అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ తరహా ఆందోళనలు


“ఆకుపై వాల్‌స్ట్రిట్!” నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఈ అందోళన ఇపుడు ప్రపంచ స్ధాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన అమెరికన్ల ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా పాకాయి. ఇపుడు జపాన్ నగరం టోక్యోకు పాకి “టోక్యో ఆక్రమిద్దాం” అంటూ జపనీయులు నినదిస్తున్నారు.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ‘బెయిలౌట్’లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి విదితమే. తీరా ఆ డబ్బంతా అమెరికా, యూరప్ దేశాలపైన అప్పుగా పేరుకుపోయింది. ‘బడ్జెట్ లోటు’ తగ్గించాలనీ, ‘అప్పు భారం’ తగ్గించాలనీ చెబుతూ ‘పొదుపు ఆర్ధిక విధానాల’ పేరున కంపెనీలకి పంచిన డబ్బుని ప్రజలవద్ద నుండే వసూలు చేయడానికి అమెరికా యూరప్ ల ప్రభుత్వాలు పూనుకున్నాయి. తమకు సంబంధం లేని అప్పును తమపైనే భారంగా వేయడానికి వ్యతిరేకంగా అమెరికన్లు నెలరోజులనుండి ఉద్యమిస్తున్నారు.

బ్యాంకర్లకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాపితంగా ప్రజలు శనివారం ఆందోళనలు నిర్వహించారు. ఆర్ధిక వ్యవస్ధలను నిర్వహిస్తున్న ప్రవేటు ద్రవ్య కంపెనీలు, రాజకీయ నాయకులు మిలియన్లమంది సామాన్య ప్రజానీకంపై అనేక కష్టాలను మోపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ప్రజాందోళనలు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయ్యాయి. యూరప్ ను అప్పుడే చుట్టుముట్టాయి. అక్కడినుండి అవి తమ ప్రారంభ ప్రదేశం అయిన న్యూయార్క్ నగరానికి తిరిగి చేరుకోబోతున్నాయి. అయితే వివిధ దేశాలలో జరుగుతున్న ఈ ఆందోళనలు కొన్నిచోట్ల చిన్నచిన్నవిగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై ట్రాఫిక్కును ఆపగల శక్తి కూడా వీరికి లేదు. కాని పెద్ద పెద్ద ప్రదర్శనలకు కూడా కొదవలేదు. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో త్వరలో జరగనున్న ప్రదర్శనలో కనీసం 100,000 మంది పాల్గొంటారని నిర్వాహకులు చెపుతున్నారు.

“ప్రపంచ స్దాయిలోనే ప్రభుత్వ అప్పు మనం ఏమాత్రం భరించలేని స్ధాయికి చేరుకుంది. దోపిడీ ప్రభుత్వాలు, అవినీతి బ్యాంకులు, స్పెక్యులేటర్లు కలిసి కూడబెట్టిన ఈ అప్పు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేనిది. భారాన్ని ప్రజలపై వేస్తూ కూడా ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోరు వీళ్ళు” అని రోమ్ ప్రదర్శనకు హాజరవుతున్న యువతులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. నిరుద్యోగులు, విద్యార్ధులు, పెన్షనర్లు వేలాదిగా రోమ్ ప్రదర్శనలో పాల్గొంటున్నారని చెబుతున్నారు.

“వాళ్లు ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని తీసుకొచ్చారు. సంక్షోభం నుండి కూడా వాళ్లు లాభాలు దండుకుంటున్నారు. వాళ్లే ఇదంతా చెల్లించాలి” అని ప్రదర్శనకు హాజరవుతున్నవారు నినదిస్తున్నారు. రోమ్ ప్రదర్శనల కట్టడికి రెండువేల మంది పోలీసులను నియమించారు. గత సంవత్సరం విద్యావిధానంపై ఆందోళనలు జరిపిన ప్రదర్శకులు తమతో కొట్లాడిన అనుభవాలను రోమ్ పోలీసులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

