అమెరికా పచ్చి అబద్ధాల చరిత్రలో ఇంకొక పేజీ


ఈ సారి ఇరాన్ ప్రభుత్వం నేరుగా అమెరికా గడ్డపైనే సౌదీ అరేబియా రాయబారి హత్యకు కుట్ర చేసింది. అందుకు విచిత్రంగా మెక్సికో ‘హిట్ మేన్’ (ఖచ్చితంగా చెబితే కిరాయి గూండా) ను ఇరాన్ కాంట్రాక్టుకు మాట్లాడుకుంది. కాంట్రాక్టు కిల్లర్ ను మాట్లాడాడని అమెరికా చెబుతున్న వ్యక్తి, డ్రగ్స్ కేసుల్లో సి.ఐ.ఎ కి ఇన్‌ఫార్మర్ అన్న విషయం కూడా మరిచిపోయి అమెరికా గొప్ప కుట్రను బైటపెట్టాయి. ఇరాన్ కుట్రకు శిక్షగా అమెరికా తాజాగా మరికొన్ని ఆంక్షలను ఇరాన్ పైన విధించింది.

అదీ సంగతి. ఇరాన్ పైన మళ్లీ వాణిజ్య ఆంక్షలను విధించాలి. సౌదీ అరేబియాతో సహా మధ్య ప్రాచ్యంలోని తన ఇతర తొత్తు రాజ్యాలకు పెద్ద మొత్తంలో తాను అమ్ముతున్న ఆయుధాలకు సాకు కావాలి. అంతర్జాతీయ రంగంలో ఇరాన్ ని మరింతగా ఒంటరిని చేయాలి. భవిష్యత్తులో ఇరాన్ పైన దాడి చేయవలసి వస్తే అందుకు అవసరమైన పునాదిని సిద్ధం చేసుకోవాలి. వీటన్నింటికీ విశ్వసనీయమైన కారణం ఒకటి కావాలి. కాని ఈసారి అమెరికా విశ్వసనీయమైన కారణాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యింది.

ఇరాన్ పైన విధించిన తాజా ఆంక్షలకు అమెరికా చెప్పిన కారణం ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేతకోసం’ అని సమాధానం చెప్పినట్లుగా ఉంది.

ఒబామా ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంపైన బహిరంగంగా నేరారోపణలు చేసింది. అమెరికాలో సౌదీ అరేబియా తరపున నియుతులైన రాయబారిని హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వ ఏజెంట్లు కుట్ర పన్నారని అమెరికా అరోపించింది. కుద్స్ (Quds) సంస్ధకు చెందిన సభ్యులు ఈ కుట్ర పన్నారని అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధలు కనిపెట్టాయట. ఈ ఆరోపణ ద్వారా అమెరికా, అరబ్ దేశాల్లో తలెత్తిన తిరుగుబాట్లపై ఉన్న కేంద్రీకరణని తిరిగి ఇరాన్ పైకి మళ్ళించింది.

అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ ‘కుద్స్’ ను ‘ఇరాన్ కి సంబంధించి విదేశాలలో చర్యలు చేపట్టే ప్రత్యేక యూనిట్’ గా అభివర్ణించింది. కాని ఆ సంస్ధ అత్యంత సున్నితమైన మిలట్రీ ఆపరేషన్ ఒకటి నిర్వహించదలుచుకుంది. అది సున్నితం ఎందుకయ్యిందంటే, దానివలన ఇరాన్ సొంత భద్రతపైన కూడా ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఇరాన్ పొరుగు దేశాలతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు. అటువంటి ఆపరేషన్‌ను కుద్స్ చేపట్టడం వలన ఇతరేతర సమస్యలు వస్తాయి కనుక అందుకోసం అది ఒక హిట్ మేన్ గానీ లేదా మెక్సికోకి చెందిన డ్రగ్స్ ముఠాను ఎన్నుకుంటే, ఒక వేళ వారు పట్టుబడినా నింద ఇరాన్ పైకి రాకుండా ఉంటుందన్నమాట!

