
ఇప్పటివరకూ సి- వద్ద ఎస్.బి.ఐ రేటింగ్ ఉండగా దానిని మూడీస్ సంస్ధ డి+ కు తగ్గించింది. ఎస్.బి.ఐ వద్ద పెట్టుబడి తక్కువగా ఉన్నదనీ, సంపదల క్వాలిటీ క్షీణిస్తున్నదనీ దానికి కారణాలుగా చూపింది. దానితో ఎస్.బి.ఐ షేర్ విలువ నాలుగు శాతం నష్టపోయింది. ఒక దశలో ఆరు శాతం నష్టపోయిన ఎస్.బి.ఐ షేరు, తర్వాత రెండు శాతం కోలుకుంది.
ఎస్.బి.ఐ రేటింగ్ ను ఒక అడుగు డౌన్ గ్రేడ్ చేయడం తోనే మూడు వందల వరకూ పాయింట్లను సెన్సెక్స్ నష్టపోవడం చూస్తే మార్కెట్ అత్యంత సున్నితంగా ఉన్నదని స్పష్టమవుతోంది. ఏ చిన్న మార్పు జరిగినా తేలికగా ప్రభావితమయ్యే రీతిలో షేర్ మార్కెట్లు సున్నితంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మార్కెట్ అనవసరంగా ఎక్కువగా నష్టపోయిందనీ, ఏ చిన్న పాజిటివ్ వార్త వచ్చినా మళ్ళి లాభపడుతుందనీ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రపంచ స్ధాయిలో షేర్ మార్కెట్లు గత 15 నెలల్లో అత్యల్ప స్ధాయికి పడిపోయాయని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇతర కరెన్సీల విలువ తగ్గుతుండడంతో ఇన్‌వెస్టర్లు డాలర్ కరెన్సీలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. దానితో డాలర్ విలువ గత తొమ్మిది నెలల్లో అత్యధిక విలువను పొందింది.
యూరప్ రుణ సంక్షోభం అతి పెద్ద బ్యాంకింగ్ సంక్షోభం కిందికి మారవచ్చునని భయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీసు దేశం త్వరంలోనే అప్పు చెల్లించలేని ‘డిఫాల్టు’ దశకు చేరుకోవచ్చుననీ ఫలితంగా ప్రపంచ ఆర్ధిక వృద్ధి మరింతగా క్షీణిస్తుందని భయాలు వ్యాపించాయి. దానితో డాలర్లలో పెట్టుబడులు పెట్టడానికి మదుపుదారులు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా డాలర్ విలువ పెరిగింది.
యూరప్ లో బ్లూచిప్ షేర్ల సూచిక, మంగళవారం రెండు శాతానికి పైగా నష్టపోయింది.
గత దశాబ్దకాలంలో ఇండియా లాంటి దేశాల్లో సైతం షేర్ మార్కెట్లలో మదుపు చేయడం ఒక వ్యసనంగా స్ధిరపడింది. మధ్యతరగతి ఉద్యోగులు అధికంగా తమ పొదుపుని షేర్ మార్కెట్లలో మదుపు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో భారత షేర్ మార్కేట్ల కదలికలపైన అధ్యయనం చేయడం, కదలికలకు కారణాలను అధ్యయనం చేయడం ఒక అవసరంగా మారింది.
మధ్య తరగతి జీవుల ఆర్ధిక స్ధితిగతులను అధ్యయనం చేయడానికి వారిపైన షేర్ మార్కెట్ల ప్రభావాన్ని కూడా అంచనా కట్టవలసిన అనివార్యత తలెత్తింది. కనుక షేర్ మార్కెట్ వార్తలను కవర్ చేయడం ఒక అనివార్యతగా ముందుకొచ్చింది. షేర్ మార్కెట్ వార్తలు ఎంత చెత్త అయినప్పటికీ ప్రజలు వాటివలన ప్రభావం అవుతున్నంత కాలం షేర్ల అధ్యయనం తప్పదు.
