హార్యానా రాష్ట్రం, అంబాలాలో పార్క్ చేసి ఉన్న కారు నుండి పోలీసులు డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్ధాలు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలలో భాగంగా ఇది వెల్లడి కాకపోవడం గమనార్హం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పందించారని పోలీసులు తెలిపారు. దీనితో మరోసారి టెర్రరిస్టు పేలుళ్ళు జరగకుండా తప్పించుకున్నట్లైంది.
సమాచారం అందుకున్నాక ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇరువురూ ఉమ్మడిగా పార్కింగ్ చేసి ఉన్న బ్లూ ఇండికా కారును తనిఖీ చేశారు. “ఐదు డిటోనేటర్లు, రెండు టైమర్ పరికరాలు, ఐదు కేజీల పేలుడు పదార్ధం రెండు ప్యాకెట్లలో ఉండగా కనుగొన్నాము. రెండు బ్యాటరీలు కూడా దొరికాయి. అంబాలా రైల్వేస్టేషన్ బయట కారు పార్కింగ్ చేసి ఉంది” అని పోలీసులు తెలిపారు. మధుబన్ తో పాటు సమీప ప్రాంతాల నుండి బాంబు నిర్వీర్యం చేసే బృందాలను రప్పించారు.
కారు రిజిస్ట్రేషన్ నకిలీదని తేలింది. హర్యానా రిజిస్ట్రేషన్ నెంబరు ఉంది. కారును దొంగిలించారని భావిస్తున్నారు. ఢిల్లీని టార్గెట్ చేశారా లేదా మరొకటా అన్నది పోలీసులు ఇంకా నిర్ధారించుకోలేదు. వివిధ పరిశోధనా సంస్ధలు, సెక్యూరిటీ ఏజన్సీల సిబ్బంది, అధికారులు పరిశీలిస్తున్నారనీ, ఇంకా తేల్చలేదనీ పోలీసులు చెప్పారని ‘ది హిందూ’ తెలిపింది.
అంబాలాలో కంటోన్‌మెంట్ ఏరియా కూడా ఉన్నందున మిలట్రీ సంస్ధలను టార్గెట్ చేసిందీ లేనిదీ కూడా పరిశోధిస్తామని పోలీసులు చెబుతున్నారు. పేలుడు పదార్ధాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. నేషనల్ సెక్యూరిటీ గార్డులు అంబాలాకు వచ్చి పేలుడు పదార్ధాలని శోధిస్తున్నారు. వివిధ టోల్ గేట్ల వద్ద ఉంచిన సిసి టి.వి రికార్డులను పోలీసులు పరిశీలిస్తారు. ఆ రికార్డుల్లో అంబాలాలో దొరికిన కారు కనపడినట్లయితే పరిశోధన మరి కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నాక పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో తీపి పదార్ధాలు ఉన్న ప్యాకెట్ దొరికింది. జమ్ములో ఉన్న ‘బారి బ్రాహ్మణ’ (Bari Brahmna) ప్రాంతంలో ఉన్న స్వీటి షాపులో ఆ స్వీట్స్ కొన్నట్లుగా తేలింది. జమ్మూ&కాశ్మీరు రాష్ట్రంలో ప్రచురితమైన రెండు వార్తా పత్రికలు కూడా దొరికాయి. అంటే కారు, జమ్ములో బయలుదేరడం గానీ, జమ్ము ద్వారా వెళ్ళడం గానీ జరిగి ఉండవచ్చు.
టెర్రరిజం దాడులపై ఉప్పందినపుడు పోలీసులు, బధ్రతా సంస్ధలు ఎవరు స్పందిస్తారో, వారు ప్రాధమికంగా చేపట్టే చర్యలు ఏమిటో ఈ వార్త కొంతమేరకైనా వివరిస్తుంది.
