సంక్షోభ పరిస్ధితుల్లో దిక్కు తోచని సంపన్నులు


యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి స్తంభనలు ప్రపంచ సంపన్నులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తమ సంపదలను ఎక్కడ మదుపు చేస్తే క్షేమంగా ఉంటుందో అంచనా వేయలేక సతమతమవుతున్నారు. ఎల్లప్పుడూ తమ సంపదలను వృద్ధి చేసుకోవడానికి ఎత్తులు పైఎత్తులలో మునిగి తేలుతూ ఉండే వాళ్ళు ఇప్పుడు వృద్ధి సంగతి అటుంచి అవి తరిగిపోకుండా ఉండడానికి గల మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు అప్పుడే వినాశకకర పరిస్ధితులో పెట్టుబడులను ఎక్కడికి తరలిస్తారో గమనించి అటువంటి చోట్లను వెతుకులాడుతున్నారు.

డబ్బు పెంచుకోవడం కాక డబ్బును ఎలా కాపాడుకోవాలన్నదే సమస్యగా మారిందన్న సంగతిని తమ కస్టమర్లకు చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు. ద్రవ్యోల్బణం సంపదలను, పొదుపును హరించి వేస్తుండడం, అత్యంత తక్కువ వడ్డీ రేట్లు పెట్టుబడులపై ఆదాయలను తెచ్చుకోవడం కఠినతరంగా మార్చివేసింది. అనేకమంది ధనికులు కనీసం స్ధిరంగా ఉండడానికి నూతన రిస్క్ లకు పాల్పడుతున్నారని విశ్లేషకులు వివరిస్తున్నారు. మదుపరులు, ప్రమాదకర పరిస్ధితుల్లో వేయగల ఎత్తుగడలవైపు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

“చాలా మార్కెట్లలో ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నది. ఏదో ఓక రిస్కు తీసుకోనిదే సంపదలను కనీసం కాపాడుకునే స్ధాయిని కూడా పొందలేని పరిస్ధితి ఉంది” అని జర్మనీ డ్యూశ్చ్ బ్యాంక్ కి చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి పేర్కొన్నాడు. సంక్షోభ పరిస్ధితుల్లో సంపదలను ఏ విధంగా పెట్టుబడులను వివిధీకరించాలన్న విషయంలో ఒక నమూనా పలువురిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నమూనా ప్రకారం ఒక మూడో వంతు సంపదను బంగారంలో మదుపు చెయ్యవలసి ఉంటుంది. మరొక మూడో వంతు భాగాన్ని వివిధ రక్షణాత్మక అంతర్జాతీయ బ్లూ చిప్ కంపెనీలలో మదుపు చెయ్యాలి. మిగిలిన మూడోవంతు భాగాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక భద్రత కలిగిన దేశాల సావరిన్ అప్పు బాండ్లలో మదుపు చేయాల్సి ఉంటుంది.

అంతకంటే తక్కువ స్ధాయి ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు కావాలనుకుంటే సంఖ్యలో తక్కువగానూ, విలువలో ఎక్కువగానూ ఉన్న షేర్లను ఎంచుకోవాలని స్విస్ బ్యాంకు వీజిలిన్ తన కస్టమర్లకు సలహా ఇస్తోంది. అయితే బ్యాంకింగ్ వ్యవస్ధే అస్ధిర పరిస్ధితుల్లో ఉండడంతో డబ్బు ఎక్కడ ఉంచాలన్నది పెద్ద సవాలుగా మారిన నేపధ్యంలో బ్యాంకర్ల సలహాలు ఎంతవరకు ఆధారపడదగినవో తెలియకుండా ఉంది. అండర్ వెయిట్ షేర్లలో 25 నుండి 30 శాతం వరకు మదుపు చేయ్యాలని ఇప్పుడు బ్యాంకర్లు సలహా ఇస్తున్నారు. ఇది గతంలో 40 శాతం వరకూ ఉండడం గమనార్హం.

సమస్యాత్మక దేశాల్లోని మదుపరులు తమ పెట్టుబడులను బైటి దేశాలకు తరలించడానికి ఇష్టపడుతున్నారు. దక్షిణ యూరప్ ప్రాంత దేశాలు, అరబ్ విప్లవాలు చెలరేగిన మధ్య ప్రాచ్య దేశాలు ఇలాంటి కేటగిరీ కిందకు వస్తాయి. దక్షిణ యూరప్ దేశాల్లో ఆర్ధిక సంక్షోభం భయపెడుతుండగా, మధ్య ప్రాచ్యంలో రాజకీయ సంక్షోభం మదుపరులను భయపెడుతోంది. ఇప్పటివరకూ ఈ దేశాల ధనికులు, అధిక లాభాలు వస్తున్నందున, దేశీయంగా మదుపు చేసుకోవడంపైనె ఎక్కువ ఆసక్తి కనపరిచారు. ఇపుడు అధిక లాభాలను చూసుకుంటే సమీప భవిష్యత్తులో ఎదురుకానున్న ఆర్ధిక వినాశకర పరిస్ధితులు తమ పెట్టుబడులను మొత్తంగా తుడిచిపెడతాయన్న ఆందోళన వీరిని తొలిచివేస్తున్నది.

