ఆ చట్టం ఆమోదిస్తే ‘వాణిజ్య యుద్ధం’ తప్పదు, అమెరికాకి చైనా హెచ్చరిక


చైనా కరెన్సీ విలువ పెంపుదలపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని పూనుకోవడాన్ని చైనా తీవ్రంగా ఖంచించింది. చైనా కృత్రిమంగా తన కరెన్సీ యువాన్ విలువను అతి తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని అమెరికా గత రెండు సంవత్సరాలుగా ఆరోపిస్తోంది. యూరప్, ఇండియాలు కూడా చైనాపైన ఇదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అమెరికా అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. చైనా కరెన్సీ యువాన్ విలువను తక్కువ విలువ వద్ద ఉంచడం వలన చైనా సరుకుల ధరలు తక్కువగా ఉంటున్నాయని దానితో అది సరుకులను ప్రపంచ మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా అమ్ముకోగలుగుతున్నదని అమెరికా, యూరప్ లు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా చైనాకు అత్యధిక మొత్తాలలో వాణిజ్య మిగులు సమకూరుతున్నదని వాణిజ్య సమతూక సాధించడానికి వీలుగా చైనా యువాన్ విలువ పెరగడానికి అనుమతించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.

చైనా యువాన్ విలువ పెంచడానికి అనుమతించనట్లయితే ఆ దేశాన్ని కరెన్సి మానిపులేటర్ దెశంగా (తమ ఎగుమతులకు సానుకూలతను సాధించడానికి వీలుగా కరెన్సీ విలువను కృత్రిమంగా నియంత్రించే దేశం) చిత్రిస్తామని కొన్ని నెలలుగా అమెరికా కాంగ్రెస్ సభ్యులు హెచ్చరిస్తూ వచ్చారు. యువాన్ విలువ పెరగడానికి చైనా పాక్షికంగా అనుమతిస్తున్నానని చైనా ప్రకటించిన తర్వాత కూడా యువాన్ విలువ పెద్దగా పెరగలేదు. దానితో అమెరికా, యూరప్ లు నిస్పృహకు గురవుతున్నాయి. అమెరికా ఎట్టకేలకు చైనాపై ఒత్తిడి తేవడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా కరెన్సీ మానిపులేటర్ గా చైనాను నిర్ధారించి ఆ దేశంపైన వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికా సమాయత్తమవుతోంది.

ఈ నేపధ్యంలో అమెరికాకు చైనా హెచ్చరిక జారీ చేసింది. చైనాను కరెన్సీ మానిపులేటర్ గా నిర్ధారిస్తూ చట్టం చేసినట్లయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని హెచ్చరించింది. అమెరికా, కరెన్సీ సమస్యలను రాజకీయం చేస్తున్నదని చైనా సెంట్రల్ బ్యాంకు, వాణిజ్య శాఖ, విదేశాంగ శాఖల మంత్రులు నిందించారు. అమెరికా కాంగ్రెస్ లో ఈ వారం చర్చకు రానున్న బిల్లు ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాలను ఉల్లంఘిస్తున్నదని చైనా ఆరోపించింది. యువాన్ విలువను పెంచాలని ఒత్తిడి చేసినట్లయితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను సంక్షోభం నుండి బైటపడవేయడానికి జరుగుతున్న ఉమ్మడి ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని చైనా హెచ్చరించింది.

“‘కరెన్సీ అసమతూకం’ సమస్యను అడ్డు పెట్టుకున్నట్లయితే మారకపు విలువ సమస్యను మరింత తీవ్రం అవుతుంది. రక్షణాత్మక విధానాలు అవలంబించడం ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాని ఉల్లంఘించడమే. అమెరికా, చైనాల ఆర్ధిక సంబధాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి” అని చైనా విదేశాంగ ప్రతినిధి ‘మా ఝాక్సు’ తెలిపాడు. చైనా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ఆయన ఈ ప్రకటన చేశాడు. దీనిని చైనా దృఢంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పాడు.

