవత్సరాలనుండి ప్రచారం సాగించడంతో ఆయన ఇజ్రాయెల్ జాతీయ చిహ్నంగా మారిపోయాడు. టి.వి ఛానెళ్ళు ఖైదీల అప్పగింత కార్యక్రమాలను లైవ్ కవర్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. జర్మనీ, ఈజిప్టు దేశాల మధ్యవర్తుల ద్వారా అనేక రౌండ్లపాటు జరిగిన చర్చలు ఎట్టకేలకు ముగింపుకు వస్తున్నాయి. ఇందులో హమాస్ సంస్ధ పెద్ద ఎత్తున లాభపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ ఖైదు చేసినవారిలో అత్యధికులు ఉత్తి పుణ్యానికి అరెస్టు అయినవారే.

“ఇజ్రాయెల్ అనేక సార్లు చిన్న చిన్న దాడులు కూడా పాలస్తీనాపై చేసి అనేకమంది పౌరులను పొట్టనబెట్టుకుంది.”
This tells whom you supports with. Be a impartial reported with out any biases.
నేను రాసినదానికి కట్టుబడి ఉన్నాను. ఇజ్రాయెల్ అబద్ధాలను సపోర్ట్ చేస్తే నిస్పాక్షికం అని నేను భావించను.