మధ్య ప్రాచ్యంలోని మదుపుదారులను రియల్ ఎస్టేట్ రంగం అమితంగా ఆకర్షిస్తున్నదని రాయిటర్స్ సంస్ధ చెబుతోంది. అందునా లండన్ లోని నివాస, వాణిజ్య భవనాలలో మదుపు చేయడానికే ఆసక్తి కనబరుస్తున్నారని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్ బ్యాంకు అంతర్జాతీయ విభాగం అధిపతిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. తాము ప్రత్యక్షంగా చూడగలిగి తాకగల రియల్ ఎస్టేట్ రంగం వారి నమ్మకాన్ని స్ధిరపరుస్తున్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులవల్ల ఆర్ధిక వ్యవస్ధలపై ధనికులు ఏవిధంగా నమ్మకం కోల్పోయిందీ ఈ అంశం తెలుపుతోంది.

అరబ్ బిలియనీర్లు లండన్ రియల్ ఎస్టేట్ రంగంలోని తమ పెట్టుబడులను పెంచుకోవడమే కాకుండా పారిస్ నగరానికి కూడా తమ పెట్టుబడులను విస్తరిస్తున్నారని ఆర్.బి.ఎస్ ప్రతినిధి తెలిపాడు. 2008 ఆర్ధిక సంక్షోభం రోజుల్లో స్పెయిన్ సంపన్నులు తమ సొమ్ముని బైటి దేశాల షేర్లు, బాండ్లలోకి తమ పెట్టుబడులను తరలించారని స్పెయిన్ బ్యాంకు బి.బి.వి.ఎ ప్రతినిధి తెలిపాడు. అప్పటివరకూ వారి మదుపును వివిధీకరించడానికి ఇచ్చిన సలహాలను ఎన్నడూ వినలేదని ఆయన తెలిపాడు. స్పెయిన్ ధనికులు రాబోయె రెండు సంవత్సరాలలో స్పెయిన్ లో సంపదల సృష్టికి నడుం బిగించకపోవచ్చునని డ్యూశ్చ్ బ్యాంక్ స్పెయిన్ శాఖ ప్రతినిధి తెలిపాడు.

గత దశాబ్దం పొడవునా సంపదల వృద్ధి పెద్ద ఎత్తున జరగడంతో స్పెయిన్ ధనికులు తమ సొమ్ముని దేశీయంగానే మదుపు చేయడానికి ఆసక్తి చూపారు. ఇప్పుడు రుణ సంక్షోభం స్పెయిన్ ను చుట్టుముట్టడంతో తమ సంపధలను నిలుపుకోవడానికి స్పెయిన్ ధనికులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

ధనికులకు సంపదలను దాచుకోవడానికి తమ దేశం కాకుంటే మరొక దేశం రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తుంది. ప్రపంచీకరణ పుణ్యామాని ధనికులకు అవకాశాలు అపారంగా సమకూరాయి. పేద శ్రామికులు తమ శ్రమను అమ్ముకోవడానికి లేని సరిహద్దులు కూడా మొలుస్తుండడం ప్రపంచవ్యాపితంగా ఉన్న పేద, ధనిక వ్యత్యాసాలను వెల్లడి చేస్తున్నది. సరిహద్దులు లేకుండా సంపదల ప్రవాహానికి అనుమతిస్తున్న ప్రభుత్వాలు శ్రామికుల ప్రవాహానికి అనేక అడ్డంకులు పెడుతున్నాయి. ప్రపంచీకరణ ధనికుల కోసమే తప్ప శ్రామికుల కోసం కాదని ఇంకా ఎవరికైనా అనుమానం ఉందా?

One thought on “సంక్షోభ పరిస్ధితుల్లో దిక్కు తోచని సంపన్నులు

  1. “సరిహద్దులు లేకుండా సంపదల ప్రవాహానికి అనుమతిస్తున్న ప్రభుత్వాలు శ్రామికుల ప్రవాహానికి అనేక అడ్డంకులు పెడుతున్నాయి. ప్రపంచీకరణ ధనికుల కోసమే తప్ప శ్రామికుల కోసం కాదని ఇంకా ఎవరికైనా అనుమానం ఉందా?”

    పెట్టుబడుల తరలింపుకు సరిహద్దులు లేవు అన్నది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. టీకొట్టు నడిపేవాడు కూడా తను వ్యాపారం చేస్తున్న చోటు లాభదాయకంగా లేకపోతే షావు మూసేస్తాడు లేదా మరోచోటికి వెళ్లిపోతాడు. ఇది వ్యాపారంలో సహజం. కాని ‘ప్రభుత్వాలు శ్రామికుల ప్రవాహానికి అనేక అడ్డంకులు పెడుతున్నాయి’ అనే అంశాన్ని మరి కాస్త వివరించండి.

వ్యాఖ్యానించండి