న్యూయార్క్ నగరంలో ఓ ప్రవేటు పార్కులో గుడారాలతో తిష్టవేసిన ఉదాహరణని ఇటలీ ఆందోళనలు అనుకరిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇటలీ ప్రధాన కార్యాలయం నుండి ఉన్న రోడ్డు పక్కన గత వారం రోజులుగా రోమ్ ఆందోళనకారులు తిష్టవేసి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ శనివారం నుండే అమెరికాలోని మరిన్ని నగరాలలో ఆందోళనలను నిర్వహించడానికి ప్రజలు సమాయత్తమవుతున్నారని రాయిటర్స్ తెలిపింది. ఇటలీ ప్రభుత్వం 60 బిలియన్ యూరోల పొదుపు ఆర్ధిక పధకానికి ఇటలీలోని బెర్లుస్కోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివలన పన్నులు పెరగనున్నాయి. ప్రజారోగ్యం మరింత ప్రియం కానున్నది.

శుక్రవారం అతిపెద్ద వాల్ స్ట్రీట్ బ్యాంకు ‘గోల్డ్‌మేన్ సాచ్’ కి చెందిన మిలన్, ఇటలీ శాఖపైన ఆందోళనకారులు దండెత్తి గోడలనిండా నినాదాలతో నింపారు. ఇటలీలో అతి పెద్ద బ్యాంకు ‘యూనిక్రెడిట్’ ప్రధాన కార్యాలయం పై మరికొంతమంది కోడు గుడ్లు విసిరి తమ కోపం తీర్చుకోవడానికి ప్రయత్నించారు. శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో కూడా ప్రదర్శనలు జరిగాయి.

న్యూజిలాండ్ లో పెద్ద నగరం ఆక్లండ్ లో ప్రధాన వీధిలో కొన్ని వందలమంది ప్రదర్శన నిర్వహించి అప్పటికే అక్కడ ఉన్న మూడువేలమందితో చేరిపోయారు. డ్రమ్ములు, నినాదాలతో హోరెత్తించారు. వెల్లింగ్టన్ లో రెండొందలమంది, క్రైస్ట్ చర్చ్ నగరంలో యాభైమంది ప్రదర్శన జరిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రెండు వేలమంది ప్రదర్శన నిర్వహించారు. వారిలో ఆస్ట్రేలియా మూలవాసులు కూడా పాల్గొన్నారు. ట్రెడ్ యూనియన్లు కూడా ప్రదర్శనకు మద్దతు పలికాయి. వీరంతా ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంకు ఎదుట ప్రదర్శన జరిపారు.

టోక్యో నగరంలో కొన్ని వందలమంది ప్రదర్శన జరిపారు. వీరికి అణు వ్యతిరేక ఆందోళనకారులు కూడా జతకలిసారు. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలోనూ ప్రదర్శని నిర్వహించారు. అమెరికా ఎంబసీ వద్ద ప్రదర్శన జరిపి “అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి”, “ఫిలిప్పైన్స్ అమ్మకానికి లేదు” అని నినదించారు. బ్యానర్లు ప్రదర్శించారు. తైవాన్ రాజధాని తైపి స్టాక్ ఎక్ఛేంజి వద్ద వందమందికి పైగా ఆందోళన నిర్వహించారు. “మేము తైవాన్‌లో 99 శాతం” అని నినదించారు. ఆర్ధికవృద్ధి కంపెనీలకే లాభించిందని వారు తెలిపారు. మధ్యతరగతి వేతనాల వలన ఇల్లు, విద్య, ఆరోగ్యం ఖర్చులు ఏమీ నడవడం లేదని వాపోయారు.

