
ఒబామా అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన మూడు వారాల తర్వాత జనవరి 2009లో సి.ఐ.ఎ కి 19వ డైరెక్టర్ గా ‘లియోన్ పెనెట్టా’ ను నియమించాడు. పెనెట్టా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే, అనగా ఫిబ్రవరి 12, 2009 తేదీన “ఐస్ ఓన్లీ” అన్న పేరుతో రూపొందిన సి.ఐ.ఎ నివేదికపై సంతకం చేశాడు (కౌంటర్ కరెంట్స్, అక్టోబరు 9). మార్చి 2009లో విడుదలైన ఈ నివేదికలో ఇజ్రాయెల్ భవిష్యత్తు గురించిన విశ్లేషణ పొందుపరిచారు. అప్పటి సి.ఐ.ఎ డైరెక్టర్ లియోన్ పెనెట్టా రెండు నెలల క్రితం డిఫెన్సు సెక్రటరీగా (రక్షణ మంత్రి) నియమితుడయ్యాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇటీవలి కాలంలో అధ్యక్షుడు ఒబామాకు యూదులనుండి అందే ఎన్నికల నిధులను అడ్డుకుంటానని బెదిరిస్తుండడంతో ఇజ్రాయెల్ తో చర్చల నిమిత్తం ఒబామా, రక్షణ మంత్రి పెనెట్టాను ఇజ్రాయెల్ పంపాడు. ఈ అంశం చర్చించే ముందు రెండు సంవత్సరాల నాటి మధ్యప్రాచ్యం పరిస్ధితులను కొద్దిగా మననం చేసుకోవడం అవసరం.
2009లో అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు బాగా అడుగంటాయి. ఇజ్రాయెల్ – పాలస్తీనా చర్చలకు ఒబామా తీసుకున్న చొరవను హేళను చేస్తున్నట్లు అర్ధం వచ్చే విధంగా పదే పదే కొన్ని చర్యలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం పాల్పడింది. పరోక్ష చర్చలను నిర్వహించడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ వచ్చిన రోజునే ఆక్రమిత తూర్పు జెరూసలెం లో కొత్త సెటిల్ మెంట్ నిర్మాణాలను ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది జో బిడేన్ కు తీవ్ర అవమానంగానూ, ఒబామా ప్రయత్నాలకు శరాఘాతం లానూ తగిలింది. దానితో అమెరికా, ఇజ్రాయెల్ ల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన అనంతరం నెతాన్యాహూ వైట్ హౌస్ సందర్శించినపుడు ఆయనని ఒబామా అనేక గంటలపాటు కలవకుండా కూర్చుండబెట్టాడు. సాధారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వాధిపతి అమెరికాను సందర్శిస్తే వారితో వ్యవహారానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే సాంప్రదాయం అమెరికాలో ఉంది. అప్పుడే “మా సంబంధాలు ఇప్పుడు చెడినంతగా గతంలో ఎన్నడూ చెడలేదు” అని నెతన్యాహూ పేర్కొన్నాడు.
సెటిల్ మెంట్ల నిర్మాణం ఒకవైపు కొనసాగుతుండగా, ఎప్పటినుండో ఇజ్రాయెల్ కు మిత్రుడిగా ఉంటూ వచ్చిన టర్కీ, మధ్య ప్రాచ్యంలో నూతన శక్తిగా అవతరించే ప్రయత్నాలు చేస్తూ ఆ క్రమంలో పాలస్తీనా ప్రజల పోరాటానికి మద్దతుగా ముందుకు వచ్చింది. టర్కీ, ఇంగ్లండుల రాయబారులను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తన శాఖ కార్యాలయానికి పిలిచి మరీ అవమానించడం అప్పట్లో అంతర్జాతీయంగా పెద్ద వార్త. ఇజ్రాయెల్ లోని టర్కీ రాయబారిని కార్యాలయానికి పిలిచిన విదేశాంగ మంత్రి, ఉమ్మడి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాడు. టర్కీ రాయబారి మామూలుగా నవ్వుతూ కూర్చుండగా ఆయన కూర్చున్న ఎత్తు తక్కువ కుర్చీని హీబ్రూ భాషలో విలేఖరులకు చూపిస్తూ ఎగతాళి చేశాడు. దీనికి టర్కీ తీవ్రంగా ఆగ్రహించి, ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పేవరకూ వదల్లేదు.