“కరెన్సీ ఎక్ఛేంజి ఓవర్ సైట్ రిఫార్మ యాక్ట్ – 2011” పేరుతో పిలుస్తున్న చట్టంపై చర్చ జరగడానికి సోమవారం అమెరికా కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా నిర్ణయించింది. కరెన్సీ విలువ తగ్గించడం ద్వారా తమ ఎగుమతులకు సానుకూలతను సంపాదించే దేశాల ఉత్పత్తుల ఎగుమతులపై పెద్ద ఎత్తున ప్రతీకార పన్నులు వేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. 2012 అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న అమెరికా చట్ట సభల సభ్యులు చైనా కృత్రిమంగా యువాన్ విలువ తగ్గించడం వలన అమెరికాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని సరైన స్ధాయిలో యువాన్ విలువ ఉన్నట్లయితే అమెరికా వార్షిక బడ్జెట్ లోటును 250 బిలియన్ల డాలర్లవరకూ తగ్గించవచ్చని ప్రచారం చేస్తున్నారు.

“అమెరికా చైనాల మధ్య గల విశాలమైన వాణిజ్య, ఆర్ధిక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే అమెరికా నాయకులు ఏదైనా చెయ్యాలని చైనా హెచ్చరించింది. కరెన్సీ విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో సంస్కరిస్తామన్న చైనా నిర్ణయాన్ని మా మరొకసారి గుర్తు చేశాడు. చైనాను కరెన్సీ మానిపులేటర్ గా చిత్రించే చట్టం సెనేట్ లో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో తక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. రెండు సభలు ఆమోదించినట్లయితే అది చట్టంగా మారడానికి అధ్యక్షుడు ఒబామా వద్దకు వెళుతుంది. బిల్లుపై సంతకం చేసి చైనా ఆగ్రహానికి గురికావడం ఆ తర్వాత చైనా హెచ్చరిస్తున్న వాణిజ్య యుద్ధానికి సిద్ధం కావడమా లేక బిల్లుని వీటో చేసి దౌత్య సంబంధాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యడమా అన్న డైలమాను ఒబామా ఎదుర్కొంటున్నాడు.

“తన కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం ద్వారా తన సరుకులకు సానుకూలతను సంపాదిస్తున్నదని చైనాపైన ఇరు పక్షాల సెనేటర్లూ భావిస్తున్నారు” అని సెనేట్ మెజారిటీ నాయకుడు హారే రీడ్ అన్నట్లుగ రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆరోపణలను చైనా తిరస్కరించడాన్ని ‘రొటీన్’ చర్యగా రాయిటర్స్ చర్య అభివర్ణిస్తోంది. అయితే, తన ఆర్ధిక సమస్యలకు చైనా కరెన్సీ విధానం కారణమని అమెరికా ఆరోపించడం కూడా రొటీన్ అన్న విషయాన్ని రాయిటర్స్ సంస్ధ అభివర్ణించడానికి ఇష్టపడలేదు. చైనా కరెన్సీ విలువ ఏవో కొద్ది అంశాలకు మాత్రమే సంబంధించినదనీ, అమెరికా తన సొంత సమస్యలను పరిష్కరించకుండా చైనా యువాన్ విలువ పెంచినా పెద్దగా అమెరికాకి ప్రయోజనం ఉండదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ స్వయంగా అనేకమార్లు చెప్పాడు.

“తక్కువ పొదుపును చేయడం, అత్యధిక నిరుద్యోగం, అత్యధిక వాణిజ్య లోటు లాంటి అమెరికా సమస్యలను యువాన్ బిల్లు పరిష్కరించదు. కాని చైనా యువాన్ విలువ విధానాన్ని సంస్కరించేవైపుగా చైనా సాధించిన పురోగతిని ఆ బిల్లు తీవ్రంగా ఆటంకపరుస్తుంది” అని చైనా ప్రతినిధి మా తెలిపాడు. అది చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధానికి కూడా దారి తీయవచ్చు అని మా హెచ్చరించాడు. గత సంవత్సరం జూన్ నెల నుంది ఇప్పటివరకూ ఏడు శాతం యువాన్ విలువ పెరిగింది. వాస్తవానికి యువాన్ విలువ నలభై శాతం వరకూ పెరగాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అంతవరకూ యువాన్ విలువను తగ్గిస్తే చైనాలో ఎన్ని పరిశ్రమలు మూతబడతాయో, ఎంతమంది పట్టణాలకు వలస వచ్చినవారు తిరిగి గ్రామాలకు చేరుకుంటారో, సామాజికంగా ఎంత తీవ్రమైన సంభవిస్తాయో తాను అంచనా వేయజాలననీ చైనా ప్రధాని అమెరికా-చైనా వాణిజ్య ప్రతినిధుల సమావేశంలో ఈ సంవత్సరారంభంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

