
ఒసామా బిన్ లాడెన్ హత్యకు దారి తీసేలా సి.ఐ.ఏ కి సమాచారం అందించిన పాకిస్ధాన్ డాక్టర్ పైన పాక్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేయడానికి నిర్ణయించింది. ఒసామా బిన్ లాడెన్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పాకిస్ధాన్ పానెల్ డాక్టర్ పై విద్రోహం కేసు నమోదు చెయాల్సిందిగా సలహా ఇచ్చింది. బూటకపు టీకా కార్యక్రమాన్ని రూపొందించి లాడెన్ ఆశ్రయం తీసుకుంటున్నాడని చెబుతున్న ఇంటిలో నివసిస్తున్నవారినుండి లాడెన్ కుటుంబ డి.ఎన్.ఎ సంపాదించాడని డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డాక్టర్ షకీల్ అఫ్రిదిని మే 2 తేదీన లాడెన్ హత్య జరిగిన కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం షకీల్ అఫ్రిదిని అరెస్టు చేసిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్ధ జిన్‌హువా తెలిపింది.
షకీల్ అహ్మద్ ను విడుదల చేయాలని అమెరికా పాక్ ప్రభుత్వం పైన తీవ్రంగా ఒత్తిడి చేసినప్పటికీ పాక్ అందుకు ఒప్పుకోలేదని వార్తా సంస్ధలు గతంలో వెల్లడించాయి. షకీల అహ్మద్ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసాడనేందుకు, దేశ విద్రోహానికి పాల్పడ్డాడనేందుకు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు కమిషన్ నివేదిక పేరొన్నదని ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. సంబంధిత నేరాలకు గాను డాక్టర్ పై కేసు నమోదు చేసి పాక్ చట్టాల ప్రకారం విచారించాలని కమిషన్ సిఫారసు చేసింది.
పాకిస్ధాన్ అధికారులు ఒసామా బిన్ లాడేన్ కుటుంబ సభ్యులను విదేశాలకు అప్పగించకుండా గతంలో జారీ చేసిన ఆదేశాలను కమిషన్ వెనక్కి తీసుకుంది. ఇది ముఖ్యమైన పరిణామంగా పేర్కొనవచ్చు. పాక్ కస్టడీలో ఉన్న ఒసామా భార్యలు ఇద్దరిని, ఒక కూతురిని తమకు అప్పజెప్పాలని అమెరికా గతంలో కోరింది. కమిషన్ అందుకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడంతో వారిని అప్పగించడం కుదరలేదు. కమిషన్ ఇప్పుడు తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో ఒసామా బిన్ లాడేన్ భార్యలను, కూతురిని అమెరికాకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ భార్యలతో ఇక తమకు పని లేదని కమిషన్ పేర్కొంది.
ప్రధాన గూఢచార సంస్ధ అధిపతిని కమిషన్ రెండు రోజుల వ్యవధిలో మరొకసారి ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తోంది. ఐ.ఎస్.ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషాను విస్తృతంగా ఇంటర్వ్యూ చేసింది. అబ్బోత్తాబాద్‌లో లాడెన్ హత్యకు దారితీసిన ఘటనపై షుజా పాషా దృక్పధాన్ని కమిషన్ తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ చేసింది. ఒసామా బిన్ లాడెన్ ఇల్లుగా చెబుతున్న నివాస కాంపౌండ్ ను సెక్యూరిటీ బలగాలు పౌర అధికారులకు అప్పగించడానికి కూడా కమిషన్ గతంలో అంగీకరించింది. చట్టం ప్రకారం లాడెన్ ఇంటికి సంబంధించిన మిగిలిన కార్యక్రమాలను పౌర అధికారులు పూర్తి చేయవలసి ఉంది.
లాడెన్ ఇంటికి సంబంధించి కమిషన్ తీసుకున్న నిర్ణయం ఆ ఇంటిని ధ్వంసం చేయడానికి దారి తీయవచ్చు. బిన్ లాడెన్ హత్య జరిగినప్పటినుండీ అబ్బోత్తాబాద్ ఇంటిని ప్రతిరోజూ సందర్శకులు చూడడానికి వస్తున్నారు. క్రమంగా లాడెన్ కు స్మారక మందిరంగా సదరు ఇంటిని ప్రజలు మార్చే అవకాశాలు కనిపిస్తుండడంతో అమెరికాతో పాటు పాకిస్ధాన్ ప్రభుత్వం కూడా బెంబేలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. సద్దాం హస్సేన్‌ను పాతి పెట్టిన ప్రదేశం వద్ద ప్రార్ధనా మందిరం నెలకొల్పి సద్దాంను అమరవీరుడుగా ఇరాక్ ప్రజలు భావిస్తున్న పరిస్ధితి ఇప్పుడు ఇరాక్ లో నెలకొని ఉంది. అటువంటి పరిస్ధితి రాకూడదనే లాడెన్ ను ఎవరికీ తెలియని చోటులో అమెరికా పాతి పెట్టిందని గతంలో వార్తా సంస్ధలు కధనాలు ప్రచురించాయి.
కాని పాకిస్ధాన్ భద్రతా బలగాలు అబ్బొత్తాబాద్ ఇంటికి దారితీసే అన్ని రోడ్లనూ మూసివేసి అక్కడికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. కనీసం జర్నలిస్టులను కూడా అనుమతించడం లేదు. ఈ చర్యలన్నీ అమెరికాను సంతోషపరిచేవే. ఒసామా బిన్ లాడెన్ భార్యలను, కూతురిని అమెరికాకు అప్పగించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా అమెరికాను సంతోషపరిచే చర్య. పాకిస్తాన్ దర్యాప్తు సంస్ధ కూడా అంతిమంగా అమెరికా అనుకూల నిర్ణయాలను తీసుకోవడం చూస్తే అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు ఏ మేరకు చెడ్డాయో, ఏ మేరకు చెడకుందా ఉన్నాయో అనుమానాలు తలెత్తడం సహజమే. పాక్, అమెరికాల సంబంధాలు అంతిమంగా పాక్ ప్రజలకు ప్రతికూలంగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. పాకిస్ధాన్ పాలకుల స్వభావం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగి ఉండే స్వభావం కావడమే దానికి కారణం.