ఇజ్రాయెల్ అష్ట దిగ్భంధనం కావించిన గాజా ప్రజలకు సాయం చేయడానికి మానవతా సాయంగా సరుకులను తీసుకెళ్ళిన టర్కీ దేశస్ధుల ఓడపైన ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసి తొమ్మిది మందిని కాల్చి చంపింది. ఈ ఘటనపైన ఇజ్రాయెల్ ప్రభుత్వం సవివరమైన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా ఇజ్రాయెల్ నిరాకరించింది. ఈ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. దీని పర్యవసానంగా టర్కీ ఇజ్రాయెల్ తో మిలట్రీ సంబంధాలతో పాటు అన్నింటినీ తెచ్చుకుంది. మొదటి స్దాయి ఇజ్రాయెల్ రాయబారిని తిప్పిపంపింది. గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసి 1400 వందలకు పైగా పాలస్తీనీయులను చంపడమే కాక గాజా అంతటా బాంబులతో సర్వనాశనం చేసిన ఘటనపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ నియమించిన రిచర్డ్ గోల్డ్ స్టీన్ కమిషన్ ఇజ్రాయెల్ ను తూర్పారబడుతూ నివేదిక ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ సంస్దలు రెండూ యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని చెపినా నివేదికలో అధిక భాగం ఇజ్రాయెల్ దారుణాలపైనే కేంద్రీకరించింది. ఇజ్రాయెల్ తన నేరాలపై తానే విచారణ చేయాలని గోల్డ్ స్టీన్ కమిషన్ చెప్పిన మేరకు తూతూ మంత్రంగా విచారణ జరిపి ఇజ్రాయెల్ ఊరుకుంది. ఇవన్నీ మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యానికి గండి పడుతున్న సూచనలను వెల్లడించాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ తన దురహంకార ధోరణిని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో సి.ఐ.ఎ నివేదికను చూడవలసి ఉంటుంది. “మధ్య ప్రాచ్యంలో (మిడిల్ ఈస్ట్) రాజకీయ ధోరణులు ఇలాగే కొనసాగితే మరో ఇరవై సంవత్సరాలలో ఇజ్రాయెల్ పతనం అవుతుంది” అని ఆ నివేదిక పేర్కొన్నది. “పాలస్తీనా ప్రజలు క్రమంగా భ్రమల్ని వదులుకుంటున్నారు. గౌరవాన్నీ, న్యాయాన్ని కోరే పాలస్తీనీయుల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఈ నేపధ్యంలో కూడా తమ పొరుగువారితో (పాలస్తీనా ప్రజలు) ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్ నాయకులు కనీస రాయితీలను కూడా అంగీకరించే పరిస్ధితి కనపడడం లేదు. ” అని సి.ఐ.ఎ నివేదిక పేర్కొంది. ఈజిప్టు, ట్యునీషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, జోర్డాన్ ఇంకా మరో ముగ్గురు అరబ్ నాయకుల నుండి పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించడానికి వస్తున్న పూర్తి మద్దతును ఇజ్రాయెల్ అవకాశంగా తీసుకుంటున్నది” అని తెలిపింది.
అయితే ఇజ్రాయెల్ భవితవ్యం, మధ్య ప్రాచ్యం పరిస్ధితిపై సి.ఐ.ఎ రూపొందించిన నివేదికను అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ లాబీ బైటికి రాకుండా కప్పి పెట్టింది. అమెరికాలో ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన లాబీ పని చేస్తుంది. దాని పేరు ఎ.ఐ.పి.ఎ.సి (అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ). అమెరికా చట్ట సభలపై పని చేసే లాబీలన్నింటిలో ఇది అత్యంత శక్తివంతమైనది. ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ ప్రధానులు ఈ సంస్ధ సమావేశాలకి హాజరై ఉపన్యసిస్తుంటారు. ఇది కాక కాంగ్రెస్, సెనేట్ లలో అనేకమంది ఇజ్రాయెల్ కి అనుకూలంగా చట్టాలు చేయడానికి విధానాలు రూపొంచించడానికి శ్రమిస్తుంటారు. వీరంతా వేగంగా స్పందించి ఇజ్రాయెల్ పై సి.ఐ.ఎ నివేదికను వెలుగులోకి రాకుండా అడ్డుకున్నారు. కేవలం ఏడు కాపీలు మాత్రం బహిర్గతమైనాయని తెలుస్తోంది. అవి కూడా అన్నీ ఇజ్రాయెల్ మద్దతుదారుల వద్దే ఉన్నాయని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ ప్రభుత్వంతో అమెరికా రక్షణ మంత్రి లియోన్ పెనెట్టా జరుపుతున్న చర్చల సందర్భంగా నాటి సి.ఐ.ఎ నివేదిక ప్రముఖంగా చర్చకు వచ్చినట్లుగా ప్రముఖ మధ్య ప్రాచ్య పరిశీలకుడు ఫ్రాంక్లిన్ లాంబ్ తెలిపాడు. ఇటీవలి కాలంలో నెతన్యాహూ పంపుతున్న సంకేతాల పట్ల ఒబామా అసంతృప్తిని కూడా పెనెట్టా మొసుకెళ్ళాడు. బహిరంగ సమావేశాల్లో పెనెట్టా ఇజ్రాయెల్ ను సంతోషపరిచే ప్రకటనలే చేసాడు. అందుకు నెతన్యాహూ పెనెట్టాకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. దానితో పాటు ఇజ్రాయెల్ పరిస్ధితిని ఎత్తి చూపుతూ కొన్ని పరోక్ష వ్యాఖ్యలను కూడా పెనెట్టా వెలువరించాడు. అంతర్గత సమావేశాల్లో జరిగిన చర్చల ధోరణిని ఇవి పట్టిస్తున్నాయి.