చైనా ద్రవ్యోల్బణం ఇప్పటికె యువాన్ విలువను మరింత సమతూకానికి దగ్గరకు చేరేలా చేసిందని చైనా సెంట్రల్ బ్యాంకు వ్యాఖ్యానించింది. అమెరికా తన సొంత వైఫల్యాలని చైనా మీదికి నెట్టివేయాలని ప్రయత్నిస్తున్నదని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి షెన్ డాన్యాంగ్ అన్నాడు. “దేశీయ తగాదాలని విదేశాల మీదకు మరలించాలని ప్రయత్నించడం అన్యాయం. అంతే కాక అది ప్రామాణిక అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధం కూడా. చైనా ఈ పద్ధతిని వ్యతిరేకిస్తుంది” అని ఆయన అన్నాడు. “ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి జరుగుతున్న ఉమ్మడి ప్రయత్నాలు ఈ పద్ధతి వలన దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్లిష్టమైన, సున్నితమైన, మార్పుకు గురవుతున్న కాలంలో ఉన్నది. కనుక మరింతగా స్ధిరమైన అంతర్జాతీయ ద్రవ్య వాతావరణం ఉండడం అవసరం” అని షెన్ పేర్కొన్నాడు.

యువాన్ బిల్లు సెనేట్ ఆమోదించినప్పటికీ రిపబ్లికన్ల్ ఆధీనంలో ఉన్న కాంగ్రెస్ ఆ బిల్లుని సీరియస్ గా పరిగణించడం లేదని కొద్ది మంది చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఈ బిల్లు చర్చకు వచ్చేదీ లేనిదీ అనుమానమేనని కూడా వారు చెబుతున్నారు. చైనాతో వాణిజ్య యుద్ధం సరికాదని హెచ్చరిస్తున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉండడం గమనార్హం. రెండు దురాక్రమణ యుద్ధాలను సాగిస్తున్న అమెరికా తన యుద్ధ పిపాసను తగ్గించుకుంటే తప్ప ఆర్ధికంగా కోలుకునే అవకాశాలు ఉండవు. అత్యధిక మొత్తాన్ని యుధ్దాలకు, రక్షణ రంగానికి దోచి పెడుతున్న అమెరికా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధానాలు అమలు చేయడం తక్షణ అవసరం. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలంటే వారికి ఉపాధి సౌకర్యాలు విస్తృతంగా కల్పంచాలి. ఉద్యోగులకు సంక్షేమ సధుపాయాలు కల్పించి తద్వారా వారి డబ్బును మిగిలించగలిగితే దానిని ఇతర సరుకుల కొనుగోలుకు ప్రజలు వినియోగించగలుగుతారు. తద్వారా ఆర్ధిక వ్యవస్ధలో చురుకుదనం ప్రవేశించి జిడిపి వృద్ధికి దోహదం చేస్తుంది. కాని ఓవైపు యుద్ధాలు చేస్తూ, మరొకవైపు ఆర్ధికసంక్షోభం పుణ్యమాని బిలియనీర్లకు బెయిలౌట్లు మంజూరు చేస్తూ, పొదుపు చర్యలతో ప్రజల గోళ్లు ఊడగొడుతూ ఆర్ధిక వృద్ధి జరగడం లేదని నిట్టూర్చడం మోసం తప్ప మరొకటి కాదు.

వ్యాఖ్యానించండి