ఈ అంశంపైన హిల్లరీ క్లింటన్ అభిప్రాయాన్ని ఈ సందర్భంగా చూడవలసి ఉంది. “సౌదీ అరేబియా రాయబారిని చంపడానికి మెక్సికోకి చెందిన డ్రగ్స్ ముఠాను, ఇరాన్, కిరాయికి మాట్లాడడానికి ప్రయత్నిస్తుందన్న ఆలోచనే నమ్మశక్యంగా లేదు. బుద్ధున్నవాడెవ్వడూ అటువంటి ఆరోపణ చెయ్యడు” అని హిల్లరీ క్లింటన్ తేల్చేసింది. అటువంటి ప్రయత్నానికి కూడా ఇరాన్ తెగబడిందని క్లింటన్ చెప్పదలుచుకుంది. తమ కట్టుకధను ఎవరూ నమ్మారని పరోక్షంగా క్లింటన్ అంగీకరించింది. ఈ సంఘటనను ఉపయోగించుకుని మరిన్ని దేశాలను ఇరాన్ కి వ్యతిరేకంగా సమీకృతం చేస్తామని కూడా ఆమె పేర్కొన్నది.

నమ్మశక్యం లేని ఆలోచనను అమెరికా చేయడమే కాక దానిని ఇరాన్ కి అంటగట్టడం ద్వారా మరిన్ని దేశాలను ఇరాన్ కి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నదని దీనిని బట్టీ అర్ధం అవుతోంది. ఇరాక్ దేశంలో సద్దాం హుస్సేన్ ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలను’ దాచి ఉంచాడని దొంగ గూఢచార నివేదికలు సృష్టించి ఇరాక్ పైన దురాక్రమణ చేసి అక్కడి ప్రజల జీవితాలను సర్వనాశనం చేసిన అమెరికాయే ఇప్పుడు ఇరాన్, సౌదీ అరేబియా రాయబారిని హత్య చేయడానికి పధకం పన్నిందని ఆరోపిస్తోంది. 9/11 టెర్రరిస్టు దాడులకు పాల్పడిందంటూ ఆల్-ఖైదా పై ఆరోపించి ఆల్-ఖైదాను మట్టు పెడతామంటూ ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించిన అమెరికా, ఇప్పుడు అదే ఆల్-ఖైదా తో కలిసి లిబియాలో మౌమ్మర్ గడ్డాఫీని కూలదోసింది. దానితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైంది.

అటువంటి అమెరికాయే ఇప్పుడూ ఇరాన్ పైన మరొక నమ్మశక్యం గాని ఆరోపణ చేసి మరిన్ని ఆంక్షలు విధించింది. నిజానికి గత 200 సంవత్సరాలకు పైగా కాలంలో మరో దేశంపై దాడి చేయలేదు. దాని పొరుగునే ఉన్న ముస్లిం దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అది తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. తమకు అణు బాంబు తయారు చేయడంలో ఆసక్తి లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా, అందుకు సాక్ష్యాలేమీ లేకపోయినా, సి.ఐ.ఎ స్వయంగా ఇరాన్‌కు అణుబాంబు తయారు చేయగల శక్తి లేదని చెప్పినా ఇప్పటికి అమెరికా, యూరప్ లు ఐదు సార్లు ఇరాన్ పైన ఆంక్షలు విధించింది. ఇరాన్ ప్రజలకు సరుకులు అందకుండా, ఆ దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటోంది.

ఈజిప్టు ప్రజల తిరుగుబాటు సఫలం కాకుండా తాత్కాలికంగానైనా అమెరికా అడ్డుకుంది. అక్కడ సైనిక ప్రభుత్వం ఏర్పరిచి ప్రజల డిమాండ్లు నెరవేరకుండా అడ్డుకుంటోంది. ఈజిప్టు ప్రజల తిరుగుబాటు సంపూర్ణంగా విజయవంతం ఐనట్లయితే మధ్య ప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యానికి తీవ్రమైన గండి పడేది. లిబియాలో సైనిక చర్యతో గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలదోసి తన తొత్తులను కూర్చోబెట్టడానికి చివరి అంకంలో ఉంది. ఇజ్రాయెల్, అమెరికా ల పెత్తనానికి ఎదురొడ్డి నిలబడ్డ సిరియా ప్రభుత్వాన్ని కూలదోయడానికి శతధా ప్రయత్నిస్తోంది. సిరియా ప్రభుత్వం బలహీనపడుతున్న ఛాయలు కొద్దిగానైనా కనిపిస్తున్నాయి. యెమెన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లోని నియంతృత్వ ప్రభుత్వాలతో పాటు పాకిస్ధాన్ ప్రభుత్వం కూదా అరబ్ విప్లవాల వల్ల తలెత్తిన భయాందోళనలనుండి బైటపడ్డట్టు కనిపిస్తోంది.