“ఇజ్రాయెల్ మిలట్రీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నదనడంలో నాకెటువంటి అనుమానాలూ లేవు. కాని అంతకంటె ముఖ్యమైన ప్రశ్న మీరు నన్ను అడగాలి. దౌత్య రంగంలో నానాటికి ఒంటరితనానికి గురవుతూ, మిలట్రీ ఆధిపత్యాన్ని సాధిస్తే అది సరిపోతుందా? మధ్య ప్రాచ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న ప్రస్తుత నాటకీయ సమయంలో ఇజ్రాయెల్ అంతకంతకూ ఒంటరిగా మిగలడం ఏమంత మంచిది కాదు. కాని ఇప్పుడు అదే జరుగుతోంది” అని పెనెట్టా విలేఖరుల సమావేశంలో పేర్కొన్నాడు. ప్రవేటు సంభాషణలలో వాతావరణం భిన్నంగా ఉన్నట్లుగా వాషింగ్టన్ వర్గాలను ఉటంకిస్తూ ఫ్రాంక్లిన్ తెలిపాడు. అరబ్ తిరుగుబాట్లు, ఇస్లామిక్ చైతన్యం చెలరేగుతున్న పరిస్ధితిలో ఇజ్రాయెల్ కి సమయం ముంచుకొస్తోందని పెనెట్టా మొహమాటం లేకుండా హెచ్చరించినట్లు తెలుస్తోంది. రెండు రాజ్యాల పరిష్కారం కుదుర్చుకోవడానికి సమయం ముగింపుకు వస్తోందని పెనెట్టా ఇజ్రాయెల్ నాయకులకు తెలిపాడు. మిగిలి ఉన్న అవకాశాలు పాలస్తీనీయులతోనూ, ఇతర పొరుగు దేశాలతోనూ శాంతి కుదుర్చుకోవడం లేదా నశించిపోవడం మాత్రమేననీ పెనెట్టా హెచ్చరించాడు.
అమెరికా వెనకా ముందూ చూడకుండా ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వగల అవకాశాలు కూడా అడుగంటుతున్నాయని పెనెట్టా చెప్పినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ కు ప్రతి సంవత్సరం వాస్తవ విలువలో 6 బిలియన్ డాలర్లకుపైగా సహాయం అందిస్తూ తద్వారా ఇజ్రాయెల్ యొక్క క్వాలిటేటివ్ మిలట్రీ ఆధిపత్యం కొనసాగేలా చూడడం అమెరికాకు కుదరకపోవచ్చని పెనెట్టా తెలిపాడు. దేశీయంగా అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, మధ్య ప్రాచ్యం నుండి దూరం జరగవలసి రావడం అన్నీ ఇజ్రాయెల్ కు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపాడు. ఒబామా అధికారానికి రాకముందే ప్రముఖ ఇజ్రాయెల్ లాబీయిస్టు హోవర్డ్ బెర్మన్ ప్రతిపాదించి ఆమోదింప జేసిన చట్టం ఇపుడు చర్చలలో నలుగుతోంది. ఈ చట్టం ప్రకారం మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగేలా ప్రతి అమెరికా అధ్యక్షుడూ కట్టుబడి ఉండాలి. అంటే ఆచరణలో అమెరికా ఇతర దేశాలకు ఎగుమతి చేసే మిలట్రీ పరికరాలు గానీ, సేవలు గానీ ఇజ్రాయెల్ మిలట్రీ ఆధిపత్యాన్ని దెబ్బతీయకుండా అధ్యక్షుడు జాగ్రత్తపడవలసి ఉంటుంది. మిలట్రీ బెదిరింపులు ఇజ్రాయెల్ కు ఎదురుకాకుండా అమెరికా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
ఇజ్రాయెల్ ఎల్లపుడూ క్యు.ఎం.ఇ (క్వాలిటేటివ్ మిలట్రీ ఎడ్జ్ – గుణాత్మక మిలట్రీ ఆధిపత్యం) కలిగి ఉండేలా చూసే బాధ్యత బెర్మన్ చట్టం ప్రకారం అమెరికాపైన ఉంది. అంటే ఏదేనా దేశం గానీ, దేశాల కూటమి గానీ లేదా రాజ్యేతర శక్తుల నుండి గానీ ఎదురయ్యే దాడులను తిప్పికొట్టే సామర్ధ్యం ఇజ్రాయెల్ కలిగి ఉండేలా అమెరికా చూడాలి. బెర్మన్ చట్టం అమలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారిందని పెనెట్టా పరోక్షంగా ఇజ్రాయెల్ ను హెచ్చరించాడు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యూద్ బారక్ ను పెనెట్టా పాత ఈజిప్టు సైనికాధికారి మాటలను గుర్తుకు తెచ్చాడు. 