పొలిటికల్ జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను, ఎం.పిలను కూడా తప్పుడు కేసులు బనాయించడానికీ, జైళ్లలో పెట్టడానికీ వెనకాడడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయిందని స్పష్టం అవుతున్నదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉద్యమం కొనసాగుతుందనీ, ఇంకా ఉధృతంగా కొనసాగుతుందనీ కోదండరాం తెలిపాడు.
తెరాస నాయకుడు నాయని మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మంత్రులు సీమాంధ్ర నాయకులు కె.వి.పి, లగడపాటిలతో చర్చలు జరపడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల లొంగుబాటువల్ల, తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల లొంగుబాటువల్లనే తెలంగాణ ప్రకటనలో జాప్యం జరుగుతున్నదని నాయని ఆగ్రహం వెలిబుచ్చారు. కాంగ్రెస్ ను బొందబెడితేనే తెలంగాణకి విముక్తి అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఇక కాంగ్రెస్ ని ఖతం చేసే కార్యక్రమాలే ఉంటాయనీ, తెలంగాణ ఉద్యమానికి ఇక కాంగ్రెస్ నాయకులు, మంత్రులే టార్గెట్ అనీ నాయని, కోదండరాంలు తెలిపారు.
ఉద్యోగ జె.ఎ.సి ప్రతినిధి కూడా విలేఖరులతో మాట్లాడాడు. రైల్ రోకోతో ఉద్యోగ సంఘాలకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ దొంగ కేసులు బనాయించారనీ, కేసులు బనాయించి చర్చలకు పిలవడం ఏనీతి అనీ ఆయన ప్రశ్నించాడు. తెలంగాణ వచ్చేవరకూ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశాడు.
తెలంగాణ లావ్, కాంగ్రెస్ కో ఖతమ్ కరో అన్నదే ఇక తమ నినాదమని నాయని ప్రకటించాడు. విలేఖరుల సమావేశం అనంతరం కూడా జె.ఎ.సి నాయకులు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ కార్యకర్తలు ఉద్యమించనున్నారు. ఎక్కడికక్కడ నిలదేసే కార్యక్రమాలు ఉధృతం కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎం.ఎల్.ఎలు, మంత్రులు ఎవరూ తెలంగాణలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్ధితి ఉంది. కాంగ్రెస్ నే ప్రధానంగా టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాక వారి పరిస్ధితి ఇక చెప్పనవసరం లేదేమో.
కోదండరాం, నాయని ల మాటలను బట్టి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై అంతిమ నిర్ణయం తీసుకునే పరిస్ధితుల్లో ఉన్నదనీ ఆ నేపధ్యంలోనే కె.వి.పి, లగడపాటిలు తెలంగాణ మంత్రులతో చివరి దఫా మంతనాలు జరుపుతున్నారని కనిపిస్తోంది. ఈ మంతనాలు తెలంగాణ నాయకులను మంచి చేసుకోవడానికి కావచ్చు. తెలంగాణ డిమాండును వదులుకునేలా చేయడానికి జరుగుతున్న చివరి ప్రయత్నాలు కావచ్చు. లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధి విధానాలలో సీమాంధ్ర ధనికులకు మరిన్ని సౌకర్యాల కల్పన కోసం జరుగుతున్న చర్చలు కావచ్చు. ఇంకా ఏవైనా కావచ్చు. అదేమైనా తెలంగాణ ప్రజలకు మాత్రం ద్రోహం చేసేవే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
వై.ఎస్.రాజశేఖర రేడ్డి మిత్రుడు కె.వి.పి రాంచంద్రరావు పెద్ద బ్రోకర్ గా ఇప్పటికే పేరు సంపాదించుకున్నాడు. అధికారానికి బ్రోకర్ మాత్రమే కాక, కాంట్రాక్టులకూ, రాయబారాలకూ, రాజీలకూ కూడా ఆయన పెద్ద బ్రోకర్. ఆయన రంగంలో ఉన్నాడంటే నిశ్చయంగా ప్రజలకు ఏదో పెద్ద నష్టమే జరగనున్నదని నిస్సందేహంగా భావించవచ్చు. వై.ఎస్.ఆర్ సాగించిన అలవిగాని అవినీతికి దగ్గరుండి పౌరోహిత్యం నెరిపిన కె.వి.పి పచ్చి ప్రజా వ్యతిరేకి. తెలంగాణ నాయకులు ఎట్టి పరిస్ధితుల్లోనూ అటువంటి వ్యక్తులను దగ్గరికి రానీయకూడదు.
పొలిటికల్ జె.ఎ.సి తన ఉద్యమ ఎత్తుగడలను మరింత తెలివిగా, శక్తివంతంగా వేయవలసిన అవసరం ఇంకా పెరిగిందని చెప్పవచ్చు.

రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ అని మొదటినుండి తెరాస కాంగ్రెస్‌పై కొంత మెత్తదనంతో వుంది. దాన్ని ఆసర చేసుకున్న కాంగ్రెస్ నాయకులు కూడా సిసలైన తెలంగాణా వాదుల్లాగా గొప్పనాటకమే రక్తికట్టించారు. కాని ఇప్పుడు వారు రానున్న రోజుల్లో ఎంతవరకు కేంద్రాన్ని ప్రభావితం చేయగలరనే దానిపైనే వారి రాజకీయభవిష్యత్తు ఆధారపడివుంది. లేకపోతే TDPకి పట్టినగతే వారికీ పట్టడం ఖాయం.
మీకొక విషయం అర్ధం కావడం లేదు, నేను గత వారం రోజులుగా పేపర్ ల లోనూ , E TV ల లోనూ నా సొంత ఖర్చుతో AD ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా ఒక్కరు కూడా Ad ప్రచురించడానికే ఒప్పుకోవడం లేదు. ఇక ప్రత్యేక రాష్ట్రమిస్తారా? నేను సంవత్సరం నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాను, పేరు మార్చడానికే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు.
తెలంగాణా వారికి అర్ధం కాదు, చెపితే వినరు. మీరు హైదరాబాదు వదిలేస్తానన్నా కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వరు.
పేరు వదులుకోడానికే ఒప్పుకోవడం లేదు. ఇక రాష్ట్రం సంగతి చెప్పనక్కరలేదు.