
ఖచ్చితంగా చెప్పవలసివస్తే, ఎ.క్యు.ఎ.పి నిర్వహించిందని చెబుతున్న చర్యలు సాంకేతిక నైపుణ్యంలో దాని అసమర్ధతను మాత్రమే వెల్లడించాయి. నిజానికి ముతాలబ్ స్వయంగా అంగీకరించినదాని ప్రకారం, అతను చేపట్టిన బాంబుదాడి పధకంలో గానీ, నిర్వహణలో గానీ అవలాకి పాత్ర లేనేలేదని ఆనాడే ఎన్.బి.సి వార్తా సంస్ధ వెల్లడించింది. ముతాలిబ్ ను ఆల్-ఖైదాకు పరిచయం చేయడంవరకే అవలాకి పాత్ర ఉందని ఆ పత్రిక తెలిపింది. యెమెన్ లో జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో అవలాకి అత్యంత చిన్న వ్యక్తి. ఇతర అరబ్ దేశాలలోని విప్లవాలలో కూడా అవలాకి ప్రచారం ప్రభావం లేదు. ఇంగ్లీషు మాట్లాడే మానవ బాంబులను రిక్రూట్ చేసుకోవడంలో ఆయన అసమర్ధుడు. రెండు బాంబు దాడులకు పధకం వేసి అమలు చేశాడని పత్రికలు రాసిన కధనానికి ఎటువంటి సాక్ష్యాలూ లేవు. పైగా ఒక బాంబర్ ఆయన ప్రమేయం లేదని చెప్పగా, మరొక బాంబు పధకంలో అమలు కానే లేదు. అందులో అవలాకి ప్రమేయానికి ఏ చిన్న సాక్ష్యమూ లేదు.
అమెరికా ప్రోత్సాహంతో, ఆదేశాలతో మీడియా సంస్ధలు అవలాకి ప్రాముఖ్యతను ప్రధాన ఆల్-ఖైదా నాయకుడికి స్ధాయికి పెంచివేశాయి. డ్రోన్ విమానం ద్వారా బాంబు దాడి జరిపి ఆయనను చంపడంతో ప్రపంచవ్యాపితంగా ఉన్న జిహాదిస్టులకు మానసికంగా పెద్ద దెబ్బ తగిలిందని కూడా అవి గొప్పగా రాశాయి. ఈ ప్రచారంలో నిజం లేదు. విషయం అసలే లేదు. కాని అవలాకి హత్య సందర్భంగా మీడియా ప్రచారం చేసిన ప్రాపగాండాకు మాత్రం స్పష్టమైన లక్ష్యం ఉంది. అనంత రక్తపాతంతో వలసయుద్ధాలలో మునిగిఉన్న ఆంగ్లో-అమెరికన్ రాజకీయ నాయకత్వాన్ని సైద్ధాంతికంగా విమర్శిస్తున్నవారిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా చేస్తున్న వరుస రాజ్యహత్యలకు, అవలాకి హత్య ఒక న్యాయబద్ధతను సమకూర్చుతున్నది. వలసపాలకులుగా తాము చేస్తున్న హత్యలకు న్యాయబద్ధతను పొందడం కోసమే అన్వర్ ఆల్-అవలాకిని అమెరికా దారుణంగా హత్య చేసింది.
