ఈ బొమ్మ సైంటిఫిక్ కోణం నుండి గీసినది కాదు. శాస్త్ర పరంగా ఈ బొమ్మ కరెక్టు కాదు. ఇది సామాజిక కోణం నుండి చూస్తూ గీసిన చిత్రం. స్త్రీలు బాగా అలంకరించుకుని అందంగా తయారై అందర్నీ ఆకట్టుకోవలసిన బాధ్యత ఉన్నదని సమాజం నేర్పింది. ఉంటే వంటిల్లు, బైటికొస్తే భర్త పక్కన అందమైన భార్యగా, ఆమె అందాన్ని చూసి ఆమె భర్త పట్ల పలువురు ఈర్ష్య పడేలా ఉండాలని సమాజం వివిధ నియమ నిబంధనల ద్వారా స్త్రీలకు నేర్పింది.
ఈ సామాజిక సంస్కృతిని ఆధునిక సమాజాలు కూడా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత స్ధాయి సమాజం అని చెప్పుకునే వారిలో ఈ ధోరణి మరీ అతికి పోతోంది. అందాల పోటీలు పెట్టుబడిదారీ ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రచారం చేసిపెట్టడానికి అందమైన యువతులను తయారు చేసుకునే కార్ఖానాలుగా సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. పలానా జయశ్రీ ఫలానా సబ్బు వాడుతుందంటే ఎవరూ పట్టించుకోరు. కాని ఫలనా మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా లేదా మిస్ వరల్డ్ ఫలానా సబ్బు వాడిందంటే తప్పకుండా పట్టించుకుంటారు. అటువంటి ప్రభావం కోసమే అందాల పోటీలు, అందాల బొమ్మలు.
పార్టీలు, పబ్బుల్లో సాధ్యమైనంతగా ఒళ్ళు ప్రదర్శించేలా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ వెర్రితలలు వేసింది. కాళ్లు వీలైనంతగా ప్రదర్శించడం, లో నెక్ దుస్తులు ధరించి ఆకట్టుకునే ధోరణి పెరుగుతోంది. సమాజంలో పైకి పోయే కొద్దీ ఈ శరీర ప్రదర్శన అంత ఎక్కువగా జరుగుతోంది. కురుచ దుస్తులు ధరించి హీరోయిన్లు ఫంక్షన్లకు హాజరై కూర్చుంటే ఆమెను ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టడం మామూలైంది. పాశ్చాత్యదేశాల్లోనైతే కెమెరాలు కింది నుండి పైకి తిప్పి ఫొటోలు తీయడానికి పోటీలు పడుతున్నారు. అసలేమాత్రం సిగ్గుపడకుండా పబ్లిగ్గానే అటువంటి ఫొటోలు తీయడానికి పోటీ పడుతుండడం వివిధ ఛానెళ్లలో దర్శనమిస్తోంది.
అందాల రాణిగా తయారు కావలసిన బాధ్యతలో భాగంగా దుస్తుల ఎంపిక స్త్రీలకు కష్టంగా మారింది. కంపెనీలు అనేక రంగుల షేడ్స్ లో అందానికి ఉత్పత్తులను తెస్తున్నాయి. నెయిల్ పాలిష్ నుండి ఒంటిమీద దుస్తుల రంగుల వరకూ కాంబినేషన్, లేదా మ్యాచింగ్ ఎన్నుకోవడం స్త్రీల బాధ్యతగా మారింది. ఆ క్రమంలో రంగుల మధ్య కొద్దిపాటి తేడాలను కూడా స్త్రీలు గుర్తించే స్ధాయి వచ్చేసిందని ఈ బొమ్మ చెబుతోంది. ఇది పురుషులకు సర్టిఫికెట్ కాదు. స్త్రీలపైన విమర్శా కాదు. స్త్రీలను ఇబ్బందికర పరిస్ధితుల్లోకి నెడుతున్న సామాజిక అప భ్రంశాలపై సెటైర్ మాత్రమే.
—