లండన్ లో ప్రదర్శనకారులు “ఆకుపై స్టాక్ ఎక్ఛేంజ్” ఆందోళన నిర్వహించారు. లండన్ లో ప్రతిరోజూ అన్ని రంగాల ప్రజలు తమతో చేరుతున్నారని లండన్ ఆందోళనకారులు చెబుతున్నారు. వీరు నిర్వహిస్తున్న ఫేస్ బుక్ పేజి కి ఇప్పటికే 12,000 మంది ఫాలోయర్లు రిజిస్టర్ అయ్యారని రాయిటర్స్ తెలిపింది. “ద్రవ్య వ్యవస్ధ” తమ టార్గెట్ అని వారు చెబుతున్నారు. “జరిగింది చాలు” అని వారు నినదిస్తున్నారు.

గ్రీకు ఆందోళనకార్లు శనివారం “పొదుపు విధానాల వ్యతిరేక దినం” జరపాలని పిలుపునిచ్చారు. “గ్రీసు ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్ధితే త్వరలో ఇతర దేశాల ప్రజలకు కూడా పీడకల గా ఎదురుకానున్నది. పరస్పర సహకారమే ప్రజల శక్తివంఅమైన ఆయుధం” అని ‘రియల్ డెమొక్రసీ’ సంస్ధకు చెందినవారు ప్రకటించారు. ప్యారిస్ లో జి20 సమావేశాల సందర్భంగా తమ ప్రదర్శనలు నిర్వహించాలని ఫ్రాన్సు ఆందోళనకారులు పధకం వేసుకున్నారు.

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఏడు చోట్ల మార్చ్ లను నిర్వహించాలని పధకం వేసుకున్నారు. యూరోజోన్ లో బలహీన దేశాలకు తమ సొమ్ముని బెయిలౌట్లుగా ఇవ్వడానికి జర్మన్లు అంగీకరించడం లేదు. “రియల్ డెమొక్రసీ నౌ” సంస్ధ నీడన ఆర్ధిక రాజధాని ఫ్రాంక్‌ఫర్డ్ లో వారు ఆందోళనలకు నిర్ణయించారు. బలహీన దేశాలకు జర్మనీ ఇస్తున్న బెయిలౌట్లు వాస్తవానికి జర్మనీకి చెందిన బడా బ్యాంకులకే తిరిగి చేరుతాయన్న నిజాన్ని వారు గ్రహించారు.

ఈ ఆందోళనలన్నింటా కొట్టవచ్చినట్లు ఒక లోపం కనిపిస్తున్నది. వీరిలో ఎవరికీ నిర్ధిష్టమైన డిమాండ్లు లేవు. డిమాండ్లు ఉండాలన్న విషయాన్ని కూడా వీరు పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఆందోళనకారులను డిమాండ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నప్పటికీ వారు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఆందోళనల వెనక సోరోస్ అన్న అమెరికా ధనికుడు ఉన్నాడని ఇప్పటికే పుకార్లు వెల్లువెత్తాయి. ఆయన తనకు సంబంధం లేదని కూడా ప్రకటించినా ఇవి ఆగలేదు.

డిమాండ్లు లేని ఆందోళనలు ఉండడమే ఆశ్చర్యకరం. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు తదితర ద్రవ్య కంపెనీల అత్యాశ, బెయిలౌట్ భారాలు ప్రజలను కుంగదీస్తున్నాయని చెబుతున్నప్పటికీ సంబంధిత డిమాండ్లు ముందు పెట్టడం లేదు. పది సంవత్సరాల క్రితం ఉప్పెనలా విరుచుకుపడిన వరల్డ్ సోషల్ ఫోరం కూడా ఇదేరీతిన ఎగసి చప్పున చల్లారింది. అప్పట్లో కూడా దారితెన్నూ లేకుండా సమావేశాలు, మహాసభలు జరిగాయి. బడా కంపెనీల నిధులతోనే అవి జరిగాయనీ, ప్రజాగ్రహాలను పక్కదారి పట్టించడానికే అవి జరిపారనీ ససాక్ష్యాలతో కొంతమంది రుజువు చేశారు కూడా. ఇప్పటి ఆందోళనలు కూడా అదే కోవలోకి వస్తాయా అన్నది కొంతకాలం పోతే గాని వెల్లడి కాదు.

వ్యాఖ్యానించండి