ఆఫ్ఘనిస్ధాన్‌లొ ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు అమెరికా ఓటమి కోరల్లో చిక్కుకున్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. నిస్సహాయ పరిస్ధితుల్లో ఉన్న అమెరికా, తాము టెర్రరిజంపై యుద్ధాన్ని (ఆఫ్ఘన్ దురాక్రమణని) గెలుస్తున్నామని చెప్పడానికి వీలుగా కనీసం గడ్డిపోచ ఆసరా అయినా కావాలని తపనపడుతోంది. తాలిబాన్ చేతులకు విజాయాన్ని అందించవలసి వస్తుందన్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండడంతో అమెరికా గంగవెర్రులెత్తుతోంది. వియత్నాం పరాభవం మరొక్కసారి తలుపు తడుతుండడంతో భయకంపితమై ఉంది. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు, కాందహార్ లో కర్జాయ్ కు బలమైన సహాయకుడు అయిన అహ్మద్ వాలి కర్జాయ్ ను, తాలిబాన్ ఆదేశాలతో ఆయన అంగరక్షకుడే అయన ఇంటివద్దే కాల్చి చంపాడు. ఒక రాష్ట్ర గవర్నర్ ను కూడా తాలిబాన్ కాల్చి చంపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే కాబుల్ హై సెక్యూరిటీ జోన్ లోకి తాలిబాన్ చొరబడి అమెరికా ఎంబసీపై రాకెట్ పేల్చింది. తాలిబాన్ తో చర్చలు జరపడానికి హమీద్ కర్జాయ్ గత సంవత్సరం నియమించుకున్న ప్రముఖ యుద్ధ ప్రభువు బర్హనుద్ధీన్ రబ్బానిపైన మానవబాంబును ప్రయోగించి తాలిబాన్ ఆయన ఇంట్లోనే చంపింది.
ఎనిమిదిన్నర సంవత్సరాలకుపైగా ఆక్రమించుకుని ఉన్న ఇరాక్ క్రమంగా అమెరికాకంటే దాని బద్ధ శత్రువు ఇరాన్ కే దగ్గరగా జరుగుతోంది. ఇరాక్ ప్రధాని ఇరాన్ కు నమ్మినబంటుకాగా, సదర్ లాంటి శక్తివంతమైన షియా గురువు సైతం ఇరాన్ అనుచరుడే. గడ్డాఫీ అనంతర లిబియా ఇంకా పూర్తిగా వశం కాలేదు. ఆల్-ఖైదా సంస్ధతోనే కలిసి అమెరికా గడ్డాఫీ బలగాలతో తలపడుతోంది. కిరాయి సైనికులు అక్కడ ఇంకా లిబియాపై నియంత్రణకోసం పోరాడుతూనే ఉన్నారు. భవిష్యత్తులో ఆల్-ఖైదా అమెరికా, యూరప్ ల అనుచరగణంపైనా, గడ్డాఫీ సానుభూతిపరులపైనే యుద్ధం ప్రకటించినా ఆశ్చర్యం లేదు.
ట్యునీషియా, ఈజిప్టు, బహ్రెయిన్, యెమెన్ దేశాల ప్రజాందోళనలను పక్కదారి పట్టించి తన కీలు బొమ్మలతో ప్రభుత్వాలని ఏర్పరచాలన్న నాటో, అమెరికాల ప్రయత్నాలు రెండో ప్రజాస్వామిక ఉద్యమ తరంగం వలన తుడిచిపెట్టుకుపోతున్న పరిస్ధితి కనిపిస్తున్నది. అరబ్ వసంతాన్ని వేడి శరత్కాలం వెంబడిస్తోంది. ఒబామా ప్రభుత్వానికి సానుకూల వార్తలు, అనుకూల ఫలితాలు లేకుండా పోయాయి. అరబ్-ఇస్లామిక్ ప్రజా సమూహాలను మోసగించడానికి ఒబామా వద్ద మాయోపాయాలు కూడా కరువైనాయి. పాలస్తీనా స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఒబామా వెలువరించిన ప్రసంగం, ఆయన ముస్లింలకు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానంలోని ఖాళీతనాన్ని విప్పి చూపిస్తోంది. స్వతంత్ర పాలస్తీనాను గుర్తించడంపై ఆయన వెల్లడించిన వ్యతిరేకత అరబ్, ఇస్లామిక ప్రజల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఇజ్రాయెల్ జాతి దురహంకార ప్రయోజనాలకు లొంగడం ద్వారా అమెరికాలోని ధనిక యూదుల ప్రాపకం సంపాదించుకుని ఎన్నికల ప్రచారానికి కావలసిన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అరబ్బులకు బాగానే అర్ధం అయ్యింది.