1973 సంవత్సరంలో ఈజిప్టు సైనికాధికారి మాటలు అప్పటి అధ్యక్ధుడు రిచర్డ్ నిక్సన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. నిక్సన్ చెప్పిందాని ప్రకారం, ఒక ఇజ్రాయెల్ అధికారి ఒక ఈజిప్టు సైన్యాధికారిని ప్రశ్నించాడట, “మీ అరబ్బులను మేము మూడు సార్లు ఓడించాము (1948, 1967, 1973). అయినా ఇంకా మమ్ముల్ని ప్రతిఘటిస్తూనే ఉంటారు ఎందుకని?” అని. దానికి ఈజిప్షియన్ జనరల్ ఇలా సమాధానం ఇచ్చాడట, “మమ్ముల్ని మూడు సార్లు ఓడింవచ్చు. పదకొండు సార్లు కూడా మీరు మమ్మల్ని ఓడించవచ్చు. కాని పన్నెండవసారి మేము గెలుస్తాము. పాలస్తీనాను విముక్తి చేస్తాము.” మాతృభూమి కోసం పరితపించే మనుషులు ఎన్ని పదుల, వందల సంవత్సరాలయినా దానిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారన్న సత్యాన్ని పెనెట్టా ఇజ్రాయెల్ పాలకులకు మరొక్కసారి పరోక్షంగానే అయినా గుర్తు చేశాడన్నమాట.
దానికి రుజువుగా విస్మరించడానికి వీలు లేని పరిణామాలకు కూడా పెనెట్టా వివరించాడు. మధ్యప్రాచ్యంలో దాదాపు డజను సార్లు తలెత్తిన తిరుగుబాట్లు ఆ కోవలోనివే. ఆ తిరుగుబాట్లన్నీ దాదాపు ఒకే లక్ష్యాన్ని పంచుకున్న సంగతిని ఎత్తి చూపాడు. పాలస్తీనాపై వాస్తవ హక్కు కలిగి ఉన్న పాలస్తీనీయులు శరణార్ధి శిబిరాలనుండి తిరిగి రావడమే ఆ లక్ష్యం.
హోస్నీ ముబారక్ పతనం తర్వాత ఈజిప్టు ప్రజలు ఇన్నాళ్ళూ నిద్రాణంగా ఉన్న తమ అరబ్ ఐడెంటిటీని సగర్వంగా నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈజిప్టు నియంతలు ఈజిప్షియన్లను అణచి వేసి ఇజ్రాయెల్ తో కుదుర్చుకున్న కేంప్ డేవిడ్ శాంతి ఒప్పందాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎంబసీపై దాడి చేసి రక్షణగా కట్టిన ఎత్తైన గోడను ధ్వంసం చేశారు. కార్యాలయం పైకి ఎగబాకి ఇజ్రాయెల్ జెండాను కిందికి విసిరి కొట్టి ఈజిప్టు జెండా ఎగరవేశారు. రెండు సార్లు వారిలా చేశారు. ఈజిప్టు ప్రజలనుండి ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఎలాగోలా తప్పించుకుని రాత్రికి రాత్రి ఇజ్రాయెల్ పయనమై వెళ్లిపోయారు. పూర్తిగా ఇజ్రాయెల్ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఈజిప్టు గ్యాస్ ను అతి తక్కువ ధరలకు ముబారక్ అందించాడు. ఈ వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈజిప్టు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెనెట్టాలాంటి అమెరికా అధికారులకు ఇజ్రాయెల్ పతనం కళ్లముందే కనిపిస్తోంది. ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు, ధనికులే ఇంకా కళ్లు మూసుకుని ఉన్నారు. మిలట్రీ ఆధిపత్య ఒక్కటి ఉండగానే సరిపోదన్న పెనెట్టా మాటల్లో ఎంతైనా నిజం ఉంది. బహుశా ఆఫ్ఘనిస్ధా, ఇరాక్ లలో అమెరికా తింటున్న ఎదురు దెబ్బలే వారికి వాస్తవాలను గుర్తించే జ్ఞానం లభించి ఉండవచ్చు.