ఈ పరిణామాలతో అమెరికాలోని అభివృద్ధి నిరోధక పాలక వర్గాలు ఉత్సాహం పుంజుకున్నాయి. ఆ ఉత్సాహంలో ఇరాన్ పైన కూడా మిలట్రీ దాడికి సిద్ధపడేలా అమెరికా ప్రభుత్వాన్ని వారు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ల ఆధిపత్యానికి స్ధిరంగా ఎదురొడ్డి నిలబడిన దేశం ఇరాన్. కనుక ఇరాన్ ఆ ప్రాంతంలో పంటి కింద రాయిలా అమెరికాని సలుపుతోంది. సిరియా, గాజా, లెబనాన్, ఆఫ్గనిస్ధాన్ లతో సత్సంబంధాలే కాక నమ్మకమైన మిత్రులుగా ఇరాన్ చేసుకుంది. పెట్రోలియం నిల్వలు సైతం ఇరాన్ వద్ద పుష్కలంగా ఉన్నాయి. రాజకీయంగా, ఆర్ధికంగా, మిలట్రీ పరంగా కూడా అమెరికా, ఇజ్రాయెల్ ల ఆధిపత్య రాజకీయాలకు ఇరాన్ సవాలుగా నిలిచింది. కనుక ఇరాన్‌ని లొంగదీసుకోవాలి.

ఇరాన్ పెట్రోలియం కంపెనీలపైన అమెరికా అనేక ఆంక్షలు విధించింది. ఇరాన్ వ్యాపారాలను అడ్డుకోవడానిక్ ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తోంది. అమెరికా ఆంక్షల వలన ఇరాన్-ఇండియాల మధ్య జరుగుతునన్ పెట్రోలియం, గ్యాస్ వ్యాపారాలకు కూడా తీవ్ర అవరోధం ఏర్పడింది. ఇరాన్ ఎగుమతి చేసే ఆయిల్, గ్యాస్ లకు సొమ్ము చెల్లించడానికి ఇండియాకు మార్గం లేకుండా చేసింది అమెరికా. ఇవన్నీ చాలక సౌదీ రాయబారిని చంపడానికి పధకం వేసిందంటూ ఇరాన్ పైన ఆరోపణలు చేస్తొంది.

ఈ విషయంపైనే ఇరాన్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. ఎవరో ఒక వ్యక్తి చేసిన అనుమానాస్పద సమాచారం ఆధారంగా తమ దేశంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది. దీనిని ఇలానే అనుమతించినట్లయితే ఇక ఏ దేశమైనా మరొక దేశంపై ఆధారాలు లేకుండా ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు చేయడ పెరుగుతుందని హెచ్చరించింది. దేశాల మధ్య సంబంధాలు దీనివలన తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వెలిబుచ్చింది. అమెరికా యుద్ధోన్మాద చర్యలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో శాంతికి భంగం అని తెలిపింది. దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలనుంది అమెరికన్ ప్రజల దృష్టి మరల్చడానికీ, అమెరికా దశాబ్దాలుగా మద్దతు ఇస్తూ వచ్చిన అరబ్ నియంతృత్వ దేశాల్లో తలెత్తిన ప్రజాందోళనలనుండి దృష్టి మరల్చడానికీ కుట్రపూరిత పద్ధతుల్లో అమెరికా పన్ని ఎత్తుగడగా అమెరికా ఆరోపణలను అభివర్ణించింది. సమితికి ఇరాన్ చేసిన ఫిర్యాదు ఈ క్రింద చూడవచ్చు.

3 thoughts on “అమెరికా పచ్చి అబద్ధాల చరిత్రలో ఇంకొక పేజీ

  1. అందరూ తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని అమెరికన్ నిఘంటువుకు మాత్రమే స్వంతమైన పదాలున్నాయి. మిత్రదేశం అంటే అమెరికా మోచేతినీళ్ళు తాగడానికి తహతహలాడే దేశం. శత్రుదేశం అంటే అలా తహతహలాడని యేదైనా దేశం. ప్రపంచం అంటే అమెరికాయే. మిగతా నానా దేశాలు ‘ఏలియన్స్’ శాంతి అంటే అమెరికా ప్రయోజనం. శాంతికి భంగం కలిగించేదేశం అంటే అమెరికా ప్రయోజనాలకు యేమాత్రంమైనా దూరం పాటించేవి లేదా తమతమ స్వప్రయోజనాలను కూడా గమనించుకొనేవి అయిన అన్న దేశాలు. అభివృధ్ధి అంటే అమెరికాకు దాసోహం అవటం. అలాకానివి అభివృధ్ధి చెందని దేశాలు. ఇప్పుడు, ప్రజలారా అమెరికాను అర్ధం చేసుకోవడం మీకు యింకేమాత్రం కష్టం కాదని నమ్ముతున్నాను.

వ్యాఖ్యానించండి