దౌత్యపరంగా ఏకాకియై, విఫల ఆర్ధికవిధానాలతో ఇంటకూడా పరువు పోగొట్టుకున్న ఒబామా, యెమెన్ కు చెందిన ఒక ఇస్లాం మతబోధకుడుని కాల్చి చంపడం ద్వారా అరబ్బు ప్రపంచానికి ఒక సందేశం పంపదలుచుకున్నాడు. అరబ్బు దేశాల సహకారంతో సంబంధం లేకుండా హంతక డ్రోన్ విమానాలతొ ఎక్కడికయినా చొరబడి చంపదలుచుకున్నవారిని చంపేస్తామన్నది ఆ సందేశం సారాంశం. అన్వర్ అవలాకి వాస్తవానికి అమెరికా పౌరుడు. అతనిని చంపడం ద్వారా అమెరికా తన సొంత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను బహిరంగంగా నిరాకరించింది. తన పౌరులకు రాజ్యాంగం ప్రకారం కల్పించవలసిన న్యాయ విచారణా ప్రక్రియను ఒబామా అవలాకికి నిరాకరించాడు. తనదేశ పౌరుడికి పౌర హక్కులనూ, మానవ హక్కులనూ నిరాకరిస్తూ దాడి చేసి చంపడంద్వారా తాను ఎంతకైనా దిగజారగలనని ఒబామా కూడా తన ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు.
అమెరికా, యెమెన్ లలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఆల్-అవలాకి హత్య ద్వారా ఒబామా స్వదేశీయులకు కూడా పరోక్ష సందేశాన్ని పంపినట్లు కనిపిస్తోంది. “ద్వంద్వ పౌరసత్వం ఉన్న అవలాకి మత బోధనలను ఆధారం చేసుకుని, ఆయనను విదేశీ భూభాగంపైన హత్య చేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయగలిగినప్పుడు, అదే రకం హత్యలను అమెరికాలో కూడా చేయకుండా అధ్యక్షుడిని ఎవరు అడ్డుకోగలరు? లేదా ఏ నియమం అడ్డుకోగలదు? విదేశాల్లో ఎదురైన దౌత్య వైఫల్యాన్ని పరిహరించడానికి హత్యా రాజకీయాలకు పాల్పడినట్లయితే, అమెరికన్లకు ఉన్న ఇతర స్వేచ్ఛలను హరించడానికి తన విమర్శకుల నోళ్లు మూయించడానికి దేశీయ బధ్రత పేరుతో ‘అంతర్గత భధ్రతా ప్రమాదం’ ఏర్పడిందని ప్రకటించకుండా ఒబామను ఎవరు అడ్డుకోగలరు?” అని అమెరికాకు చెందిన ప్రపంచ రాజకీయ విశ్లేషకుడు ‘జేమ్స్ పెట్రాస్’ ప్రశ్నించాడు.
అన్వర్ అవలాకీ హత్య అనుకోకుండా ముందస్తు పధకం లేకుండా జరిగిన హత్యగా చూడలేము. యెమెన్ లో అల్లర్లు జరుగుతున్న నేపధ్యంలో జరిగిన హత్యగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అమెరికా విదేశీ, స్వదేశీ విధానాలకు రాజకీయ హత్యలను కేంద్రకంగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇది దీర్ఘకాలికంగా తీవ్రప్రభావం కలిగించగల పరిణామం. “దేశంలో వృద్ధి చెందిన టెర్రరిస్టులను అంతం చేయడమే మన ‘అంతర్గత భద్రత’ విధానంలో మూలాంశంగా ఉంది” అని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ, మాజీ సి.ఐ.ఎ డైరెక్టర్ లియోన్ పెనెట్టా స్పష్టం చేసిన సంగతిని కూడా ఇక్కడ మననం చేసుకోవడం అవసరం. కనుక ఒబామా అనుసరిస్తున్న రాజకీయ హత్యా విధానాలు దేశీయంగా కూడా ప్రకంపనలు సృష్టించడం అనివార్యంగా కనిపిస్తోంది. ఒక పక్షం ఇటువంటి విధానాలను అనుసరించడం ప్రారంభం అయితే రెండో పక్షానికి దానిని అభివృద్ధి చేయడంపైన కేంద్రీకరిస్తుందన్నది నిజం.
అమెరికన్లూ, తస్మాత్ జాగ్రత్త!
